శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pnr
Last Updated : గురువారం, 10 మే 2018 (08:43 IST)

హనుమాన్ జయంతి వేడుకలు.. కాషాయమయమైన ఆలయాలు

హనుమాన్ జయంతి వేడుకలు సంబరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. ముఖ్యంగా, హైదరాబాద్‌లోని ఆలయాలు అందంగా ముస్తాబయ్యియి. కొన్ని ఆలయాల్లో బుధవారం నుంచే ఉత్సవాలు ప్రారంభ

హనుమాన్ జయంతి వేడుకలు సంబరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. ముఖ్యంగా, హైదరాబాద్‌లోని ఆలయాలు అందంగా ముస్తాబయ్యియి. కొన్ని ఆలయాల్లో బుధవారం నుంచే ఉత్సవాలు ప్రారంభంకాగా మరికొన్ని ఆలయాల్లో గురువారం ఒకరోజు మాత్రమే హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
 
మరోవైపు కొండగట్టు, వేములవాడ రాజన్న ఆలయాలు హనుమాన్ మాలధారులతో కాషాయమయంగా మారాయి. యేడాదిలో రెండు సార్లు హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఒకటి హనుమాన్ విజయానికి ప్రతీకగా… మరొకటి పెద్ద హనుమాన్ జయంతిగా చేసుకుంటారు. గురువారం పెద్ద హనుమాన్ జయంతి కావడంతో హైదరాబాద్‌‌లోని తాడ్‍బండ్ హనుమాన్ ఆలయం, సనత్ నగర్ బడా హనుమాన్ ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. ఉదయం అభిషేకాలతో పూజలు ప్రారంభమై, రాత్రి హనుమాన్ చాలీసాతో ఉత్సవాలు ముగుస్తాయంటున్నారు.
 
అలాగే, జగిత్యాల జిల్లా కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. హనుమాన్ మాలధారులతో పాటు సామాన్య భక్తులు పెద్ద ఎత్తున కొండగట్టుకు తరలివస్తున్నారు. 41 రోజులు దీక్షలు చేసిన భక్తులు కొండకు వచ్చి మాలలు తీయనున్నారు. ఎండాకాలం కావడంతో భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చలువ పందిళ్లు, మంచినీటి సౌకర్యం కల్పించారు. 
 
వేములవాడ రాజన్న ఆలయం హనుమాన్ భక్తులతో కాషాయమయమైంది. హనుమాన్ దీక్ష చేపట్టిన స్వాములు హనుమాన్ జయంతి సందర్భంగా మాల విరమణ కొండగట్టు, లేదా అగ్రహారం అంజనేయ స్వామి ఆలయంలో చేయనున్నారు. దీక్షా విరమణ ముందు వేములవాడ రాజన్నను దర్శించుకొవడం అనవాయితీ కావడంతో… వేలాది మంది హనుమాన్ దీక్షా పరులు రాజన్నను దర్శించుకుంటున్నారు.