శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (22:34 IST)

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ ISWOTY: అయిదుగురు నామినీలు వీళ్ళే

image
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ (ISWOTY) నాలుగో ఎడిషన్‌కు నామినీలను బీబీసీ ప్రకటించింది. 2022 ఏడాదికి గాను ఐదుగురు ప్లేయర్స్ 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు కోసం పోటీపడుతున్నారు. వారిలో వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, షట్లర్ పీవీ సింధు, బాక్సర్ నిఖత్ జరీన్‌ ఉన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏక్తా భ్యాన్ వచ్చారు. బాక్సర్ విజేందర్ సింగ్ కూడా హాజరైన ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రా ఆన్‌లైన్లో పాల్గొన్నారు.

 
పారా-అథ్లెట్లకు పురస్కారం ఇవ్వడం ద్వారా బీబీసీ ఎంతో బలమైన సందేశాన్ని ఇస్తోందని, వైకల్యాన్ని ఎదుర్కొంటున్న మహిళలు కూడా జీవితాల్లో విజయాలు సాధిస్తున్నారని ప్రముఖంగా గుర్తు చేయడం ఎంతో మంచి ప్రయత్నమని ఏక్తా భ్యాన్ అన్నారు. "ఇలాంటి గుర్తింపు వల్ల సమాజంలో అవగాహన పెరుగుతుంది. అవయవ లోపంతో ఉన్న ఎంతో మంది మహిళలు క్రీడల్లో రాణించేందుకు ఇది ప్రేరణగా నిలుస్తుంది" అని ఏక్తా అన్నారు. పారా అథ్లెట్లు జీవితంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటారని, చాలా పబ్లిక్ ప్లేసెస్‌లో వీల్ చెయిర్ వెళ్ళే సౌకర్యం కూడా ఉండడం లేదని ఆమె విచారం వ్యక్తం చేశారు.

 
''మన స్పోర్ట్స్ వుమన్ వారి ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు. వీరే అసలైన యోధులు. మన క్రీడాకారిణుల విజయాలను గౌరవిస్తున్న బీబీసీ నిబద్ధతను నేను స్వాగతిస్తున్నా'' అని బాక్సర్, ఒలింపిక్ గ్రహీత విజేందర్ సింగ్ తెలిపారు. మేరీ కోమ్, నిఖత్ జరీన్, సాక్షి మాలిక్ ఎలా ఆడుతున్నారో చూడండి, మహిళలు మా కన్నా రెండడుగులు ముందున్నారని విజేందర్ వ్యాఖ్యానించారు. అంజుమ్ చోప్రా, "మహిళా క్రికెట్‌లో గత రెండు మూడు వారాలు ఎంతో కీలకమైనవి. వారు సాధించిన విజయాల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో వేచి చూడాలి" అని అన్నారు. భారతీయ మహిళా క్రీడాకారుల కృషి, వారు సాధించిన విజయాలను గుర్తించేందుకు ఈ అవార్డును అందిస్తున్నామని బీబీసీ న్యూస్ - ఇండియా హెడ్ రూపా ఝా అన్నారు.

 
ఫిబ్రవరి 20వ తేదీ రాత్రి 11.30 గంటల వరకు మీరు ఓటు వేయొచ్చు. దిల్లీలో మార్చి 5న జరిగే కార్యక్రమంలో 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు విజేతను ప్రకటిస్తారు. అన్ని రకాల నియమ, నిబంధనలను, ప్రైవసీ నోటీసును బీబీసీ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. ఓటింగ్ ఫలితాలను బీబీసీ భారతీయ భాషల సైట్లలోనూ బీబీసీ స్పోర్ట్ వెబ్‌సైట్‌లో కూడా ప్రకటిస్తారు. నామినీల్లో ఎవరికైతే ప్రజల నుంచి ఎక్కువ ఓట్లు వస్తాయో వారే బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌ విజేత అవుతారు. నామినీలుగా ఎంపికైన వారి గురించి తెలుసుకుందాం

 
పీవీ సింధు
ఒలింపిక్స్‌ వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలను పొందిన తొలి భారతీయ మహిళ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. టోక్యో గేమ్స్‌లో తన రెండో ఒలింపిక్ పతకంగా కాంస్యం పొందారు. 2016లో రియో గేమ్స్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. 2022లో కామన్‌వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని సింధు సాధించారు. అంతకుముందు 2021లో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో రజత పతకం గెలుచుకున్నారు. 2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయురాలిగా సింధు నిలిచారు.

 
17 ఏళ్ల వయసులోనే సెప్టెంబర్ 2012లో బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ 20లో చోటు దక్కించుకున్నారు. ప్రజా ఓటింగ్‌తో 2019లో ప్రారంభమైన బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పీవీ సింధు పొందారు. 2022లో అత్యధికంగా సంపాదించిన ప్రపంచంలోని మహిళా క్రీడాకారుల ఫోర్బ్స్ జాబితాలో... పీవీ సింధు 12వ స్థానంలో నిలిచారు.

