సైకిల్ స్పీడుకి సైకో పోతాడు, భారీ విజయం దిశగా NDA కూటమి, తెదేపా అంచనాలు
ఓటరు చైతన్యం పోటెత్తింది, గెలుపు శబ్దం వినిపిస్తుంది, కూటమిదే విజయం అంటుంది, సైకిల్ సునామీలో కొట్టుకుపోతోన్న సైకో గ్యాంగ్.. ఇవీ తెలుగుదేశం పార్టీ తమ విజయావకాశాలపై చెబుతున్న మాటలు. ప్రజా కంటకంగా మారిన జగన్ సర్కారుకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చరమగీతం పాడారని అంటున్నారు. ఏపీ అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాలని డిసైడ్ అయిన ఏపీ ప్రజలు పొరుగు రాష్ట్రాల నుంచి సైతం వ్యయప్రయాసలకు ఓర్చి, గంటల తరబడి అర్థరాత్రి దాటినా ఓట్లు వేసారని చెబుతున్నారు. వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెదేపా-జనసేన నాయకులు వెల్లడించారు.
why not 175 కాదట Now 120 అంట
YS Jagan Waveలో ప్రతిపక్షాలు కొట్టుకుపోబోతున్నాయంట. వైనాట్ 175 అనే మాటను వైసిపి నాయకులు కాస్త సవరించుకుని Now 120 అని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారంటూ రెట్టించిని ఉత్సాహంతో చెబుతున్నారు. హైదరాబాద్, కర్నాటక, తమిళనాడు, అమెరికా.. ఇలా పొరగు రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చినవారంతా కసితో జగన్ మోహన్ రెడ్డి సీఎం కావాలని ఓట్లు వేసారనీ, అవన్నీ సానుకూల ఓట్లు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెపుతున్నారు.
సహజంగా ఓటింగ్ శాతం 80% దాటింది అంటే అది పాలకపార్టీ కొంపముంచుతుంది. కానీ ఇక్కడ జరిగింది వేరు అంటున్నారు సజ్జల. ఇంత భారీగా ఓట్లు పోలవడం అంతా ప్రభుత్వానికి సానుకూల ఓట్లనీ, జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలని ఏపీ ప్రజలందరూ కట్టగట్టుకుని ఓట్లు వేసారని విశ్లేషిస్తున్నారు. 2019లో ఆనాడు బాబు సర్కారుపై వ్యతిరేకత కారణంగా 79.64 శాతం ఓటింగ్ నమోదైందని చెబుతున్నారు. కానీ ఇప్పుడు 80 శాతం మాత్రం కేవలం జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేసేందుకే జనం ఓట్లు వేసారని చెబుతున్నారు. మరి ఆయన విశ్లేషణలో నిజం ఎంత వున్నదో, ఏపీ ప్రజలు నిజంగా ఓట్లు ఏ పార్టీకి వేసారో తెలియాలంటే జూన్ 4 వరకూ వేచి చూడాల్సిందే.