మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 మే 2020 (10:05 IST)

రైళ్లకు గ్రీన్ సిగ్నల్ - తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వివరాలు...

కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా సుమారు గత 50 రోజులుగా పరుగులు తీయని రైళ్లు... మంగళవారం నుంచి మళ్లీ పట్టాలపై తిరగనున్నాయి. ఇందుకోసం కేంద్రం పచ్చజెండా ఊపింది. అయితే, పలు ఆంక్షల మధ్య ఈ రైళ్లను నడుపుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న మూడో దశ లాక్డౌన్ ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. ఇది పూర్తిగా ముగియకముందే... రైళ్ల రాకపోకలకు కేంద్రం పచ్చజెండా ఊపింది. 
 
దీంతో 12వ తేదీ నుంచి 15 జతల రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ రైళ్లు దేశంలోని ముఖ్య నగరాల మధ్య తిరుగుతాయి. ఈ రైళ్ళలో ప్రయాణం చేయదలచిన వారు విధిగా రిజర్వేషన్ చేసుకోవాల్సివుంటుంది. టిక్కెట్ కౌంటర్ల వద్ద ప్రయాణ టిక్కెట్లను విక్రయించరు. అలాగే, ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాతనే రైళ్లలోకి అనుమతిస్తామని, ప్రతి ఒక్కరూ మాస్క్ లను ధరించాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది. 
 
12వ తేదీ నుంచి పరుగులు తీయనున్న రైళ్ల వివరాలను పరిశీలిస్తే, హౌరా - న్యూఢిల్లీ, రాజేంద్రనగర్ - న్యూఢిల్లీ, డిబ్రూగఢ్ - న్యూఢిల్లీ, న్యూఢిల్లీ - జమ్మూతావి, బెంగళూరు - న్యూఢిల్లీ, తిరువనంతపురం - న్యూఢిల్లీ, చెన్నై సెంట్రల్ - న్యూఢిల్లీ, బిలాస్ పూర్ - న్యూఢిల్లీ, రాంచీ - న్యూఢిల్లీ, ముంబై సెంట్రల్ - న్యూఢిల్లీ, అహ్మదాబాద్ - న్యూఢిల్లీ, అగర్తలా - న్యూఢిల్లీ, భువనేశ్వర్ - న్యూఢిల్లీ, మడ్‌గావ్ - న్యూఢిల్లీ, సికింద్రాబాద్ - న్యూఢిల్లీల మధ్య రైళ్లు తిరుగుతాయి.
 
అయితే, రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ళ వివరాలను పరిశీలిస్తే, 
* బెంగళూరు, న్యూఢిల్లీ మధ్య రోజూ తిరిగే రైలు శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్, రాయచూరు సికింద్రాబాద్, కాజీపేటల మీదుగా ప్రయాణిస్తుంది. బెంగళూరులో రాత్రి 8 గంటలకు, న్యూఢిల్లీలో రాత్రి 8.45 గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది. 
 
* న్యూఢిల్లీ, చెన్నై సెంట్రల్ మధ్య శుక్ర, ఆదివారాల్లో, తిరుగు ప్రయాణంలో బుధ, శుక్ర వారాల్లో నడిచే రైలు, విజయవాడ, వరంగల్ నగరాల మీదుగా ప్రయాణిస్తుంది. న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3.55 గంటలకు, చెన్నై సెంట్రల్‌లో ఉదయం 6.05 గంటలకు రైళ్లు బయలుదేరుతాయి. 
 
* సికింద్రాబాద్, న్యూఢిల్లీ మధ్య బుధవారం, తిరుగు ప్రయాణంలో ఆదివారం బయలుదేరే రైలు కాజీపేట మీదుగా సాగుతుంది. సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12.45 గంటలకు, న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3.55 గంటలకు రైళ్లు బయలుదేరుతాయి.