సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 మే 2020 (11:22 IST)

వలస కూలీల నుంచి చార్జీలు వసూలా? శవాలపై చిల్లర ఏరుకున్నట్టే : సోనియా ఫైర్

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంతో పాటు రైల్వే శాఖ తీరుపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా కాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకునిపోయిన వలస కార్మికులను తమతమ స్వస్థలాలకు తరలించేందుకు నడిపే శ్రామిక్ స్పెషల్ రైళ్ళలో వలస కూలీల నుంచి చార్జీల రూపేణా డబ్బులు వసూలు చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఈ చర్య శవాలపై చిల్లర ఏరుకున్నట్టేనంటూ మండిపడ్డారు. 
 
పేదలు, వలస కార్మికుల రైలు ప్రయాణాలకు అవసరమైన డబ్బులను కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని, డబ్బు తీసుకుని, వారికి అవసరమైనన్ని రైళ్లను ఏర్పాటు చేయాలని కోరుతూ ఆమె కేంద్రానికి ఓ లేఖ రాశారు. దేశ వృద్ధికి తమవంతు సహకారాన్ని అందించే కార్మికులకు అండగా నిలిచి, వారిని ఆదుకునేందుకు, కాంగ్రెస్ పార్టీ అందించే చిరుసాయం ఇదని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. 
 
"భారత జాతి వృద్ధికి మన కార్మికులే అంబాసిడర్లు. పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని గుర్తించి, ఉచితంగా విమానాల్లో వారి స్వరాష్ట్రాలకు చేర్చడం ప్రభుత్వం బాధ్యత. గుజరాత్‌లో కేవలం ఓ కార్యక్రమానికి ప్రజల తరలింపు, వారికి ఆహారం కోసం రూ.100 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. ప్రధాన మంత్రి కరోనా నిధికి రైల్వే మంత్రిత్వ శాఖ రూ.151 కోట్లను అందించింది. ఆ నిధులతో కనీసం వలస కార్మికులకు ఉచిత రైలు ప్రయాణాన్ని అందించలేరా? ఇంతటి కష్టకాలంలో, వారిని ఆదుకునే మంచి మనసు ఎందుకు రావడం లేదు?'  అంటూ సోనియా గాంధీ నిలదీశారు. 
 
లాక్‌డౌన్ అమలులోకి వస్తుందని కేవలం నాలుగు గంటల ముందు నోటీసులు ఇవ్వడాన్ని కూడా ఆమె తప్పుబట్టారు. కనీసం పేదలు, వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరే సమయమైనా ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు. వారికి కనీస వసతులైన ఆహారం, ఔషధాలు, డబ్బులు, రవాణా సౌకర్యాన్ని కల్పించడంలో పూర్తిగా విఫలమైన కేంద్ర ప్రభుత్వం, రైలులో ప్రయాణించడానికి డబ్బులు అడుగుతోందని మండిపడ్డారు.
 
ఇప్పుడు కూడా లక్షలాది మంది ఇంకా రోడ్లపై తమ స్వస్థలాలకు నడుస్తూనే ఉన్నారని, వారంతా వెంటనే గమ్యానికి చేరేందుకు ఏర్పాట్లు చేయాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ఈ విషయంలో తమ పార్టీ ఎన్నిమార్లు విజ్ఞాపనలు చేసినా, కేంద్రం, రైల్వే మంత్రిత్వ శాఖలు పెడచెవిన పెట్టాయని విమర్శలు గుప్పించారు.