సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (20:12 IST)

పాకిస్థాన్‌కు నదీ జలాలు బంద్.. మన నీళ్లు మనకే.. కేంద్రం సంచలన నిర్ణయం

జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని పుల్వామా ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది. ముఖ్యంగా పాక్ దుశ్చర్యలపై దేశ ప్రజలంతా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో కేంద్రంకూడా అంతే కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులోభాగంగా, భారతదేశంలోని తూర్పు ప్రాంతంలో ఉన్న నదుల నుంచి పాకిస్థాన్‌కు వెళ్తున్న భారతీయ జలాలను బంద్ చేయనున్నట్టు ప్రకటించింది. 
 
ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి నితన్ గడ్కరీ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన వరుస ట్వీట్లు చేశారు. "ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో మన ప్రభుత్వం పాకిస్థాన్‌కు వెళ్ళే మన వాటా జలాలను నిలిపేయాలని నిర్ణయించింది. తూర్పు నదుల నుంచి జలాలను మళ్ళించి, జమ్మూ-కాశ్మీరు, పంజాబ్‌లలోని మన ప్రజలకు సరఫరా చేస్తాం" అని ట్వీట్‌లో ప్రకటించారు.
 
అంతేకాకుండా, "రావి నదిపై షాపూర్ - కంది వద్ద ఆనకట్ట నిర్మాణం ప్రారంభమైంది. అంతేకాకుండా, యూజేహెచ్ ప్రాజెక్టు జమ్మూ-కాశ్మీరు వాడకం కోసం మన వాటా నీటిని నిల్వ చేస్తుంది. మిగిలిన జలాలను రెండో రావి-బియాస్ అనుసంధానం నుంచి ఇతర పరీవాహక రాష్ట్రాలకు అందజేస్తాం" అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. "ఈ ప్రాజెక్టులన్నిటినీ జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాం" అని మూడో ట్వీట్‌లో వెల్లడించారు. 
 
భారత దేశానికి హక్కుగా లభించే జలాలు ఇప్పటివరకు పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్నాయని, ఆ అదనపు జలాల వాడకం హక్కును వినియోగించుకుంటున్నామని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. సట్లెజ్, బియాస్, రావి నదులను తూర్పు నదులు అంటారు. ఈ నదీ జలాలు పాకిస్థాన్‌కు చేరకుండా అడ్డుకోవడం వల్ల, ఉగ్రవాదానికి గట్టి మద్దతిస్తున్న ఆ దేశాన్ని ధీటుగా శిక్షించడంలో కీలక చర్యగా భావించవచ్చని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.