శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 నవంబరు 2020 (10:51 IST)

ఎస్వీబీసీ 'శతమానం భవతి' ప్రోగ్రామ్‌లో పోర్న్... లింక్ షేర్ చేసిన ఉద్యోగి తొలగింపు!

తిరుమల శ్రీవారికి చెందిన ఆధ్యాత్మిక చానెల్ ఎస్వీబీసీలో ప్రసారమయ్యే శతమానం భవతి కార్యక్రమంలో పోర్న్ క్లిప్స్ ప్రసారమైన ఘటనకు సంబంధించి ఓ కాంట్రాక్టు ఉద్యోగిని తితిదే ముఖ్య కార్యనిర్వహణాధికారి ఉద్యోగం నుంచి తొలగించారు. అలాగే, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరికొందరిపై అంతర్గత విచారణ జరుగుతోంది. అంతేకాకుండా, ఆఫీసు పనివేళలో పోర్న్ సైట్లతో పాటు.. ఇతర ఆన్‌లైన్ గేమింగ్స్ పలువురు ఉద్యోగులు ఆడుతున్నట్టు గుర్తించారు. దీంతో వారిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తితిదే అధికారులు వెల్లడించారు. అదేసమయంలో ఆఫీసులోని కంప్యూటర్ల హార్డ్ డిస్క్‌లు పెన్ డ్రైవ్‌ను తితిదే నిఘా విభాగం అధికారులు స్వాధీనం చేసుకుని లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. 
 
కాగా, ఎస్వీబీసీ ఛానెల్‌లో పోర్న్ సైట్ లింక్ షేర్ కావడం కలకలం రేపిన విషయం తెల్సిందే. "శతమానం భవతి" కార్యక్రమానికి సంబంధించి ఎస్వీబీసీకి ఓ భక్తుడు మెయిల్ చేశాడు. దీనికి జవాబుగా ఆ భక్తుడికి పోర్న్ సైట్ వీడియో లింక్ వచ్చింది. ఎస్వీబీసీ ఉద్యోగి నుండి లింక్ రావడంతో ఆ భక్తుడు ఖంగుతిన్నాడు. దీనిపై వెంటనే టిటిడి దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితోపాటు ఈఓ జవహర్ రెడ్డికి ఫిర్యాదు చేశాడు. 
 
ఈ ఘటనపై భక్తుడి నుండి ఫిర్యాదు రావడంతో టీటీడీ ఛైర్మన్, ఈవో తీవ్రంగా స్పందించారు. వెంటనే ఎస్వీబీసీ కార్యాలయానికి వెళ్లి తనిఖీలు చేశారు. తితిదే విజిలెన్స్, సైబర్ క్రైమ్ టీం, ఇతర అధికారులందరూ కలసి ఎస్వీబీసీలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. 
 
భక్తుడికి పోర్న్ సైట్ వీడియో లింక్ పంపిన ఉద్యోగితో పాటు కార్యాలయంలో పోర్న్ సైట్లు చూస్తున్న మరో ఐదుగురు ఉద్యోగులను సైబర్ క్రైమ్ టీం గుర్తించింది. కార్యాలయంలో విధులు నిర్వహించకూండా ఇతర వీడియోలు చూస్తున్న మరో 25 మంది సిబ్బందిని గుర్తించారు. విధులు నిర్వహించకుండా వృధాగా కాలం గడుపుతున్నారని భాధ్యుల పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది ఎస్వీబీసీ యంత్రాంగం.
 
ఇదిలావుంటే, ఎస్వీబీసీ చానల్‌‌లో నిభందనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఉద్యోగులను వెంటనే తొలగించాలని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. ధార్మిక చానల్‌లో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. గతంలో ఛానల్‌లో అక్రమ నియామకాలు జరిగాయని... ఛానల్‌ను వెంటనే ప్రక్షాళన చెయ్యాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.