శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: మంగళవారం, 31 డిశెంబరు 2019 (21:23 IST)

కొత్త సంవత్సరంలో ఇలా జాగ్రత్త పడండి..? అలాంటి బకరాల్లా మారొద్దు...

కొత్త సంవత్సరం వస్తుందంటే దానికి సంబంధించిన వేడుకలు ఎలా జరుపుకోవాలనే ఆలోచనలోనే ఉంటాం. కొంతమంది పార్టీలు చేసుకుంటారు, కొందరు విహార యాత్రలకు వెళ్తారు, కొందరు బయటకు వెళ్లి తిందాం అని అనుకుంటూ ఉంటారు. ఎంజాయ్ చేయడం మంచిదే. కానీ మోసపోకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. న్యూ ఇయర్ పార్టీలకు చవకైన టిక్కెట్లు, నకిలీ డైనింగ్ ఆఫర్లు వంటి ఎన్నో మోసాలు ఈ సమయంలోనే జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం జరిగే కొన్ని న్యూ ఇయర్ స్కాములు ఇవే..
 
మీరు న్యూ ఇయర్ పార్టీలకు వెళ్లాలనుకుంటే అసలు ఆ పార్టీ జరుగుతుందో లేదో తెలుసుకోవడం.. దానికి సంబంధించిన అధికారిక వెబ్ సైట్లో మాత్రమే బుక్ చేసుకోవడం ముఖ్యం. ఈ స్కాములో నకిలీ పార్టీలు చాలా సాధారణం అయిపోయాయి. తక్కువ ధరలకే వస్తోందని కొంతమంది ఈ తరహా పార్టీలకు ముందే డబ్బులు చెల్లించి టిక్కెట్లు బుక్ చేసుకోవడం అక్కడికి వెళ్లాక అది నకిలీ పార్టీ అని తెలిసి నిరాశతో వెనుతిరగడం ఈమధ్య మామూలు విషయం అయిపోయింది.
 
బాగా పేరున్న స్టార్ హోటళ్లలో కేవలం రూ.500 రూ.1000 మధ్యలోనే అన్ లిమిటెడ్ వైన్, డైనింగ్ అనే ఆఫర్లు మీకు కనిపిస్తే.. వాటిని బుక్ చేసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. ముందు అటువంటి డీల్స్ ఉన్నాయో లేవో ఒకసారి అధికారిక వెబ్ సైట్లో చెక్ చేసుకోండి. వీలుంటే అధికారిక వెబ్ సైట్ లేదా నేరుగా హోటల్‌కే వెళ్లి బుక్ చేసుకోండి. బుకింగ్ అమౌంట్‌ను దొంగిలించడానికి కొంతమంది చేసే కుంభకోణం ఇది.
 
మీరు ఏదైనా హోటల్లో కార్డు ద్వారా చెల్లింపు జరిపేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. మీ కార్డును సర్వర్‌కి ఇచ్చి పిన్ నంబర్‌ను అతనికి చెప్పకండి. ఎందుకంటే మీరు చేసే అతి పెద్ద తప్పు ఇదే. దీని ద్వారా మీ కార్డు స్కాన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మీ కార్డు వివరాలను తస్కరించి నకిలీ కార్డు తయారుచేసి దాని ద్వారా మీ నగదు దోచేస్తారు. అలాగే న్యూఇయర్ పార్టీలకు సమీపంలో ఉండే ఏటీయంల్లో కూడా నగదు తీసేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే పార్టీల సమయంలో కొందరు తెచ్చుకున్న నగదు అయిపోవడంతో అదనపు నగదు కోసం ఏటీయంల వద్దకు వెళ్తారని తెలుసు. కాబట్టి అక్కడ కూడా స్కిమ్మర్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత అవసరమో అంత నగదును ముందే తీసుకెళ్లడం ఉత్తమం.
 
న్యూఇయర్ సందర్భంగా జరిగే మోసాల్లో ఇది కూడా సాధారణమైన మోసం. కొంతమంది కేవలం న్యూఇయర్ పార్టీ బిల్లు చెల్లించడం కోసం తమకు ఒక బకరా కావాలనుకుంటారు. దీని కోసం వారు బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ కోసం వెతికి వారి ద్వారా తమ న్యూఇయర్ పార్టీని ఉచితంగా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించండి.
 
మీరు ఆన్ లైన్ లో దేన్నైనా బుక్ చేసి నగదు చెల్లింపును క్యూఆర్ కోడ్ ద్వారా చేసేటప్పుడు ఆ సేవలను అందించేవారు ఎంత మొత్తం కోరారో ముందే నిర్థారించుకోవడం మంచిది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో క్యూఆర్ కోడ్ లకు సంబంధించిన స్కాములు చాలా ఎక్కువ అయ్యాయి. అలాగే ఓటీపీ లేదా పిన్ నంబర్ అనేది మీ ఖాతాలో నుంచి నగదు తీసుకోవడానికి మాత్రమూ అనేది కూడా మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.
 
ఒకవేళ మీరు మద్యం డోర్ డెలివరీ కావాలనుకుంటే దానికి సంబంధించిన ఫోన్ నంబర్ల కోసం గూగుల్ లో వెతక్కండి. ఆన్ లైన్ లో ఉన్న షాపులు అసలు బయట ఉండకపోయే అవకాశం కూడా ఉంది. మీరు అందులో పేర్కొన్న ఫోన్ నంబర్ కు కాల్ చేస్తే.. ఆ కాల్ ను లిఫ్ట్ చేసిన వ్యక్తి నగదును పేటీయంలో చెల్లిస్తే.. మీ చిరునామా నోట్ చేసుకుని మద్యం ఇంటికే డెలివరీ చేస్తామని చెబుతారు. ఇక్కడ సమస్యేంటంటే.. ఆ మద్యం ఎప్పటికీ మీకు అందకపోవచ్చు. మీకు ఆ షాపు గురించి తెలియకపోతే మీరు నగదును ముందే చెల్లించకండి.
 
హోటళ్ల తరహాలోనే ఫ్లైట్ టిక్కెట్లను కూడా నకిలీ ధరలకు అమ్ముతామనే నకిలీ సైట్లు చాలా ఉండవచ్చు. ఈ స్కామ్ లో పడకుండా ఉండాలంటే ఆ ఫ్లైట్లు ఉన్నాయో లేదో అధికారిక వెబ్ సైట్లో ముందుగానే చెక్ చేసుకోండి. లేకపోతే మీరు కూడా మోసపోకతప్పదు.
 
మీరు ఎక్కడైనా షాపింగ్ లేదా పార్టీ చేసుకుని రాగానే... మాతో షాపింగ్...పార్టీ చేసుకున్నందుకు ధన్యవాదాలు. మీకు లక్కీడ్రాలో కార్ తగిలింది అని మెసేజ్ వస్తే వెంటనే నమ్మి వివరాలు ఇచ్చేయకండి. దానికి సంబంధించిన నిర్వాహకులతో ముందుగా ఒకసారి మాట్లాడి నిర్ధారించుకున్నాకనే ఈ విషయంలో ముందుకు వెళ్లడం మంచిది.