పిల్లలు బొమ్మలతో ఆడుకోవడం మంచిదా? సంగీతం వినడం మంచిదా? తెలుసుకోండి..
పిల్లలకు నచ్చిన బొమ్మలు తీసిపెట్టి.. ఆడుకోండని పనులు చేసుకునే తల్లిదండ్రులా మీరు.. అయితే ఒక్క క్షణం ఆగండి. పిల్లలకు బొమ్మలు తీసిపెట్టడం కంటే.. సంగీతం వినిపించండి అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే.. సంగీతం వింటే పిల్లల్లో మెదడు చురుగ్గా పనిచేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. బొమ్మలతో ఆడుకునే పిల్లలతో పోల్చితే.. సంగీతం వినే పిల్లల్లో వినికిడి శక్తి బాగా పెరుగుతున్నట్లు వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ లెర్నింగ్ అండ్ బ్రెయిన్ సైన్సెస్ (ఐ-ల్యాబ్స్) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
సంగీతాన్ని వినడం ద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగడం, సంగీత విన్యాసాలను గ్రహించడం ద్వారా మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఐ-ల్యాబ్స్ కో డైరక్టర్, అధ్యయన నివేదిక సహ రచయిత పట్రిసియా కుహ్ల్ వెల్లడించారు. సంగీతం వినడం ద్వారా తెలివితేటలు పెరగుతాయి. సంగీతాన్ని జీవితంలో భాగంగా చేసుకుంటే అనేక ప్రయోజనాలున్నాయని.. సంగీతాన్ని వినడం ద్వారా సంక్లిష్ట విషయాలను అర్థం చేసుకోవడం సులభమవుతుందని కుహ్ల్ తెలిపారు. ఈ స్టోరీ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మేగజైన్‌లో ప్రచురితమైంది.