ఆదివారం, 26 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated: గురువారం, 19 జనవరి 2023 (12:42 IST)

రాహుల్ గాంధీ పప్పు కాదు.. స్మార్ట్‌మేన్.. రఘురాం రాజన్ ప్రశంసలు

rahul - raghuram
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్ పప్పు కాదని, ఆయన ఓ స్మార్ట్ బాయ్ అని చెప్పారు. రాహుల్ స్మార్ట్, యంగ్, క్యూరియస్‌మేన్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అదేసమయంలో తన రాజకీయ ప్రవేశంపై రఘురాం రాజన్ స్పష్టతనిచ్చారు.
 
గత నెలలలో రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో రఘురాం రాజన్ పాల్గొన్నారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్ దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇండియా టుడేతో మాట్లాడుతూ, రాహుల్‌కు పప్పు అనే ఇమేజ్ రావడం చాలా దురదృష్టకరమని అన్నారు. తాను దశాబ్దకాలం పాటు రాహుల్‌‍తో సన్నిహితంగా ఉన్నానని, రాహుల్ పప్పు కాదని, ఆయన స్మార్ట్, యంగ్, క్యూరియస్ మేన్ అని తెలిపారు. 
 
అదేసమయంలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై తన స్పందనను తెలియజేశారు. మన్మోహన్ సింగ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా తాను విమర్శించానని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఇపుడు కూడా మోడీ సర్కారు అవలంభిస్తున్న తప్పుడు విధానాలు దేశ ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటూ విమర్శలు గుప్పించారు. అయితే, తాను రాజకీయాల్లోకి రానున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన తోసిపుచ్చారు. భారత్ జోడో యాత్ర విలువల కోసమే తాను రాహుల్‌తో కలిసి పాదం కలిపానేగానీ పార్టీలో చేరడానికి కాదని చెప్పారు.