మంగళవారం, 12 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (17:43 IST)

అజయ్ పాల్ సింగ్ బంగా: 'హైదరాబాద్ పబ్లిక్ స్కూల్' విద్యార్ధి నుంచి ప్రపంచ బ్యాంకు వరకు..

ajay banga
అజయ్ పాల్ సింగ్ బంగా.. ఈ భారతీయుడి పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి వచ్చింది. ప్రపంచబ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేయడంతో ఆయన పేరు పెద్ద ఎత్తున వార్తల్లోకి వచ్చింది. అజయ్ బంగాకు హైదరాబాద్‌తో ప్రత్యేక సంబంధం ఉంది. ఎందుకంటే ఆయన విద్యాభ్యాసం హైదరాబాద్‌లోనే సాగింది. అజయ్ బంగా స్వస్థలం పుణె అయినప్పటికీ.. చదువు మాత్రం బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో(హెచ్‌పీఎస్) సాగింది.
 
బంగా 11వ తరగతి వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నారని ఆ పాఠశాల ప్రతినిధులు చెప్పారు. సరిగ్గా 47 ఏళ్ల కిందట.. అంటే 1976లో అజయ్ బంగా హెచ్‌పీఎస్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. అజయ్ బంగా తండ్రి హర్భజన్ సింగ్ ఆర్మీలో అధికారి. లెఫ్టినెంట్ జనరల్ హోదాలో పదవీ విరమణ చేశారు. అప్పట్లో హర్భజన్‌కు హైదరాబాద్‌కు బదిలీ అయింది. బంగాను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేర్పించారని, ఇక్కడే పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారని ఆ స్కూల్ సొసైటీ ఛైర్మన్ గుస్తి నోరియా బీబీసీకి చెప్పారు. బంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువు ముగించుకున్న తర్వాత దిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో అర్థ శాస్త్రంలో బీఏ చదివారు. అనంతరం అహ్మదాబాద్ ఐఐఎం‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అజయ్ బంగా మాస్టర్ కార్డ్ సీఈవోగానూ పనిచేశారు.
 
2016లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో అజయ్ బంగాను సత్కరించింది. ప్రపంచ బ్యాంకు సారథిగా అజయ్ బంగాను నామినేట్ చేయడంపై హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ అధ్యక్షులు గుస్తి నోరియా బీబీసీతో మాట్లాడారు. ‘‘హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు లభించిన అరుదైన ఘనత ఇది. స్కూల్లో చదివిన ఎందరో విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. అజయ్ బంగాకు దక్కిన ఈ గౌరవంపై మేం ఎంతో గర్వ పడుతున్నాం. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంలోనే స్కూల్ పూర్వ విద్యార్థి ప్రపంచ బ్యాంకుకు సారథి కావడం గర్వంగా ఉంది’’ అని తెలిపారు.
 
అజయ్ నామినేషన్ ప్రకటించిన జో బిడెన్
ప్రపంచ బ్యాంక్‌కు నాయకత్వం వహించడానికి భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ బంగాను అమెరికా ప్రతిపాదిస్తున్నట్లు అధ్యక్షుడు జో బిడెన్ పేర్కొన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంపై మరింత దృష్టి పెట్టాలని బ్యాంక్‌పై అమెరికా ఒత్తిడి పెంచిన అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. బంగా ఒక దశాబ్దానికి పైగా క్రెడిట్ కార్డ్ దిగ్గజం మాస్టర్ కార్డ్‌ సంస్థకు నాయకత్వం వహించారు. ఇప్పుడు ఒక ప్రైవేట్ ఈక్విటీలో పని చేస్తున్నారు. బ్యాంక్ తన లక్ష్యాల దిశగా ప్రైవేట్ రంగంతో కలిసి పని చేయడానికి సాయం చేసిన అనుభవం అజయ్ బంగాకు ఉందని అమెరికా అధికారులు వెల్లడించారు. తదుపరి అధ్యక్షుడిని అధికారికంగా నియమించాల్సిన బాధ్యత బ్యాంకు బోర్డుపై ఉంది. షార్ట్ లిస్ట్ చేసిన ముగ్గురిని ఇంటర్వ్యూ చేయాలని ప్లాన్ చేశామని, మే ప్రారంభంలో కొత్త నాయకుడిని ప్రకటించాలనుకున్నట్లు బ్యాంకు బుధవారం తెలిపింది. మహిళా నామినీలను గట్టిగా ప్రోత్సహించినట్లు కూడా తెలిపింది. ఇతర దేశాలు వేరే సూచనలను ముందుకు తెస్తాయో లేదో స్పష్టత లేదు. 
 