 
నిఖత్ జరీన్
2011లో జూనియర్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ పొందిన తర్వాత, నిఖత్ జరీన్ 2022లో మహిళా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా ఎదిగారు. ఫైవెయిట్ కేటగిరీలో బర్మింగ్హమ్ 2022 కామన్‌వెల్త్ గేమ్స్‌లో బాకింగ్స్‌లో బంగారు పతకాన్ని నిఖత్ గెలుచుకున్నారు. భారత్‌లో నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో కూడా బంగారు పతకంతో తన 2022 ఏడాదిని ముగించారు. తన కూతురు ఉత్సాహాన్ని చూసిన నిఖత్ జరీన్ తండ్రి, ఆమెకు మరింత ప్రోత్సాహం కల్పించేందుకు క్రీడా రంగానికి పరిచయం చేశారు. తన పెళ్లిపై బంధువుల నుంచి వస్తున్న విమర్శలను, తన కూతురిపై తల్లికి ఉండే భయాలను పక్కన పెట్టిన నిఖత్ తండ్రి ఆమె కలలను సాకారం చేసుకునేలా ప్రోత్సహించారు. అప్పటి నుంచి నిఖత్ జరీన్ వెనుతిరిగి చూసుకోలేదు.

 
మీరా బాయి చాను
టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయ వెయిట్‌లిఫ్టర్‌గా సైఖోమ్ మీరాబాయి చాను 2021లో క్రీడా రంగంలో చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌ 2022లో రజత పతకాన్ని, బర్మింగ్హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని ఆమె గెలుచుకున్నారు. రియో గేమ్స్‌లో బరువు ఎత్తడంలో విఫలమైనప్పటి నుంచి అంటే 2016 నుంచి ఆమె పట్టు వదలని దీక్షతో పతకం కోసం ప్రయత్నించారు. వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్ 2017లో ఆమె బంగారు పతకాన్ని గెలుచుకోవడం ద్వారా తనని తాను నిరూపించుకున్నారు.

 
భారత్‌లోని ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మీరాబాయి చాను జన్మించారు. టీ దుకాణపు యజమాని కూతురు ఆమె. తన క్రీడా జీవితాన్ని ప్రారంభించినప్పుడు మీరాబాయి చాను ఎన్నో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నారు. కానీ, ఒలింపిక్ ఛాంపియన్‌గా ఎదిగేందుకు ఆమెను తనకెదురైన అడ్డంకులన్నింటిని అధిగమించారు. 2021లో కూడా మీరాబాయి చాను బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు.

 
సాక్షి మాలిక్
58 కేజీ వెయిట్ కేటగిరీలో కాంస్య పతకాన్ని గెలుచుకోవడంతో 2016లో రియో ఒలింపిక్స్‌లో పతకాన్ని పొందిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా సాక్షి మాలిక్ చరిత్ర సృష్టించారు. ఒలింపిక్ పతకం పొందిన నాలుగవ భారతీయ మహిళా ఈమె కావడం విశేషం. సాక్షికి క్రీడలంటే ఎంతో ఇష్టం. తన తాత రెజ్లర్ అని తెలుసుకున్న తర్వాత ఆమె ఎంతో స్ఫూర్తిని పొందారు. రియో ఒలింపిక్స్‌లో మెరిసిన తర్వాత, సాక్షి కెరీర్ ఒక్కసారిగా కుప్పకూలింది. కానీ, ఏ మాత్రం అధైర్యపడకుండా 2022లో బర్మింగ్హమ్ ఒలింపిక్స్‌లో బంగార పతకాన్ని గెలుచుకోవడం ద్వారా మరోసారి మెరిశారు. అంతకుముందు కామన్‌వెల్త్ గేమ్స్‌లో సాక్షి మాలిక్ రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు.

 
వినేశ్ ఫోగట్
రెజ్లింగ్‌లో రెండు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు గెలుచుకున్న తొలి భారతీయ మహిళ వినేశ్ ఫోగట్. కామన్‌వెల్త్, ఏషియన్ గేమ్స్‌ రెండింట్లో బంగారు పతకాన్ని పొందిన తొలి భారతీయ రెజ్లర్‌ కూడా ఈమెనే. వినేశ్ కామన్‌వెల్త్ గేమ్స్‌తో తన పేరుపై వరుసగా మూడు బంగారు పతకాలను పొందారు. ఈ మెడల్స్ భిన్నమైన వెయిట్ కేటగిరీల్లో వచ్చాయి. తాజాగా 53 కేజీల బరువు విభాగంలో 2022 ఆగస్టులో కూడా కామన్‌వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. వినేశ్ ఫోగట్ మహిళా రెజ్లర్ల కుటుంబం నుంచే వచ్చారు. ఆమె కజిన్లు గీతా, బబితా ఫోగట్‌లు కూడా పలు అంతర్జాతీయ పతకాలను సాధించారు.