బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 18 ఫిబ్రవరి 2023 (13:19 IST)

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని: మూడు రాజధానుల ముచ్చట ముగిసిందా? విశాఖపట్నం ఒక్కటే రాజధాని అని ఎందుకు చెప్తున్నారు?

vizag
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వ్యవహారం మరో మలుపు తిరుగుతోంది. అమరావతి రాష్ట్ర రాజధానిగా 2015లో నాటి నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వం నోటిఫై చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2020లో 'అధికార వికేంద్రీకరణ' పేరుతో మూడు రాజధానులు చేస్తున్నామని ప్రకటించింది. దానిపై చట్టం చేసే వరకూ వెళ్లింది. ఇప్పుడు మూడు రాజధానులు కాదు.. ఒక్కటే రాజధాని అని.. ఆ రాజధాని విశాఖపట్నం అని కొందరు మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో తీవ్ర గందరగోళం, అయోమయం తలెత్తుతోంది.
 
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే అంశం మీద వివాదం సుప్రీంకోర్టులో ఉంది. ఈలోగా త్వరలోనే పాలన విశాఖపట్నానికి మారుతుందని ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఒక రాజధాని నుంచి మూడు రాజధానులకు వెళ్లిన ప్రభుత్వ పెద్దల నుంచే.. ఇప్పుడు మళ్లీ ‘మూడు కాదు, ఒకటే రాజధాని’ అనే మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఈ అంశంపై పాలక, ప్రతిపక్ష పార్టీల వాదనలు ఏమిటి?
 
విశాఖ ఒక్కటే రాజధాని అంటున్న మంత్రులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా విశాఖపట్నం ఉంటుందంటూ ఏపీ మంత్రులు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తొలుత శ్రీకాకుళంలో జరిగిన బహిరంగసభలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ మాట అన్నారు. విశాఖపట్నం ఏకైక రాజధాని అని ఆయన రెండు నెలల క్రితం చెప్పారు. తర్వాత పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా అదే విధంగా వ్యాఖ్యానించారు. జనవరి 30న దిల్లీలో విశాఖ పెట్టుబడుల సదస్సు సన్నాహాక సమావేశంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి కూడా త్వరలోనే విశాఖపట్నం రాజధాని అవుతుందని చెప్పారు. తాజాగా ఫిబ్రవరి 14న బెంగళూరులో జరిగిన ఇన్వెస్టర్ల సమావేశంలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరో అడుగు ముందుకేసి మూడు రాజధానులు అనేది 'మిస్ కమ్యూనికేషన్' అని చెప్పారు. సమావేశంలో ఎదురయిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఇలా స్పందించారు.
 
"మూడు రాజధానులు అనేది సమాచార లోపం. పాలన విశాఖ నుంచే జరుగుతుంది. పాలనా రాజధానిగా విశాఖను ఎంపిక చేశామంటే విభజిత ఆంధ్రప్రదేశ్‌లో విశాఖలో సదుపాయాలున్న ప్రాంతమే కాకుండా అభివృద్ధికి అవకాశం ఉన్న నగరం. కాబట్టి పోర్ట్ సిటీగా, కాస్మోపాలిటన్ నగరంగా ఉండడం, వాతావరణం అన్నీ కలిసివస్తాయి. ఇతర నగరాలు రాజధాని అని కాదు. కర్ణాటకలో గుల్బర్గా, ధార్వాడ్‌లో హైకోర్టు బెంచి ఉన్నట్టే. అలా కర్నూలు ఎంపిక చేసుకోవడానికి వందేళ్ల నాటి కారణాలున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందే 1937లో పాలనా రాజధాని ఒక ప్రాంతంలో ఉంటే హైకోర్టు మరో ప్రాంతంలో డాలని శ్రీబాగ్ ఒడంబడిక జరిగింది. అందులో భాగంగా హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణయించాము" అంటూ ఆయన సమాధానమిచ్చారు.
 
అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్టు మంత్రి బుగ్గన తెలిపారు. కర్ణాటకలో శాసనసభ ఒక సెషన్ బెల్గాంలో నిర్వహిస్తున్నట్టుగానే తాము కూడా ఒక సెషన్ గుంటూరులో నిర్వహిస్తామన్నారు. తిరుపతి వెంకటేశ్వర నిలయం కాబట్టి అది ఈ విశ్వానికే రాజధాని అని ఆయన అభివర్ణించారు. కోవిడ్ సహా వివిధ కారణాల రీత్యా విశాఖలో రాజధాని ఏర్పాటు ఆలస్యమయ్యిందని, త్వరలోనే అది జరుగుతుందని బుగ్గన చెప్పారు.
 
వికేంద్రీకరణ నుంచి మళ్లీ మొదటికి..
పాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి అంటూ బయట మాత్రమే కాకుండా అసెంబ్లీ, హైకోర్టు వేదికగా చెప్పిన ప్రభుత్వం, తర్వాత ఒకటే రాజధానిగా విశాఖ వైపు మళ్లుతున్నట్టు ఈ పరిణామాలు చెబుతున్నాయి. ప్రభుత్వం మూడు రాజధానుల నుంచి మళ్లీ ఒక రాజధాని అనేందుకు సిద్ధపడడం వెనుక రాజకీయ, చట్ట, శాసనపరమైన కారణాలున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే రాజధాని విషయంలో సుప్రీంకోర్టు ముందు పలు పిటిషన్లు విచారణలో ఉన్నాయి. ఫిబ్రవరి 23న వాటిని విచారించే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడిస్తూ అఫిడవిట్ కూడా సుప్రీంకోర్టు ముందుంచింది. గతంలో రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు అఫిడవిట్‌లో చెప్పిన కేంద్ర ప్రభుత్వం తాజాగా తన వాదనను సవరించుకుంది.
 
రాజధాని విషయమై ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5, 6 ని ప్రస్తావించింది. శివరామకృష్ణన్ కమిటీ ఏర్పాటు గురించి కూడా తాజా అఫిడవిట్‌లో గుర్తు చేసింది. సెక్షన్ 94 ప్రకారం రాజధాని ఏర్పాటు కోసం అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిన విషయాన్ని కూడా కోర్టు ముందుకు తీసుకొచ్చింది. అంతకుముందు ఏపీ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో విశాఖనే రాజధానిగా పేర్కొంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌లో ఈ విషయం ప్రస్తావించింది. రాజధాని మార్పు విషయంలో శాసనసభకు హక్కు లేదంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే ఇవ్వాలని కోరింది.
 
తొలుత సుప్రీంకోర్టు మాత్రం హైకోర్టు విధించిన కాలపరిమితి వరకే స్టే విధించింది. కేసు విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ఈ కేసులో వివిధ సంఘాలు, కొందరు వ్యక్తులు ఇంప్లీడ్ అయ్యారు. సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉంది. కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉండగానే రాజధాని విషయంపై ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవడం చర్చనీయమవుతోంది. పదే పదే విశాఖ పేరు ప్రస్తావిస్తూ సీఎం నుంచి మంత్రుల వరకూ త్వరలోనే అదే రాజధాని అని చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
 
మొదటి నుంచి వివాదాలు...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఏపీ రాజధాని ఏర్పాటు వ్యవహారం ఆరంభం నుంచి వివాదంగానే ఉంది. అయితే విజయవాడ సమీపంలో రాజధాని ఏర్పాటు చేయాలని నాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. విపక్షంలో ఉండగా శాసనసభ వేదికగా అమరావతిలో రాజధాని ఏర్పాటును ఆమోదించిన వైఎస్సార్సీపీ ఆ తర్వాత శంకుస్థాపన కార్యక్రమానికి మాత్రం గైర్హాజరయ్యింది. అమరావతి పేరుతో ల్యాండ్ పూలింగ్ సహా అన్ని విషయాల్లోనూ అవినీతి జరిగిందని ఆరోపించింది. దాని మీద పుస్తకాలు ముద్రించడం నుంచి పలు విమర్శలు చేసింది.
 
