శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 28 ఆగస్టు 2018 (14:58 IST)

రాజీవ్ తరహాలో మోడీ హత్యకు కుట్ర... విరసం నేత వరవరరావు అరెస్టు

ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు విప్లవ రచయితల సంఘం(విరసం) నేత వరవరరావును పూణె పోలీసులు అరెస్టు చేశారు. మోడీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నారన్న వార్త ఇటీవల కలకలం రేపిన విషయం తెల్సిందే. మోడీ హత్యకు వరవరరావ

ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు విప్లవ రచయితల సంఘం(విరసం) నేత వరవరరావును పూణె పోలీసులు అరెస్టు చేశారు. మోడీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నారన్న వార్త ఇటీవల కలకలం రేపిన విషయం తెల్సిందే. మోడీ హత్యకు వరవరరావు నిధులు సమకూర్చినట్టు సమాచారం. దీంతో ఆయన్ను అరెస్టు చేసి పూణెకు తరలించనున్నారు.
 
ముఖ్యంగా, మోడీని రాజీవ్ గాంధీ తరహాలో హత్య చేసేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారట. ఈ కుట్రలో వరవరరావు పాత్ర కూడా ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఆపరేషన్‌కు వరవరరావు నిధులు సమకూర్చినట్లు సమాచారం. మహారాష్ట్రలోని మావో సానుభూతిపరుడు రొనాల్డ్ విల్సన్ వద్ద లభ్యమైన లేఖలో వరవరరావు పేరు ఉండటంతో అప్పట్లో అధికారులు కేసు నమోదు చేశారు. 
 
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్యచేసిన తరహాలో నరేంద్ర మోడీని మట్టుబెట్టాలని మావోయిస్టులు కుట్ర పన్నినట్లు ఉన్న లేఖలను పుణె పోలీసులు 3 నెలల క్రితం విల్సన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. డబ్బు కావాలంటే వరవరరావు సమకూరుస్తారని ఆ లేఖల్లో ఉంది. 
 
దీంతో గత మూడు నెలల పాటు ఈ లేఖల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిన పోలీసులు.. మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని వరవరరావు, ఆయన కుమార్తె ఇంటితో పాటు, ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణ, జర్నలిస్ట్ కూర్మనాథ్, క్రాంతి టేకులతో పాటు మరో ఇద్దరి ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించి వరవరరావును అరెస్టు చేశారు.