శనివారం, 2 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 21 జనవరి 2023 (23:47 IST)

ఆర్‌ఆర్‌ఆర్: అమెరికా సహా అనేక దేశాల ప్రేక్షకులు ఈ సినిమాకు ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు?

Ram Charan
ఆర్‌ఆర్‌ఆర్ సినిమా థియేటర్లలోకి వచ్చి 10 నెలలు గడిచాయి. కానీ, ఆ సినిమాకు సంబంధించిన చర్చలు మాత్రం ఇంకా తగ్గుముఖం పట్టలేదు. పైగా హాలీవుడ్ అవార్డుల వరకు ఈ సినిమా క్రేజ్ వ్యాపించింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఈ సినిమా ఎలా ఆకట్టుకుందనే విషయాన్ని బీబీసీ ప్రతినిధి మెరిల్ సెబాస్టియన్ వివరించారు. దేశంలో పాటు విదేశాల్లో నివసించే భారతీయుల కోసమే ప్రధానంగా ఈ సినిమాను తీసినట్లు డైరెక్టర్ ఎస్‌.ఎస్. రాజమౌళి చెప్పారు.
 
కానీ, విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా అన్ని సరిహద్దులను చెరిపేసింది. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడుతోన్న ఇద్దరు నిజ జీవిత ఉద్యమకారుల కల్పిత కథను ఈ సినిమాలో చూపించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1200 కోట్ల రూపాయలకు పైగా ఆర్జించింది. అమెరికాలో నెట్‌ఫ్లిక్స్‌లో వారాల పాటు టాప్-10 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు జపాన్‌లో బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొడుతోంది.
 
2022 ఉత్తమ చిత్రాలతో కూడిన పలు ప్రతిష్టాత్మక జాబితాల్లో కూడా ఈ సినిమా చోటు దక్కించుకుంది. బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్, నేషనల్ బోర్డ్‌ ఆఫ్ రివ్యూ (అమెరికా) జాబితాల్లో ఈ సినిమా చేరింది. ఈ సినిమాలోని ‘నాటునాటు’ పాటకు ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డ్’ లభించింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ అవార్డు వరించింది. లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన క్రిటిక్స్ చాయిస్ అవార్డుల్లో ‘నాటునాటు’ పాటతో పాటు ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా సైతం అవార్డులను గెలుచుకుంది. బీబీసీ కల్చర్ ఫిల్మ్ విమర్శకులు నికోలస్ బార్బర్, కరిన్ జేమ్స్ ఈ ఏడాది టాప్-20 సినిమాల జాబితాలో ఈ సినిమాను కూడా చేర్చారు.
 
ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించినందుకు రాజమౌళి పొందుతున్న సంతోషం, ఆశ్చర్యం చాలా ఇంటర్వ్యూల్లో ఆయన ముఖంలో కనిపించింది. ‘‘పాశ్చాత్యుల నుంచి ఈ సినిమాకు ప్రశంసలు రావడం మొదలైనప్పడు, ఈ సినిమాను పొగిడేవారంతా కచ్చితంగా అక్కడి భారతీయుల స్నేహితులై ఉంటారని మేం అనుకున్నాం’’ అని అమెరికా టాక్ షో ‘లేట్ నైట్ విత్ సేత్ మేయర్స్’లో రాజమౌళి నవ్వుతూ అన్నారు. అమెరికాలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదలైనప్పుడు ఇతర ప్రధాన భారతీయ సినిమాలకు దక్కినట్లే దీనికి కూడా ఆదరణ దక్కిందని న్యూయార్క్‌కు చెందిన సినీ విమర్శకుడు సిద్ధాంత్ అడ్లాఖా చెప్పారు.  
 