తదుపరి తాడేపల్లిలోనే నివాసం ఏర్పాటు చేసుకుని 2019 సాధారణ ఎన్నికలకు ముందు గృహప్రవేశం చేయడం ద్వారా రాజధానిగా అమరావతికి అన్ని విధాలా మద్దతు ఉంటుందనే విషయాన్ని తెలిపింది. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో జగన్ 2019 డిసెంబర్ 17 నాడు అసెంబ్లీ వేదికగా మూడు రాజధానుల ప్రకటనల చేశారు. అందుకు దక్షిణాఫ్రికాను ఉదహరించారు. పాలనా వికేంద్రీకరణ తమ విధానమని చెప్పారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలును జ్యుడీషియల్ క్యాపిటల్‌గా ప్రతిపాదిస్తూ అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంటుందని తెలిపారు.
 
సీఎం ప్రకటనకు అనుగుణంగా 2020 జనవరిలో శాసనసభ ప్రత్యేక సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో సీఆర్డీయే రద్దు, ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లులు ఆమోదించారు. శాసనమండలిలో హైడ్రామా జరగడంతో బిల్లు పెండింగులో పడింది. ఆ తర్వాత సెప్టెంబర్‌లో మళ్లీ అసెంబ్లీ ఆమోదంతో మండలి అభిప్రాయంతో సంబంధం లేకుండానే చట్టంగా రూపొందే అవకాశాన్ని పొందారు. గవర్నర్ ఆమోదంతో 2020 సెప్టెంబర్‌లో మూడు రాజధానుల చట్టం రూపొందించారు.
 
న్యాయపరమైన చిక్కులు
మూడు రాజధానులు ఉండాల్సిందేనని వైసీపీ ఆందోళనలు కూడా చేసింది. ఏపీ ప్రభుత్వంలోని మంత్రులు, ఇతర నేతలు విశాఖపట్నం, కర్నూలులో ఈ అంశంపై గర్జన పేరుతో సభలు కూడా నిర్వహించారు. పాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానులు కోరుతూ కొన్ని సంఘాలు కూడా కార్యక్రమాలు చేపట్టాయి. మరోవైపు అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని భూములిచ్చిన రైతాంగం చేపట్టిన ఉద్యమానికి పోటీగా అక్కడక్కడా నిరసనలు తెలిపారు. అమరావతి ఉద్యమానికి వైఎస్సార్సీపీ మినహా అన్ని పార్టీలు మద్ధతు పలికాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహా విపక్ష పార్టీల నేతలంతా ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్నారు.
 
అదే సమయంలో న్యాయపరమైన చిక్కులు ఏపీ ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి. ఏపీ హైకోర్టులో కేసు విచారణలో ఉండగా తుది తీర్పు వెలువడేందుకు ముందుగా 2022 మార్చిలో, తాము చేసిన రెండు చట్టాలను ఉపసంహరించుకుంది. ఏపీ సీఆర్డీయే రద్దు, పాలనా వికేంద్రీకరణ పేరుతో చేసిన మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకుంది. ఏపీ హైకోర్టు 2022 మార్చి5న వెలువరించిన తీర్పులో రాజధానులను మార్చే విషయంలో శాసనసభకు అధికారం లేదని చెప్పింది. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలంటూ కాలపరిమితి కూడా విధించింది. ఆ ఆదేశాల మీద ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సర్కారు ఆశించిన ఫలితం ఇప్పటి వరకూ రాలేదు.
 
ఇంత గందరగోళం ఎందుకు?
రాజధాని విషయంలో తమ పార్టీ వైఖరి మారలేదని పాలకపక్షం చెబుతోంది. చట్టం పరిధిలో ఉన్న అంశాన్ని దానికి తగ్గట్టుగానే వ్యవహరిస్తున్నట్టు చెబుతోంది. కానీ ప్రభుత్వ తీరు మీద పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. "రాజధాని విషయంలో ఇంత గందరగోళం రాష్ట్రానికి చేటు చేస్తుంది. పూర్తి అస్పష్టత. చివరకు కోర్టులో ఉండగా తలో మాట చెబుతున్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడకముందే ఎందుకీ ఆతృత. ప్రభుత్వమే కోర్టుకి వెళ్లింది. త్వరగా విచారణ చేయమని కూడా కోరింది. త్వరలో తీర్పు వస్తుంది. ఈలోగా ఇన్ని మార్లు మాట మార్చడం ఎందుకు? చివరకు ఏకైక రాజధాని అంటూ విశాఖపట్నం పేరు చెబుతున్నా ఆ మాటకయినా కట్టుబడతారా అంటే సందేహమే. అప్రజాస్వామిక ధోరణిలో సాగుతున్నారు" అంటూ విశ్రాంత జర్నలిస్ట్ పాశం జగన్నాథం నాయుడు వ్యాఖ్యానించారు.
 
రాయలసీమలో న్యాయ రాజధాని అంటూ చెబుతున్న మాటను చివరకు నీరుగార్చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు అనుమానాస్పదంగా ఉందని ఆయన బీబీసీ వద్ద అభిప్రాయపడ్డారు. పాలన అంతా విశాఖ నుంచే అని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, తన చేతిలో లేని హైకోర్ట్ ప్రిన్సిపల్ బెంచ్ గురించి ఎలా మాట్లాడుతుందని జగన్నాథం నాయుడు ప్రశ్నించారు. ''ఏపీ హైకోర్టు ఏర్పాటు రాష్ట్రపతి గెజిట్ ద్వారా జరిగిందని మరచిపోతున్నారా?'' అన్నారు.
 
ఇదంతా డ్రామానే: టీడీపీ
విశాఖలో విలువైన భూములు కాజేసెందుకు చేస్తున్న డ్రామాగా తాము ఇన్నాళ్లుగా చేస్తున్న ఆరోపణ తాజాగా ప్రభుత్వ తీరుతో బట్టబయలు అవుతోందని టీడీపీ వ్యాఖ్యానిస్తోంది. "మూడు రాజధానులు, అన్ని ప్రాంతాల అభివృద్ధి అనేది బూటకం. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. రాష్ట్రమంతా అభివృద్ధి, అందుబాటులో రాజధాని ఉండాలని మేము నిర్ణయించాము. దాన్ని విధ్వంసం చేసి మూడేళ్లుగా రాష్ట్రాన్ని సందిగ్ధంలో నెట్టారు. రాయలసీమ, కోస్తా జిల్లాల ప్రజలను మోసం చేశారు. ఉత్తరాంధ్రలో భూకబ్జాలకు పాల్పడుతున్నారు. ఇంతటి మోసం ఎన్నడూ చూడలేదు" అని టీడీపీ అధికార ప్రతినిధి కె.పట్టాభి విమర్శించారు. రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా చేసుకుని అన్ని ప్రాంతాల అభివృద్ధి బాధ్యత టీడీపీ తీసుకుంటుందని ఆయన చెప్పారు. మరోవైపు విశాఖ రాజధాని అంటే వైజాగ్ వాసులు కూడా అంగీకరించడం లేదని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రభుత్వం రాజీనామా చేసి విశాఖ రాజధాని అంశంపై ప్రజా తీర్పు కోరాలని డిమాండ్ చేశారు.
 
మా వైఖరి మారలేదు: మంత్రి బొత్స సత్యనారాయణ
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు అనుగుణంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. "అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనేది మా విధానం. అసెంబ్లీలో సీఎం చెప్పింది, నిన్నటి సమావేశంలో ఆర్థిక మంత్రి చెప్పింది అదే. అర్థం కాని వాళ్ళు వక్రభాష్యం చెబుతారు. ‘విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుంది. హైకోర్టు కర్నూలులో పెడతాం. అసెంబ్లీ అమరావతిలో జరుపుతాం’ అన్నారు. అందులో మార్పు లేదు. మా విధానంలో మార్పు లేదు. అర్థం కాని వారి విమర్శలు పట్టించుకోం’’ అని ఆయన బీబీసీతో చెప్పారు. సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
 
మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం: సజ్జల
మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు.‘‘రాజధాని పేరుతో టీడీపీ, మీడియాలో ఓ వర్గం రాజకీయం చేస్తున్నాయి. వైజాగ్‌లో పరిపాలనా రాజధాని వస్తే కడుపుమంట ఎందుకు? వికేంద్రీకరణకి ప్రజల మద్దతు ఉంది. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం. మంత్రి బుగ్గన కూడా అదే చెప్పారు’’ అని ఆయన పేర్కొన్నారు.