మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వినాయక చవితి
Written By ivr
Last Modified: గురువారం, 24 ఆగస్టు 2017 (15:02 IST)

గణేషుడికి 21 పత్రాలతో పూజ... అవేంటో తెలుసా? ఈ వినాయకుడు దీవిస్తాడు(వీడియో)

వినాయక చవితి పర్వదినం ఆగస్టు 25, 2017. ఈ పండుగ నాడు గణనాధునికి అనేక రకాల పత్రాలతో (ఆకుల) పూజ చేస్తాం. ఔషధ గుణాలున్న ఈ పత్రాలను నవరాత్రులలో ఇంట్లో ఉంచుకున్నందువల్ల పత్రాల నుండి, అలాగే కొత్తమట్టితో తయారుచేసిన గణనాధుడి నుండి ప్రాణవాయువులు వెలువడి ఆ కుటు

వినాయక చవితి పర్వదినం ఆగస్టు 25, 2017. ఈ పండుగ నాడు గణనాధునికి అనేక రకాల పత్రాలతో (ఆకుల) పూజ చేస్తాం. ఔషధ గుణాలున్న ఈ పత్రాలను నవరాత్రులలో ఇంట్లో ఉంచుకున్నందువల్ల పత్రాల నుండి, అలాగే కొత్తమట్టితో తయారుచేసిన గణనాధుడి నుండి ప్రాణవాయువులు వెలువడి ఆ కుటుంబంలోని అందరికి ఆయురారోగ్యాలు పంచుతుంది. ఇది మన పూర్వులైన ఋషులు కనుగొని మనకు నేర్పిన విషయం. దీనిని నేటి మన వైద్యులు కూడా నొక్కి చెబుతున్నారు. 
 
వినాయక చవితి పూజలో వాడే పత్రాలన్నీ చెట్టు నుండి విడిపోయిన 48 గంటల వరకు ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. అంతేకాక వాటిని 9 రోజుల అనంతరం నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వాటి నుండి వెలువడే ఆల్కలాయిడ్స్ నీటిలోకి చేరి అక్కడి రోగకారక క్రిములను, చెడు పదార్థాలను నాశనం చేస్తాయి. ఆ నీటిలో ప్రాణవాయువు శాతాన్ని పెంచుతాయి. అంతేకాక ఆ పత్రి నుండి వెలువడే సుగంధాన్ని పీల్చడం ద్వారా కూడా స్వస్థత చేకూరుతుంది. పత్రిని చేతితో ముట్టుకోవడం వలన కావలసిన మోతాదులో చర్మం ద్వారా మన శరీరంలోకి శోషణం చెంది ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. పిల్లలకు పత్రి సేకరణ వలన విజ్ఞానము, వినోదము, పర్యావరణ పట్ల స్నేహ భావము కలుగుతాయి. విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ. ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క ఔషధ గుణాలు ఉన్నాయి.
 
1. మాచీపత్రం (మాచిపత్రి) :- ఇది దద్దుర్లు, తలనొప్పి, వాత నొప్పులు, కళ్ళకు సంబంధించిన వ్యాధులు, చర్మ సంబంధమైన వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది. 
2. బృహతీ పత్రం(వాకుడాకు) : - ఇది దగ్గు, జలుబు, జ్వరం, అజీర్ణం, మూత్ర వ్యాధులను, నేత్ర వ్యాధులను నయం చేయడానికి, దంత ధావనానికి దోహదపడుతుంది. 
3. బిల్వ పత్రం( మారేడు) :- ఇది జిగట విరేచనాలు, జ్వరం, మధుమేహం, కామెర్లు, నేత్ర వ్యాధులు, శరీర దుర్గంధం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 
4. దూర్వాయుగ్మం(గరిక) :-  ఇది గాయాలు, చర్మ వ్యాధులు, దద్దుర్లు, మూత్రంలో మంట, ముక్కు సంబంధ వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు, మొలల నివారణకు ఉపయోగపడుతుంది. 
5. దత్తూర పత్రం(ఉమ్మెత్త) :- ఇది సెగ గడ్డలు, స్తన వాపు, చర్మ వ్యాధులు, పేను కొరుకుడు, శరీర నొప్పులు, శ్వాసకోశ వ్యాధులు, ఋతు వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. ఇది విషం కావున కాస్తంత జాగ్రత్తగా వాడుకోవాలి. 
 
6. బదరీ పత్రం(రేగు) :- ఇది జీర్ణకోశ వ్యాధులు, రక్త సంబంధ వ్యాధులు, చిన్న పిల్లల వ్యాధుల నివారణకు రోగ నిరోధక శక్తి పెంపుదలకు సహాయపడుతుంది. 
7. ఆపామార్గ పత్రం(ఉత్తరేణి) :-  ఇది దంత ధావనానికి, పిప్పి పన్ను, చెవి పోటు, రక్తం కారటం, మొలలు, గడ్డలు, అతి ఆకలి, జ్వరం, మూత్ర పిండాలలో రాళ్ళు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 
8. తులసీ పత్రం(తులసీ) :- ఇది దగ్గు, జలుబు, జ్వరం, చెవిపోటు, పన్ను నొప్పి, తుమ్ములు, చుండ్రు, అతిసారం, గాయాలు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ముఖ సౌందర్యం, వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. 
9. చూత పత్రం( మామిడాకు) :-  ఇది రక్త విరోచనాలు, చర్మ వ్యాధులు, ఇంటిలోని క్రిమి కీటకాల నివారణకు దోహదపడుతుంది. 
10. కరవీర పత్రం( గన్నేరు) :-  ఇది కణుతులు, తేలు కాటు- విష కీటకాల కాట్లు, దురద, కళ్ళ సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగించబడుతుంది. 
 
11. విష్ణుక్రాంత పత్రం( విష్ణు కాంత) :-  ఇది జ్వరం, కఫం, దగ్గు, ఉబ్బసం తగ్గించడానికి, జ్ఞాపకశక్తి పెంపొందింపజేయడానికి ఉపయోగపడుతుంది. 
12. దాడిమీ పత్రం(దానిమ్మ) :-  ఇది విరోచనాలు, అతిసారం, దగ్గు, కామెర్లు, మొలలు, ముక్కు నుండి రక్తం కారడం, కండ్ల కలకలు, గొంతు నొప్పి, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 
13. దేవదారు పత్రం(దేవదారు) :-  ఇది అజీర్తి, పొట్ట సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, కంటికి సంబంధించిన వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 
14. మరువక పత్రం(మరువం) :-  ఇది జీర్ణశక్తి, ఆకలి పెంపొదించుటకు, జుట్టు రాలడం, చర్మ వ్యాధులు తగ్గించుటకు ఉపయోగపడుతుంది. దీనిని సువాసనకు ఉపయోగిస్తారు. 
15. సింధూర పత్రం( వావిలి) :-  ఇది జ్వరం, తలనొప్పి, కీళ్ళ నొప్పులు, గాయాలు, చెవిపోటు, మూర్ఛ వ్యాధి, ప్రసవం తరువాత వచ్చే ఇబ్బందులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
 
16. జాజీ పత్రం( జాజి ఆకు) :- ఇది వాత నొప్పులు, జీర్ణాశయ వ్యాధులు, మలాశయం వ్యాధులు, నోటి పూత, దుర్వాసన, కామెర్లు, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 
17. గండకీ పత్రం(దేవ కాంచనం) :- ఇది మూర్ఛ వ్యాధి, కఫం, పొట్ట సంబంధ వ్యాధులు. నులి పురుగుల నివారణకు ఉపయోగపడుతుంది. దీని ఆకులు ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. 
18. శమీ పత్రం(జమ్మి ఆకు) :- ఇది కఫం, మూల వ్యాధి, కుష్టు వ్యాధి, అతిసారం, దంత వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది. 
19. అశ్వత్థ పత్రం ( రావి ఆకు) :-  ఇది మల బద్ధకం, వాంతులు, మూత్ర వ్యాధులు, జ్వరాలు నివారించడానికి ఉపయోగపడుతుంది. జీర్ణ శక్తి, జ్ఞాపక శక్తి పెంపొందించడానికి సహకరిస్తుంది. 
20. అర్జున పత్రం( తెల్ల మద్ది) :-  ఇది చర్మ వ్యాధులు, కీళ్ళ నొప్పులు, మలాశయ దోషాలు, గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది. 
21. ఆర్క పత్రం( జిల్లేడు) :- ఇది చర్మ వ్యాధులు, సెగ గడ్డలు, కీళ్ళ నొప్పులు, చెవిపోటు, కోరింత దగ్గు, దంతశూల, విరేచనాలు, తిమ్మిర్లు, బోధకాలు , వ్రణాలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
 
వినాయకుడు దీవిస్తున్నాడు... ఈ వీడియో చూడండి...