బంగాకు ఉన్న అనుభవం ఏంటి?
ప్రపంచ బ్యాంక్‌కు అమెరికా అతిపెద్ద వాటాదారు. ప్రతి సంవత్సరం ఆయా దేశాలకు బిలియన్ల డాలర్ల రుణాలను అందించే సంస్థకు నాయకత్వం వహించే వ్యక్తిని ఎన్నుకునే బాధ్యతను అగ్రరాజ్యమే చూసుకుంటోంది. ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ మాట్లాడుతూ ప్రపంచ బ్యాంక్ "సరైన ఎజెండాతో ఫోర్స్ మల్టిప్లయర్"గా పనిచేయాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రభుత్వాలు, కంపెనీలు, లాభాపేక్ష లేని సంస్థల మధ్య భాగస్వామ్యాలను ఏర్పరచడంలో బంగా ట్రాక్ రికార్డ్‌ను గుర్తుచేస్తూ ఆ బాధ్యతను స్వీకరించడానికి ఆయన ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారని జానెట్ పేర్కొన్నారు.
 
ఇప్పుడు అమెరికా పౌరుడైన బంగా తన స్వదేశం నుంచి ప్రొఫెషనల్‌గా ఎదిగారు. ఆయన తండ్రి సైన్యంలో అధికారి. బంగా మాస్టర్ కార్డ్‌లో చేరడానికి ముందు నెస్లే, సిటీ గ్రూప్‌లో పనిచేశారు. బంగా 2021లో మాస్టర్ కార్డ్‌ కంపెనీలో పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్ అనే ప్రైవేట్ ఈక్విటీ సంస్థకు వైస్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఆ కంపెనీలోని దాదాపు రూ. 28.9 వేల కోట్ల 'వాతావరణ నిధి సలహా బోర్డు'లో ఆయన కూడా ఉన్నారు. అమెరికాకు వలసదారుల ప్రవాహాన్ని అరికట్టడానికి ప్రైవేట్ రంగ పెట్టుబడులను పెంచే లక్ష్యంతో వైట్‌హౌస్‌తో కలిసి బంగా పనిచేశారు.
 
బంగా నియామకంపై స్పందనేంటి?
సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అమాండా గ్లాస్‌మాన్ మాట్లాడుతూ దశాబ్దాల పాటు వ్యాపారంలో అనుభవమున్న బంగా బ్యాంక్‌ మీద కాంగ్రెస్‌కు విశ్వాసం పెంచగలరని పేర్కొన్నారు. అయితే బంగా సరైన ఎంపిక కాదా అనేది చూడాల్సి ఉందని, బ్యాంక్ ఉద్యోగానికి ప్రధానమైన ప్రభుత్వం, అభివృద్ధి పనుల విషయంలో ఆయనకు అనుభవం తక్కువని వ్యాఖ్యానించారు. "బ్యాంకు ఎలా ఉండాలనే దాని గురించి ఆయన ఆలోచనలేంటో తెలుసుకోవడానికి మేం ఎదురుచూస్తున్నాం" అని అమాండా అన్నారు.
 
బ్యాంకు తదుపరి నాయకుడిగా ఎవరు వచ్చినా తక్కువ-ఆదాయ దేశాల తక్షణ ఆర్థిక అవసరాలను బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించడం వారి ముందున్న సవాలు. చాలా దేశాలు రుణ సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. అదే సమయంలో వాతావరణ మార్పు, ప్రపంచ సంఘర్షణ, మహమ్మారి ప్రమాదాలు వంటి సమస్యలను ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు పరిష్కరించాలి. "ప్రపంచ బ్యాంక్ వ్యూహం ప్రకారం భవిష్యత్తులో చేయాల్సింది చాలా ఉంద’’ ని అమాండా అంటున్నారు.
 
ప్రస్తుత అధ్యక్షుడు ఎందుకు దిగిపోతున్నారు?
బంగా నామినేషన్‌ ఆమోదిస్తే, మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేసిన డేవిడ్ మాల్పాస్ స్థానంలో బంగా నియమితులవుతారు. డేవిడ్ మాల్పాస్ ఐదేళ్ల పదవీకాలం ముగియడానికి దాదాపు ఏడాది సమయముంది. జూన్ నాటికి పదవి నుంచి వైదొలుగుతానని డేవిడ్ ఈ నెలలో ప్రకటించారు. వాతావరణ మార్పులను పరిష్కరించడం కోసం బ్యాంక్ వనరులకు డైరెక్షన్ ఇవ్వడంలో డేవిడ్ నెమ్మదిగా ఉన్నారని పర్యావరణ పరిరక్షకులు విమర్శిస్తున్నారు. గతేడాది శిలాజ ఇంధనాలు వాతావరణ మార్పులపై ప్రభావం చూపిస్తున్నాయో లేదో తనకు తెలియదని వ్యాఖ్యానించారు డేవిడ్. దీంతో ఆయనను వైట్‌హౌస్ బహిరంగంగానే మందలించింది. అనంతరం డేవిడ్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు.