సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 మే 2020 (09:04 IST)

దూసుకెళ్ళిన ఖాళీ గూడ్సు రైలు - వలస కూలీల మృతి.. ఎక్కడ?

మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ఓ ఖాళీ గూడ్సు రైలు దూసుకెళ్లడంతో ఏకంగా 15 మంది వలస కూలీలు మృత్యువాతపడ్డారు. ఈ ఘోరం శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. మృతి చెందిన వలస కార్మికులంతా ట్రాక్‌పై నిద్రిస్తుండటంతో ఈ విషాదం జరిగింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాదా - నాందేడ్ రైల్వే మార్గంలో జరిగింది. చనిపోయిన వారంతా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలే.
 
కరోనా వైరస్ దెబ్బకు దేశం మొత్తం లాక్డౌన్‌లో ఉంది. దీంతో అనేక ప్రాంతాల్లో వలస కూలీలు, కార్మికులు చిక్కుకునిపోయారు. తమతమ ప్రాంతాలకు వెళ్లేందుకు ఎలాంటి రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిన షెల్టర్లలో తలదాచుకుంటున్నారు.
 
ఈ క్రమంలో ఔరంగాబాద్ - నాందేడ్ రైలు మార్గంలో కొంతమంది వలస కూలీలు గురువారం రాత్రి భోజనం చేసి ట్రాక్‌పై నిద్రిస్తున్నారు. ఆ సమయంలో ఓ ఖాళీ గూడ్సు రైలు పట్టాలపై నిద్రిస్తున్న వలస కార్మికులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 మంది మరణించినట్టు ప్రాథమిక సమాచారం. వీరంతా మధ్యప్రదేశ్ కు చెందిన కార్మికులుగా తెలుస్తోంది.
 
దీనిపై దక్షిణ మధ్యరైల్వే ప్రజా సంబంధ వ్యవహారాల అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు. 'కర్మాడ్ ప్రాంతంలో రైలు ప్రమాదం జరిగింది. ఖాళీగా వెళుతున్న గూడ్స్ రైలు కొంతమందిపై నుంచి వెళ్లింది. విషయం తెలుసుకున్న వెంటనే, రైల్వే, స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మరింత సమాచారం వెలువడాల్సివుంది' అని పేర్కొన్నారు.