శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 18 మార్చి 2022 (20:03 IST)

'ఇక్కడ బతకడం కన్నా యుక్రెయిన్‌లో యుద్ధం చేయడం బెటర్'

గత నెలలో యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలు పెట్టినప్పుడు నైజీరియాకు చెందిన 27 ఏళ్ల ఒట్టా అబ్రహం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గబగబా ఫోన్ తీసుకుని "నేను యుక్రెయిన్ సైన్యంలో చేరాలనుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశారు. యుక్రెయిన్, నైజీరియా తూర్పు-పడమరలాంటివి. నైజీరియా నుంచి యుక్రెయిన్ సుమారు 8,700 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ దేశంలోని లాగోస్‌ నగరంలో నివసించే ఒట్టా, యుద్ధక్షేత్రంలో దిగడానికి సిద్ధంగా ఉన్నారు.

 
ఫిలాసఫీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఒట్టా. అయితే, యుద్ధానికి సిద్ధపడింది ఆయనొక్కరే కాదు. నైజీరియా, కెన్యా, సెనెగల్, దక్షిణాఫ్రికా, అల్జీరియా వంటి దేశాల నుండి వందల మంది ఒట్టావాలాంటి యువకులు రష్యాపై యుద్ధానికి రెడీ అంటున్నారు. తమ దేశంలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి తాత్కాలికంగా బైటపడటానికి వారు ఆయుధాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ''ఇది పిల్లల ఆట కాదు, యుద్ధం అని మాకు తెలుసు. కానీ ఇక్కడ ఉండటంకంటే యుక్రెయిన్‌లో సైనికుడిగా ఉండటం మంచిది’’ అని ఒట్టావా బీబీసీతో అన్నారు.

 
‘‘యుద్ధం ముగిసిపోతే బహుశ నన్ను అక్కడే ఉండటానికి అనుమతి కూడా ఇస్తారేమో. అక్కడ నేను హీరోగా ఉంటూ శత్రువుతో పోరాడతాను" అన్నారాయన. యుక్రెయిన్‌ ను కాపాడుకోవడం కోసం "యుక్రెయిన్లతో భుజం భుజం కలిపి నిలబడాలని" విదేశీయులకు యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్క్సీ విజ్ఞప్తి చేసిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20,000 మంది వలంటీర్లు చేరారు.

 
వారి కోసం యుక్రెయిన్ ప్రభుత్వం వీసా నిబంధనలను తాత్కలికంగా సడలించింది. సైనిక శిక్షణ తీసుకుని ఉండి, చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ ఉన్నవారికి ఆయుధాలతో పాటు జీతం కూడా అందించింది. కానీ యుద్ధం ముగిసిన తర్వాత విదేశీ యోధులు దేశంలో ఉండేందుకు అనుమతిస్తారని అధికారికంగా నిర్ధారణ కాలేదు. తాను డబ్బు కోసమో, పౌరసత్వం కోసమో వలంటీర్‌గా మారడం లేదని నైజీరియా రాజధాని అబుజాలో నివసిస్తున్న కెరెటి ఉసురో అన్నారు.

 
"నేను సుఖంగా ఉన్నాను. ఒకవేళ యూరప్‌కు వెళ్లాలనుకుంటే చదువుల ద్వారా వెళ్తా కానీ, యుద్ధం ద్వారా కాదు" అని న్యాయవాది అయిన ఉసురో అన్నారు. యుక్రెయిన్ అధ్యక్షుడు, దౌత్యవేత్తల విజ్ఞప్తి తర్వాత, వలంటీర్లుగా మారాలనుకున్న ఎంతోమంది యువకులు అబుజాలోని యుక్రెయిన్ రాయబార కార్యలయానికి వెళ్లి తాము యుక్రెయిన్ వెళ్లడానికి సిద్ధమని చెప్పారు.

 
కిరాయి సైనికులకు అనుమతి లేదు
అయితే, ఆఫ్రికా ఖండంలోని ఇతర దేశాల మాదిరిగానే నైజీరియా ప్రభుత్వం కూడా తమ దేశ పౌరులు యుక్రెయిన్‌లో పోరాడటానికి అనుమతి ఇవ్వరాదని నిర్ణయించింది. ఇదే విషయం చెప్పడంతో వారంతా వెనక్కి వెళ్లిపోయారు. ''నైజీరియా ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడైనా కిరాయి సైనికులను ఉపయోగించడాన్ని ప్రోత్సహించదు. రిక్రూట్‌మెంట్ చేసుకోవడాన్ని సమర్ధించదు'' అని నైజీరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కోంది.

 
మరోవైపు, మా దేశంలో పోరాడటానికి వచ్చే ఆఫ్రికన్లకు తాము విమాన ఖర్చులు చెల్లిచబోవడం లేదని, యూరప్ రావాలనుకున్న వారు తమ సొంత ఖర్చుల మీద రావాల్సి ఉంటుందని నైజీరియాలోని యుక్రెయిన్ రాయబార కార్యాలయ అధికారి బోహ్డాన్ సోల్టీస్ అన్నారు. అదేవిధంగా ''విదేశీ వలంటీర్లకు, కిరాయి సైనికులకు మధ్య స్పష్టమైన తేడా ఉంది’’ అని బోహ్డాన్ బీబీసీతో అన్నారు. ఎంబసీ వద్దకు వచ్చే వలంటీర్లను వెనక్కి పంపాలని ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.

