బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 23 ఏప్రియల్ 2018 (15:52 IST)

బాలికలపై అత్యాచారానికి పాల్పడితే ఇక ఉరే... ఆర్డినెన్స్‌కు రాజముద్ర

దేశంలో పెరిగిపోతున్న అత్యాచారాల అడ్డుకట్టకు కేంద్రం నడుం బిగించింది. ఇందులోభాగంగా, 12 యేళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడేవారిని ఉరితీయనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌కు రా

దేశంలో పెరిగిపోతున్న అత్యాచారాల అడ్డుకట్టకు కేంద్రం నడుం బిగించింది. ఇందులోభాగంగా, 12 యేళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడేవారిని ఉరితీయనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదముద్రవేశారు. ఈ మేరకు ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి ఆదివారం సంతకం చేశారు.
 
కథువా (జమ్మూకాశ్మీర్), సూరత్‌ (గుజరాత్)లలో మైనర్ బాలికలపై లైంగికదాడి, హత్య, ఉన్నావ్ (ఉత్తరప్రదేశ్) గ్యాంగ్‌రేప్ ఘటనలతో దేశవ్యాప్తంగా నిరసన పెల్లుబికిన నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం శనివారం సమావేశమై.. లైంగిక దాడుల నుంచి బాలికల సంరక్షణ (పోక్సో) చట్టానికి సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. 
 
ఈ ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి కార్యాలయానికి పంపించగా రాష్ట్రపతి కోవింద్ సంతకం చేశారు. అనంతరం రాష్ట్రపతి భవన్ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లేవు. దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ ఆర్డినెన్స్‌పై తక్షణ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముందని రాష్ట్రపతి భావించారు. అందువల్ల భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 123 క్లాజ్ (1) ఇచ్చిన అధికారాల మేరకు రాష్ట్రపతి ఈ ఆర్డినెన్స్‌ను జారీ చేస్తున్నారు అని గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 
 
తాజా చట్ట సవరణ ప్రకారం.. పన్నెండేళ్లలోపు బాలికపై లైంగికదాడికి పాల్పడేవారికి కనిష్టంగా 20 యేళ్ళ జైలు, గరిష్టంగా మరణశిక్ష లేదా మరణించేవరకు జైలుశిక్ష విధిస్తారు. 16 యేళ్లలోపు బాలికలపై లైంగిక దాడికి పాల్పడితే దోషులకు విధించే శిక్షను పదేళ్ళ నుంచి 20 యేళ్ళ, నేరం తీవ్రతను బట్టి మరణించేవరకు జైలు శిక్షను విధించవచ్చు. 16 యేళ్లలోపు బాలికలపై లైంగికదాడికి పాల్పడిన వారికి ఎలాంటి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని ఈ చట్టంలో పొందుపరిచారు.