శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 ఫిబ్రవరి 2020 (22:57 IST)

బెంగుళూరు సభలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు... బెంబేలెత్తిన అసదుద్దీన్

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి ఓ మహిళ ముచ్చెమటలు పోయించింది. సేవ్ కాన్‌స్టిట్యూషన్ అనే పేరుతో సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా బెంగుళూరులో గురువారం ఓ బహిరంగ సభ జరిగింది. ఇందులో అసదుద్దీన్ ఓవైసీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు మరికొందరు వేదికపై అసీనులైవున్నారు. 
 
అయితే, అమూల్య అనే యువతిని ప్రసంగించాల్సిందిగా నిర్వాహకులు వేదికపైకి ఆహ్వానించారు. దీంతో ఆ యువతి వచ్చి... మైకు తీసుకుని పాకిస్థాన్ జిందాబాద్ అంటూ బిగ్గరగా అరుస్తూ, సభకు హాజరైనవారందరిని కూడా తనతోకలిసి పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయాలని పిలుపునిచ్చారు. 
 
దీంతో సభ నిర్వహకులతో పాటు సభకు వచ్చిన వారంతా ఒకింత ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా, వేదికపై కూర్చొనివున్న అసదుద్దీన్ ఓవైసీ అయితే బెంబేలెత్తిపోయారు. తన కుర్చీలోనుంచి ఒక్క ఊపున లేచి పరుగెత్తుకుంటూ ఆ యువతి వద్దకు వెళ్లి మైకును లాక్కొనే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వేదికపై నుంచి ఆ యువతిని దించివేయాల్సిందిగా కోరారు. 
 
కానీ, ఆ యువతి మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసింది. ఆ వెంటనే పోలీసులు వేదికపైకి వచ్చి ఆ యవతిని కిందకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అసంతృప్తితో పాటు.. తన ఖండనను తెలియజేశారు. 
 
ఆ తర్వాత ఈ వ్యవహారంపై ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన ఆ యువతికి తమకుగానీ, తమ పార్టీకిగాని ఎలాంటి సంబంధం లేదు. ఆమె చర్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నా. కార్యక్రమ నిర్వాహకులు ఆ యువతిని వేదికపైకి ఆహ్వానించివుండకూడదు. ఈ యువతి విషయం తనకు ముందుగా చెప్పివుంటే ఈ కార్యక్రమానికి వచ్చివుండేవాడినికాదు. మేమంతా భారతదేశం కోసం పాటుపడుతున్నాం. ఇది మా మాతృదేశం. ఈ దేశం కోసం జీవిస్తున్నాం. పాకిస్థాన్ మా శతృదేశం. ప్రస్తుతం భారతదేశాన్ని కాపాడేందుకే తాము శక్తివంచనలేకుండా పోరాటం చేస్తున్నాం అని అసదుద్దీన్ తెలిపారు. 
 
అలాగే, జేడీఎస్ నేత ఇమ్రాన్ పాషా స్పందిస్తూ, తమ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకే ప్రత్యర్థులు ఆ యువతిని ఇక్కడకు పంపించివుంటారని ఆరోపించారు. కాగా, ఆ యువతి చేసిన నినాదాలతో సభాప్రాంగణమంతా కొద్దిసేపు ఉద్రిక్తవాతావరణం నెలకొంది.