సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 28 మే 2018 (10:49 IST)

#HappyBirthdayNTR : నాన్న జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి : హరికృష్ణ

స్వర్గీయ ఎన్టీఆర్ 96వ జయంతి వేడుకలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా, టీడీపీ శ్రేణులు తమ అభిమాన నటుడు, అభిమాన రాజకీయనేత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి.

స్వర్గీయ ఎన్టీఆర్ 96వ జయంతి వేడుకలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా, టీడీపీ శ్రేణులు తమ అభిమాన నటుడు, అభిమాన రాజకీయనేత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. వీరిలో నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో పాటు.. వారివారి కుటుంబ సభ్యులు ఉన్నారు.
 
ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ, ఎన్టీఆర్ జీవిత చరిత్రలోని ముఖ్య ఘట్టాలను పాఠ్యాంశాల్లో చేర్చాలని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. 'ఈరోజు తెలుగు ప్రజలకు పర్వదినం. ఎందుకంటే ఈరోజు అన్నగారి పుట్టినరోజు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఇంట్లో మాకు ఎన్టీఆర్ లాంటి బిడ్డ కావాలని కోరుకుంటున్నారు. ఆ మహానుభావుడి గురించి చెప్పాలంటే తరాలు చాలవు.. యుగాలు చాలవు. ఆయన ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల ప్రజలంతా బాగుండాలని కోరుకున్న మహోన్నత వ్యక్తి ఆయన. అందుకే ఆయన జీవిత చరిత్రలోని ముఖ్యమైన ఘట్టాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో పాఠ్యాంశాలుగా చేర్చాలని ప్రభుత్వాలను కోరుకుంటున్నా' అని విజ్ఞప్తి చేశారు. 
 
ఇదిలావుంటే, విజయవాడ వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతోంది. ఇది సోమవారానికి రెండో రోజుకు చేరుకుంది. పార్టీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు మహానాడు నివాళులర్పించింది. మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. కాగా, రెండోరోజు మహానాడులో టీడీపీ 16 తీర్మానాలను ఆమోదించనుంది. టీడీపీ ఆవిర్భావం, సామాజిక న్యాయం, రాజకీయ చైతన్యంపై తీర్మానం ఉండనుంది. అలాగే 2019 నాటికి పోలవరం పూర్తిచేసే సంకల్పంపై మహానాడులో తీర్మానం చేయనున్నారు.