మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (18:39 IST)

విప్రో: ఐటీ కంపెనీలో కొత్త ఉద్యోగులకు వేతన కోత

Cash
భారత్‌లోని టాప్ టెక్ సంస్థలో కొత్తగా ఉద్యోగం వచ్చినట్లు ఈమెయిల్ పొందిన సరితా ఆ ఆఫర్ లెటర్ చూసి షాకయ్యారు. ఎందుకంటే, అంతకుముందు ఆఫర్ చేసిన మొత్తం కంటే 50 శాతం తక్కువగా తనకి వార్షిక వేతన ప్యాకేజీని విప్రో రివైజ్ చేసింది. దీంతో ఆమె వేతనం ఏడాదికి రూ.6,50,000 నుంచి రూ.3,50,000కి తగ్గిపోయింది. ఈ నిర్ణయం సమయానుకూలంగా ఉన్నందున ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగలరని ఆమెకు ఈ టెక్ సంస్థ ఈమెయిల్‌లో తెలిపింది.
 
తనలాంటి చాలా మంది కొత్త ఉద్యోగులకు ఐటీ దిగ్గజం విప్రో గత వారం ఇదే మాదిరి ఈమెయిల్ పంపినట్టు తనకు తెలిసింది. తొలుత ఆఫర్ చేసిన వేతనాన్ని రివైజ్ చేసి, తగ్గింపు వేతనంతో సంస్థలో చేరాలని అభ్యర్థులకు పిలుపునిచ్చింది. రివైజ్డ్ ఆఫర్ లెటర్ వల్ల విప్రోలో చేరేందుకు సుమారు 4 వేల మంది కొత్త ఉద్యోగులు ఆలోచనలో పడినట్టు ఐటీ ఉద్యోగుల సంఘం నాస్నెంట్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్(ఎన్ఐటీఈఎస్) తెలిపింది. ‘‘టెక్నాలజీ రంగంలో వస్తోన్న మార్పుల దృష్ట్యా మా ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రణాళికలను సవరించాల్సి వచ్చింది. ప్రస్తుత ఆఫర్ అభ్యర్థులు వెంటనే వారి కెరీర్‌ను ప్రారంభించడానికి అవకాశంగా ఉంది. విద్యార్థులు వారి నిపుణతను పెంచుకుని, కొత్త నైపుణ్యాలను పొందాలి’’ అని విప్రో తన ప్రకటనలో సూచించింది.
 
ఇండస్ట్రీలో ఇతర కంపెనీల మాదిరి తాము కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను పరిగణనలోకి తీసుకుని, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా నియామకాలను చేపడుతున్నట్టు అభ్యర్థులకు పంపిన ఈమెయిల్‌లో విప్రో తెలిపింది. ఫిబ్రవరి 20 నాటికి రివైజ్ చేసిన ఆఫర్‌ను అంగీకరిస్తున్నట్టు సర్వే ఫామ్‌ను నింపాలని అభ్యర్థులను కోరింది. ఒకవేళ అంగీకరిస్తే, ముందు ఆఫర్లన్ని కూడా నిలిచిపోతాయని పేర్కొంది. అయితే, ఈ విషయంలో గ్రాడ్యుయేట్లకు సాయం చేసేలా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఎన్ఐటీఈఎస్ ప్రెసిడెంట్ సింగ్ సలూజ కోరారు.