జీఎన్ రావు కమిటీ సిఫారసులు... ఇంతకీ ఏపీ రాజధాని ఎక్కడ? విశాఖా? అమరావతా?
ఏపీకి 3 రాజధానులు అని సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజాగా ఏపీ ప్రభుత్వం గత సెప్టెంబరు నెల 13న ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన నివేదిక సీఎం జగన్ మోహన్ రెడ్డికి అందజేసారు.
ఈ నివేదికను రూపొందించేందుకు గాను కమిటీ సభ్యులు సుమారు 10,600 కిటోమీటర్ల మేర పర్యటించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, విభిన్నవర్గాలకు చెందిన వారి నుంచి అభిప్రాయాలు తీసుకున్న మీదట పలు సిఫారసులు చేశారు. అందులో ప్రధానమైనది అమరావతి, మంగళగిరిలో హైకోర్టు బెంచ్, శాసనసభ ఏర్పాటు చేయాలన్నది.
అలాగే ప్రభుత్వ క్వార్టర్లు, గవర్నర్ క్వార్టర్స్ సైతం అమరావతి పరిధిలోనే వుండాలని సూచన చేశారు. ఐతే అమరావతిలోని వరదలు వచ్చే ప్రాంతాలను వదిలేయాలని సిఫారసు చేశారు. ఇప్పుడు ఇదే కీలకంగా మారింది. ఎక్కడ వరదలు వస్తాయి... ఏ భూములను వదిలేస్తారన్నదే ప్రధాన అంశంగా మారింది.
మరోవైపు విశాఖ మెట్రోపాలిటన్ ప్రాంతంలో హైకోర్టు బెంచ్, వేసవికాలంలో అసెంబ్లీ సమావేశాలు విశాఖలో నిర్వహణతో పాటు సచివాలయం, సీఎం క్యాంప్ ఆఫీసును కూడా అక్కడ నిర్మించాలన్న సిఫారసు చూస్తుంటే విశాఖపట్టణం ఏపీ రాజధానిని చేస్తారా అంటూ భాజపా నాయకుడు సుజనా చౌదరి ప్రశ్నిస్తున్నారు.
అలాగే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనీ, రాష్ట్రాన్ని నాలుగు ప్రాంతాలుగా ఏర్పాటు చేసుకోవాలని సూచనలు చేశారు. ఐతే ఏపీ రాజధాని ఎక్కడ అని మీడియా ప్రశ్నించినప్పుడు సమాధానాన్ని దాటవేశారు.