స్టెరిలైట్‌పై తిరుగుబాటు.. రణరంగంగా మారిన తమిళనాడు
వివాదాస్పద స్టెరిలైట్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలతో పాటు రైతులు తిరుగుబాటు చేశారు. దీంతో తమిళనాడు రణరంగంగా మారింది. తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడిలో కాపర్ కర్మాగారం (స్టెరిలైట్ ఫ్యాక్టరీ)
వివాదాస్పద స్టెరిలైట్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలతో పాటు రైతులు తిరుగుబాటు చేశారు. దీంతో తమిళనాడు రణరంగంగా మారింది. తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడిలో కాపర్ కర్మాగారం (స్టెరిలైట్ ఫ్యాక్టరీ) ఉంది. ఈ కర్మాగారాన్ని వ్యతిరేకిస్తూ తూత్తుకుడి కలెక్టరేట్ వద్ద ఆందోళనకారులు మంగళవారం చేపట్టిన ర్యాలీ రణరంగాన్ని తలపించింది.
కాపర్‌ని కరిగించే స్టెరిలైట్ ఫ్యాక్టరీ కార్యకలాపాలు నిలిపివేయాలంటూ నిరసనకారులు ఆందోళనకు పిలుపునివ్వడంతో వందల సంఖ్యలో ప్రజలు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. కార్మిక సంఘాల పిలుపు మేరకు తూత్తుకుడి పట్టణంలో షాపులు మూసివేసి స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఈ నేపథ్యంలో పట్టణంలో 144 సెక్షన్ విధించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్... కేవలం పాత బస్టాండ్ సమీపంలోని ఎస్ఏవీ మైదానంలో మాత్రమే ఆందోళన తెలిపేందుకు అనుమతి ఇచ్చారు.
అయితే నిషేధాజ్ఞలను నిరసనకారులు పెడచెవిన పెట్టి కలెక్టరేట్ వైపు దూసుకొచ్చారు. రాగి కర్మాగారాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను నిలువరించేందుకు దాదాపు 4 వేల మంది పోలీసులను మోహరించాల్సి వచ్చింది. అయినప్పటికీ కొందరు పోలీసు వలయాన్ని ఛేదించుకుని కలెక్టరేట్‌లోకి ప్రవేశించడంతో లాఠీచార్జి చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు.
పట్టణంలో 144 సెక్షన్ విధించినప్పటీకీ పెద్ద ఎత్తున నిరసనకారులు కలెక్టరేట్ వద్దకు ఒక్కసారి దూసుకొచ్చారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆందోళనకారులను అదుపుల చేసేందుకు పోలీసులు చేపట్టిన చర్యలు విఫలం కావడంతో కాల్పులుజరిపారు. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. దీంతో మరింత రెచ్చిపోయిన ఆందోళన కారులు కలెక్టరేట్‌లోకి చొరబడి నిప్పుపెట్టారు.
ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. దీంతో తూత్తుక్కుడి వ్యాప్తంగా విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. అలాగే, మీడియాను కూడా అక్కడ నుంచి పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించారు. ఈ కారణంగా అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు.
కాగా, 1996లో స్టెరిలైట్ ఇండస్ట్రీస్ ప్రారంభమైనప్పటి నుంచీ తరచూ ఆందోళనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. కాపర్ ప్లాంట్ కారణంగా తాము శ్వాససంబంధిత ఇబ్బందులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.