బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (15:00 IST)

కాశ్మీర్‌లో అలా చేయండి.. స్టాలిన్, రజనీకాంత్‌ను ఏకేసిన కమల్ హాసన్

పుల్వామా ఘటనపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ప్రముఖులు, రాజకీయ నేతలు, నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మరికొందరు కాశ్మీర్‌పై కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కాశ్మీర్‌పై ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 
కాశ్మీర్‌లో ప్రజాభిప్రాయం సేకరించాలని కమల్ హాసన్ చెప్పారు. పుల్వామాలో ఉగ్రదాడిపై ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, అక్కడి ప్రజలు కోరుకున్నట్టుగానే చేయాలన్నారు. కొన్నేళ్లుగా కాశ్మీర్ వేర్పాటువాదులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. కమల్ కూడా ఇదే తరహాలో వ్యాఖ్యానించడంతో కలకలం రేగింది. 
 
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను కూడా ఆయన ఆజాద్ కాశ్మీర్ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ స్పందించింది. కమల్ వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపింది. కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని... మన జవాన్లకు అండగా పార్టీ ఉంటుందని స్పష్టం చేసింది. 
 
మరోవైపు మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్.. తమిళ రాజకీయ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌లపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. స్టాలిన్‌పై పరోక్షంగా వ్యంగ్యస్త్రాలు సంధిస్తూ.. 'చినిగిన చొక్కాపై తాను వుండనని, ఒకవేళ అసెంబ్లీలో తన చొక్కా చిరిగినా.. తాను వేరే చొక్కా వేసుకుంటాను' అని అన్నారు.
 
కాగా గతంలో పళనిస్వామి సర్కారు తమిళ అసెంబ్లీ బలపరీక్షను ఎదుర్కొన్న సందర్భంగా జరిగిన ఘర్షణలో స్టాలిన్ చొక్కా చినిగిపోయింది. అదే చొక్కాతోనే స్టాలిన్ వెళ్లి రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం అప్పట్లో పతాకశీర్షికలకెక్కింది. 
 
అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్‌పై వ్యంగ్యస్త్రాలు సంధించారు. 'ఒకసారి ఒంటికి నూనె దట్టించుకుని రెజ్లింగ్‌లోకి దిగి తొడలు చరిచిన తర్వాత శత్రువుతో తలపడకుండానే రెజ్లింగ్‌ రింగ్‌లోంచి బయటికి వస్తే, అందరిలో నవ్వుల పాలవుతాం' అని కమల్ హాసన్ చమత్కరించారు. ఇలా రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత రాజకీయాల్లోకి రానని చెప్పే విధానం ఏమిటని.. అడిగారు.