రఘురామ్ రాజన్: ‘‘రాహుల్ గాంధీ పప్పు కాదు, తెలివైనవారు’’
రాహుల్ గాంధీ ఒక తెలివైన వ్యక్తి, పప్పు కాదు అని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ప్రజల్లో రాహుల్ గాంధీకి ఉన్న ఇమేజ్ గురించి ప్రశ్నించగా ఆయన పైవిధంగా బదులిచ్చారు. దావోస్‌లో జరుగుతోన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు సందర్భంగా ఒక న్యూస్ చానెల్‌తో మాట్లాడుతూ రాహుల్ గాంధీకి పప్పు అనే ఇమేజ్ రావడం దురదృష్టకరం అని అన్నారు.
పప్పు అనే ముద్ర వేయడం దురదృష్టకరం. దశాబ్దాలుగా నేను ఆయనతో ఎన్నో విషయాలు చర్చించాను. ఆయన పప్పు ఏమాత్రం కాదు. అతనో తెలివైన, జిజ్ఞాస ఉన్న వ్యక్తి అని ఇండియా టుడే చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లో గత నెలలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో రఘురామ్ రాజన్ పాల్గొన్నారు. ఈ యాత్ర సిద్ధాంతాలపై తనకు నమ్మకం ఉందని, అందుకే యాత్రలో భాగమయ్యానని ఆయన అన్నారు.