సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 మే 2020 (13:47 IST)

మద్యం షాపులు తెరవండి సీఎం గారూ.. లేఖ రాసిన ఎమ్మెల్యే

అవును. మద్యం షాపులు తెరవాలని సీఎంకు ఎమ్మెల్యే లేఖ రాశారు. దేశంలో కరోనా వ్యాప్తి చెందడంతో గత నెల దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ కన్నా ముందే కరోనా భయంతో షాపింగ్ మాల్స్, మద్యంషాపులు, బార్లు, క్లబ్బులు, థియేటర్లు ఇతర జనసందోహంగా ఉండే అన్ని ప్రదేశాలు మూసివేశారు. నెల రోజులకు పైగా మద్యం దుకాణాలు బంద్ చేశారు. మద్యం షాపులు మూతపడటంతో మందుబాబులు అల్లాడిపోతున్నారు. తద్వారా ఒత్తిడికి లోనవుతున్నారు. 
 
మద్యం కోసం రకరకాల మార్గాలు వెతుకుతున్నారు.. ఎక్కువ డబ్బులు పెట్టి మద్యం కొనలేక.. మద్యం తాగకుండా ఉండలేక నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మద్యం షాపులను వెంటనే తెరిపించాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్ కపూర్, మద్యం షాపులను తక్షణం తెరిపించాలంటూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు ఓ లేఖను రాశారు. ఈ లేఖలో తన విజ్ఞప్తిలో అసలు మద్యం షాపులు ఎందుకు తెరవాలో ఓ లాజిక్ కూడా జోడించారు.
 
ఆల్కహాల్‌తో చేతులను శుభ్రం చేసుకుంటే, చేతిపై ఉన్న కరోనా క్రిములు చనిపోతాయని గుర్తు చేశారు. అంతేగాకుండా.. మద్యం తాగడం ద్వారా గొంతులో వున్న కరోనా క్రిములు కూడా హతమవుతాయని చెప్పారు. తద్వారా గొంతులో తిష్టవేసి ఉండే కరోనా క్రిములను హతమార్చేందుకు మద్యాన్ని మందుగా వాడొచ్చు కదా అంటూ లేఖలో కోరారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందుల్లో ఉందని.. మార్కెట్లో మద్యానికి డిమాండ్ అధికంగా ఉందని, షాపులను తెరిపిస్తే, లాక్ డౌన్ సమయంలో నష్టపోయిన ప్రభుత్వ ఆదాయాన్ని భర్తీ చేసుకోవొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.