శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By kowsalya
Last Updated : బుధవారం, 9 మే 2018 (18:52 IST)

మదర్స్‌ డే... 'అమ్మ'కు ఏం బహుమతి ఇవ్వాలి?

మే నెల రెండో ఆదివారం జరిగే వేడుకే అమ్మల పండగ. ఈ రూపంలో ఇది కొత్తదే గాని క్రీస్తు పూర్వం కూడా మాతృత్వాన్ని గౌరవించే వేడుకలు కొన్ని జరిగేవి. అవి అమ్మల కోసం కాదుగానీ అమ్మతనానికి ప్రతీకలైన అమ్మ దేవతల కోసం

మే నెల రెండో ఆదివారం జరిగే వేడుకే అమ్మల పండగ. ఈ రూపంలో ఇది కొత్తదే గాని క్రీస్తు పూర్వం కూడా మాతృత్వాన్ని గౌరవించే వేడుకలు కొన్ని జరిగేవి. అవి అమ్మల కోసం కాదుగానీ అమ్మతనానికి ప్రతీకలైన అమ్మ దేవతల కోసం జరిగేవి. 


కానీ భూమి మీద నడయాడే అమ్మ దేవతలను గుర్తు చేసుకునేందుకు ఒక వేడుక ఉండాలని కొందరు చేసిన ప్రయత్నాల ఫలితంగా అచ్చంగా అమ్మల కోసమే మదర్స్‌డే వచ్చింది. అనతి కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా దానికి గుర్తింపు వచ్చింది. ఈ విషయాలు పూర్వాపరాలు, ఈ వేడుకతో ముడిపడిన కొన్ని ఆచారాల వివరాలు ఇప్పుడు మీ కోసం.
 
ప్రాచీన కాలంలో గ్రీకులు వసంత కాలం పొడవునా మాతృత్వ ఉత్సవాలు నిర్వహించే వారు. చెట్లు చిగురించే ఈ కాలాన్ని అమ్మతనానికి ప్రతిరూపంగా భావిస్తూ మాతృత్వ ప్రతీక అయిన గ్రీకు దేవతల తల్లి రియాకు ఉత్సవాలు జరిపేవారు. ఇదేవిధంగా క్రీస్తు పూర్వం 250 ప్రాంతాలలో రోమనులు కూడా వసంత కాలంలో మాతృదినోత్సవాన్ని నిర్వహించేవారు. తమ అమ్మ దేవత సిబెలె వేషధారణలతో, ఆటపాటలతో మూడురోజుల పాటు ఈ పండుగ జరుపుకుంటారు.
 
యుగోస్లేవియాలో మదర్స్‌ డే రోజున పిల్లలు తల్లిని సరదాగా తాళ్ళతో బంధించే ఆచారం ఉంది. తాము కోరిన కానుకలు సమర్పించుకుంటేనే పిల్లలు ఆమెను బంధవిముక్తురాల్ని చేస్తారు. మదర్స్‌డే రోజున అమెరికాతో సహా చాలా దేశాల్లో కార్నేషన్ పూలను తల్లికి బహుమతిగా ఇస్తుంటారు.

ఈ పువ్వులను ఇవ్వడం వెనుక ఒక చిన్న కారణం ఉంది. జీసస్‌కు శిలువ వేసినపుడు మేరీ మాత కొడుకు పాదాలను పట్టుకొని దుఃఖించారు. అప్పుడు ఆమె కన్నీటి బొట్ల నుంచి ఉద్భవించినవే కార్నేషన్ పూలు అని ఒక నమ్మకం. మాతృ ప్రేమ జాలువారగా పుట్టిన వీటికంటే ఉన్నతమైన పూలు వేరే ఏముంటాయి తల్లికి ఇవ్వడానికి అన్నదే ఈ పువ్వులను ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యం అంటారు. 
 
అయితే ఈ పూలలో చాలా రంగులుండగా మాతృదినోత్సవం రోజున మూడు రంగుల పూలను మాత్రమే ఎక్కువగా బహూకరిస్తుంటారు. ఎరుపు, గులాబీ రంగు కార్నేషన్స్‌ను సజీవంగా ఉన్న వారికి బహుకరిస్తారు. మాతృదినోత్సవం రోజున ఈ పువ్వులను కోటు మీద ధరించే సంప్రదాయం కూడా కొందరు పాటిస్తారు. ఈ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది కూడా మదర్స్‌డే ఏర్పాటుకు కారణమైన అన్నా జార్విసే.