గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 31 జులై 2021 (21:33 IST)

మానభంగం చేసినవాడినే మనువాడుతానంటూ సుప్రీంకోర్టుకి బాధితురాలు

మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆమె తల్లి కావడానికి కారకుడైన కేరళ వయనాడ్ జిల్లాకు చెందిన క్యాథలిక్ చర్చి ఫాదర్ రాబిన్ చెర్రీని పెళ్లాడుతానంటూ బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నిర్ణయం వెనుక ఎవరి ఒత్తిడి లేదనీ, ఇది తన సొంత నిర్ణయమని పిటీషన్లో పేర్కొంది. 2016లో బాధితురాలిపై చెర్రీ అత్యాచారం చేయడంతో ఆమె గర్భవతి అయ్యింది. బిడ్డను కూడా ప్రసవించింది.
 
తన కుమార్తె జీవితాన్ని నాశనం చేసిన చెర్రిని కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలి తండ్రి కోర్టులో ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేసారు. తొలుత ఆ బాలికతో తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించాడు నిందితుడు. ఆ తర్వాత డిఎన్ఎ పరీక్ష చేయడంతో వాస్తవం అంగీకరించక తప్పలేదు. దానితో కోర్టు అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. శిక్ష అనుభవిస్తున్న నిందితుడు గత ఫిబ్రవరిలో కేరళ హైకోర్టుకు ఓ పిటీషన్ వేశాడు.
 
తను అత్యాచారం చేసిన బాధితురాలిని పెళ్లి చేసుకుంటాననీ, జైలులో వుండటం వల్ల బిడ్డ సంరక్షణ బాధ్యతలు చూసుకోలేకపోతున్నానంటూ అతడు పేర్కొన్నాడు. ఈ పిటీషన్ విచారించిన కోర్టు దానిని తిరస్కరించింది. అత్యాచారం చేసి దోషిగా నిర్థారణ అయిన వ్యక్తి పెళ్లి పేరుతో శిక్షను తప్పించుకోజాలడని వ్యాఖ్యానించింది. అతడి పిటీషన్‌ను కొట్టివేసింది. ఈ నేపధ్యంలో బాధితురాలు శనివారం నాడు సుప్రీంకోర్టుకు పిటీషన్ వేయడంతో కేసు మరో మలుపు తిరిగింది. ఈ పిటీషన్ సోమవారం నాడు విచారణకు రానుంది.