డిసెంబర్‌లో న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ రాజమౌళిని ఉత్తమ దర్శకుడిగా ఎంపిక చేసింది. ఈ సర్కిల్‌లో సిద్ధాంత్ ఒక సభ్యుడు. ‘‘సినిమా విడుదలయ్యాక వచ్చిన తొలి వారాంతంలో ఎక్కువ మంది భారతీయులే ఈ సినిమాను చూశారు. కానీ, కొన్ని వారాలు గడిచాక సినిమాకు వచ్చే వీక్షకులు పూర్తిగా మారిపోయారు’’ అని సిద్ధాంత్ వెల్లడించారు. థియేటర్లకు జనాలు పోటెత్తడంతో ఈ సినిమా గురించి బాగా ప్రచారం జరిగింది. సినీ విమర్శకులు దీనిపై సమీక్షలు రాశారు.
 
హాలీవుడ్‌లో ఏ లిస్ట్ డైరెక్టర్లుగా పేరున్న ఆంథోని, జో రూసో, ఎడ్జర్ రైట్, స్కాట్ డెరిక్సన్, జేమ్స్ గన్‌లు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసిన తర్వాత ఈ సినిమాను తమ థియేటర్లలో కూడా ప్రదర్శించామని అమెరికా డిస్ట్రిబ్యూటర్లు చెప్పారు. ‘‘ఈ మధ్య కాలంలో నాకు గుర్తున్నంత వరకు ఈ సినిమాకు వచ్చిన స్పందన చాలా భిన్నమైనది’’ అని సిద్ధాంత్ తెలిపారు. సినిమా చూస్తూ థియేటర్లలో ప్రేక్షకులు డ్యాన్స్ చేయడం, అరిచి గోల పెట్టడం లాంటి వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
 
ఇలా థియేటర్లలో అభిమానులు సందడి చేయడం భారత్‌లో సాధారణ విషయమే కానీ, అమెరికాలో చాలా అరుదైన దృశ్యం. లాస్ ఏంజిల్స్‌లోని ఐకానిక్ చైనీస్ థియేటర్‌లో డైరెక్టర్ జె.జె అబ్రామ్స్ ప్రదర్శించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా స్క్రీనింగ్‌లో అభిమానులు నాటునాటు పాటకు వేదికపైకి వెళ్లి డ్యాన్స్ చేయడం కనిపించింది.
‘‘ఆర్‌ఆర్‌ఆర్ సినిమా వల్ల ఇక్కడి ప్రేక్షకులకు, ఇంకా చెప్పాలంటే సినిమా నిర్మాతలకు ఒక కొత్తరకమైన అనుభవం ఎదురైంది. థియేటర్లలో ప్రేక్షకులు డ్యాన్స్ చేస్తూ సినిమా చూడటం ఇక్కడ అసలు జరగదు. ఆర్‌ఆర్‌ఆర్ వల్ల ఆ ఆచారం ఇక్కడి థియేటర్లలో కనిపించింది. ఇది హాలీవుడ్ సినీ నిర్మాతల దృష్టిని కూడా ఆకర్షించింది’’ అని సిద్ధాంత్ చెప్పారు.
 
సినిమాలోని కథాంశం, సినిమాను తీసిన తీరు, సినిమా వచ్చిన సమయం ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది. ఆర్‌ఆర్‌ఆర్‌ను వెనక్కి నెట్టి భారత్ నుంచి గుజరాతీ సినిమా ఛెల్లో షో, ఆస్కార్ అవార్డుల ఎంట్రీని దక్కించుకుంది. హాలీవుడ్ డైరెక్టర్లతో పాటు నటులు ఈ సినిమాను అద్భుతం అని పొగడటంతో పాటు దీని చుట్టూ ఏర్పడిన హైప్ కారణంగా ఆర్‌ఆర్‌ఆర్ కచ్చితంగా ఆస్కార్ నామినేషన్లలో ఉంటుందని అంచనా వేశారు. ట్రేడ్ మ్యాగజీన్ ‘వెరైటీ’, ఈ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీల్లో నామినేట్ అవుతుందని అంచనా వేసింది.
NTR
‘‘ఇండస్ట్రీలో ఒక సినిమాకు బజ్ రావడం చాలా పెద్ద విషయం. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా అందరి చర్చల్లో భాగమైంది. ఇప్పుడు ప్రతీ ఒక్కరూ వారాంతంలో లేదా పార్టీల్లో ‘మీరు ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చూశారా?’ అని మాట్లాడుకుంటున్నారు’’ అని టీవీ హోస్ట్ లూయి చెప్పారు. ఇటీవలి సంవత్సరాల్లో పశ్చిమ దేశాల్లో మార్వెల్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజీలు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నందున ఈ సినిమా వారికి చాలా కొత్తగా, ఉత్సాహంగా అనిపించింది. అద్భుతమైన దృశ్యాలు, ఆసక్తి రేకెత్తించే కథనంతో రాజమౌళి సినిమా శైలి ఇక్కడి ప్రేక్షకులకు సరికొత్త సినిమా అనుభూతిని అందిస్తుందని సిద్ధాంత్ అన్నారు.
 
