చెప్పుతో కొట్టినట్లు పంపేశారు, నన్ను ఇబ్బందిపెట్టినవారు బతికిలేరు: థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ
ఎస్వీబీసి చైర్మన్ పదవి పోయాక రాజకీయ నాయకులపై దుమ్మెత్తి పోస్తున్న పృధ్వీ మళ్లీ సినిమా పెద్దల ఆశీర్వాదం కోసం ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో ఆయా నటులను పొగుడుతూ ముందుకు వెళుతున్నారు. తనను ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి తొలగించి, చెప్పుతో కొట్టినట్లు పంపేశారంటూ షాకింగ్ కామెంట్లు చేశారు పృధ్వీ. సినిమాలు వదులుకుని సేవ చేసేందుకు వెళ్లిన తనపై కొందరు నాయకులు కుట్ర చేసి పదవి పోయేలా చేశారంటూ వ్యాఖ్యానించారు.
తను సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారితో సైద్ధాంతికంగా మాట్లాడాననీ, అందువల్ల తనకు చాలా సినిమా ఛాన్సులు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా రంగంలో ఎవరైనా గొప్ప వ్యక్తి ఉన్నారా అంటే చిరంజీవిగారేనని కితాబిచ్చారు. అలాగని మిగతావారిని తను తక్కువ చేసి మాట్లాడటంలేదనీ, తను మానసికంగా ఇబ్బందిపడినప్పుడు, తనకు వేషాలు ఇచ్చి ఎంకరేజ్ చేయాలని చెప్పిన వ్యక్తి చిరంజీవిగారని చెప్పుకొచ్చారు. ఆయన లేకపోతే తను సూసైడ్ కూడా చేసుకునేవాడిననీ, మహిళల పట్ల తనెప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చారు.
అదేసమయంలో వైకాపా కార్యకర్తగా పలు రకాలైన ఆరోపణలను ఎదుర్కొన్నప్పుడు పార్టీ ప్రతిష్టను దృష్టిలో పెట్టుకుని తన పదవికి రాజీనామా చేశానన్నారు. తాను పదవుల కోసం ఎన్నడూ ఆరాటపడలేదన్నారు. రైతు ఉద్యమం గురించి తను మాట్లాడితే దాన్ని వక్రీకరించారనీ, పోసాని కృష్ణమురళితో తిట్టించారనీ, దివ్యవాణిగారు తనను కుక్క అన్నారని చెప్పారు. అయితే తమ పార్టీలోనే తన తీరు నచ్చనివారున్నారనీ, తనకు పదవి రాకూడదని అనుకున్నవారు చాలామంది ఉన్నారని చెప్పుకొచ్చారు.
తన జాతకం ప్రకారం తనను ఇబ్బంది పెట్టినవారు ఎవరూ బతికిలేరనీ, తను ఈరోజు రోడ్డు మీద ఉన్నాననీ, విదేశాల్లో పాస్ పోర్ట్ పోయినవాడిలా ఉన్నానని ఆవేదన వెలుబుచ్చారు.