ఈ సినిమాలో తొలిసారి ఇద్దరు హీరోలు కలుసుకునే సన్నివేశం, బ్రిడ్జ్‌పై ఒక చిన్నారిని మంటల్లో నుంచి రక్షించే సన్నివేశాలు ఇక్కడి అభిమానులు కొత్తగా అనిపిస్తాయని ఆయన చెప్పారు. ఈ సినిమా అన్ని సాంస్కృతిక నేపథ్యాల నుంచి వచ్చిన అభిమానులను అలరించిందని అన్నారు. భారత్ బయట నివసించే అభిమానులు బాలీవుడ్, టాలీవుడ్ నుంచి ఎలాంటి సినిమాలను ఆశిస్తారో వారి అంచనాలకు అనుగుణంగా ఈ సినిమా ఉందని లూయి చెప్పారు. భారత్‌లో ఆర్‌ఆర్‌ఆర్ విజయం సాధించడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. ఎందుకంటే భారత్‌లో దాదాపు అందరికీ రాజమౌళి పేరు సుపరిచితమే. బహుబలి సినిమా కారణంగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై అందరికీ బాగా అంచనాలు పెరిగిపోయాయి.
 
కానీ, ఈ సినిమా సాధారణంగా ఉందంటూ పలువురు విమర్శకులు సమీక్షలు రాశారు. సినిమాలోని రాజకీయాలు, హిందూ ఐకానోగ్రఫీని ఉపయోగించడం, గిరిజన సంస్కృతిని ఉపయోగించడాన్ని వారు ఎత్తి చూపారు. భారత్‌లో ఒక మాధ్యమంగా సినిమా చాలా రాజకీయ రూపం దాల్చిందని రచయిత, సినీ విమర్శకురాలు సౌమ్యా రాజేంద్రన్ అన్నారు. గిరిజన హక్కుల కోసం, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఇద్దరు నిజ జీవిత ఉద్యమకారులను హిందూ పౌరాణిక పాత్రలుగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో చూపించడం విమర్శకుల దృష్టిలో పడిందని ఆమె చెప్పారు. కానీ, పాశ్చాత్య ప్రేక్షకులు, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను వలసవాద వ్యతిరేక కథనంగా చూస్తారని ఆమె అన్నారు.
 
అమెరికాలో చాలామంది ఈ విషయాన్ని స్పృశించే ప్రయత్నం చేశారని చెప్పారు. ఇలా ఈ సినిమా గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. అదేంటంటే రాజమౌళి, ఆయన చిత్ర బృందం కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచ సినిమా ఇండస్ట్రీలోని అడ్డంకులను అధిగమించారు. ఇది ప్రారంభం మాత్రమే కావొచ్చు. రాజమౌళి తర్వాత లక్ష్యం హాలీవుడ్ సినిమాను నిర్మించడం. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ సినీ నిర్మాత కల హాలీవుడ్‌లో సినిమా తీయడం అని ఆయన చెబుతుంటారు.