 
దేశ పౌరులు యుద్ధంలో చేరకూడదంటూ సెనెగల్ ప్రభుత్వం కూడా హెచ్చరించిది. దానితో పాటు ‘‘సెనెగల్ పౌరులూ... వలంటీర్లుగా చేరండి’’ అంటూ యుక్రెయిన్ ప్రభుత్వం ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టును తొలగించాలంటూ యుక్రెయిన్ రాయబారులను సెనెగల్ ఆదేశించింది. రిక్రూమెంట్ ప్రయత్నం చట్టం విరుద్ధమని, శిక్షార్హమని పేర్కొంది. ఇదే విధమైన ఉతర్వులను అల్జీరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా జారీ చేసింది.

 
''అక్కడికి వెళ్లడానికి నా దేశం అనుమతి ఇవ్వడం లేదు. అయితే విదేశాంగ మంత్రిత్వ శాఖకు లేఖ రాశాను. వారు ఎలాంటి జవాబు ఇవ్వలేదు. కానీ నేను మళ్ళీ ప్రయత్నిస్తాను'' అని అల్జీరియాకు చెందిన 28 ఏళ్ల బెల్హడ్జ్‌ హని అమీర్ బీబీసీ తో అన్నారు. ''నేను యుక్రెయిన్ వెళ్లాలనుకుంటున్నాను, కానీ ఈ యుద్ధం వీలైనంత త్వరగా ముగుస్తుందని నేను ఆశిస్తున్నాను" అని అన్నారాయన. ‘‘మానవతా దృక్పథంతో వందల మంది యుక్రెయిన్‌లో స్వచ్ఛందంగా పని చేసేందుకు ముందుకొచ్చారు. కానీ వారి అభ్యర్ధనలపై స్పందించలేకపోయాను. ప్రభుత్వాల సూచనల కోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే దక్షిణాఫ్రికాలో కిరాయి సైనికులను నిషేధించే కఠినమైన చట్టం ఉంది’’ అని దక్షిణాఫ్రికా, మొజాంబిక్, బోట్స్‌వానా దేశాలకు యుక్రెయిన్ రాయబారిగా పని చేస్తున్న లియుబోవ్ అబ్రవిటోవా బీబీసీతో అన్నారు.

 
అంతర్జాతీయ వలంటీర్లను చేర్చుకోవడం కోసం యుక్రెయిన్ అధికారిక వెబ్‌సైట్ ఉంది. కానీ అది ఆఫ్రికన్ దేశాల ప్రజలను చేర్చుకోలేదు. " చట్టపరమైన నిబంధనల కారణంగా కొన్ని ఆఫ్రికన్ దేశాలను సైట్ నుంచి తొలగించాం’’ అని వెబ్‌సైట్ కోసం పనిచేస్తున్న ఒక ప్రతినిధి ధృవీకరించారు.

 
'రష్యన్ సోదరులు'
ఆఫ్రికా ఖండంలోని 54 దేశాలలో అల్జీరియా, సెనెగల్, దక్షిణాఫ్రికాతో సహ 17 దేశాలు యుక్రెయిన్‌పై రష్యా చేస్తున్నా దాడిని ఖండించడానికి ఐక్యరాజ్యసమితిలో నిర్వహించిన ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఎందుకంటే రష్యా ఆగ్రహానికి గురి కావాలని వారు కోరుకోవడం లేదు. అలాగని రష్యాకు ఆఫ్రికాలో మద్ధతు లేదని కూడా కాదు. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (సీఏఆర్), లిబియా, మాలి, సూడాన్, వంటి దేశాలు తిరుగుబాటుదారులతో, ఇస్లామిస్ట్ మిలిటెంట్లతో పోరాటంలో రష్యా నుంచి సాయం పొందాయి. ఆఫ్రికా ఖండంలో రష్యా తన ప్రభావాన్ని, ముఖ్యంగా సైనికపరంగా ప్రభావాన్ని విస్తరించుకుని ఉంది.

 
అంతే కాదు, సీఏఆర్ దేశాల సైనికులు "రష్యన్ సోదరులతో" చేరతామని ప్రమాణం చేసినట్లు ఒక వీడియో ఆన్‌లైన్‌లో ప్రచారంలో ఉంది. అయితే, దీని మూలాలను బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేకపోయింది. ఒక ప్రభుత్వాధికారిని సంప్రదించినా వారు స్పందించ లేదు. ‘‘మధ్యప్రాచ్యం నుండి 16,000 మందికి పైగా సైనికులు రష్యన్ సైన్యంతో కలిసి పోరాడటానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు’’ అని గత శుక్రవారం, రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు వెల్లడించారు. అయితే ఇందులో ఉత్తర ఆఫ్రికా నుండి ఎవరైనా ఉన్నారా అనేది స్పష్టంగా తెలియరాలేదు.

 
ఆఫ్రికన్ దేశాలు వారి దేశ పౌరులను సైనికులుగా నియమించుకోవడాన్ని ఒప్పుకోకున్నా, ఇంకా ఎవరైనా యువకులు ముందుకు వస్తారా అనేది అస్పష్టంగా ఉంది. అయితే వలంటీర్లుగా ఆఫ్రికన్లు ఎవరూ రాలేదని విదేశీ వలంటీర్ల నియామాకలను నమోదు చేసే యుక్రెయిన్ అధికారి బీబీసీతో అన్నారు.

 
నిరాశ కలిగించింది...
అయితే, ఆఫ్రికన్ దేశాలు తమ దేశ పౌరులను యుక్రెయిన్ పంపడానికి సిద్ధంగా లేకపోవడం పట్ల చాలామంది యువతీ యువకులు నిరాశ చెందుతున్నారు. నైజీరియా నైరుతి ప్రాంతం లోని ఓయో రాష్ట్రానికి చెందిన డేవిడ్ ఒసాగీ అడెలెకే అలాంటి వారిలో ఒకరు. రెడ్‌క్రాస్‌లో రెస్క్యూ వర్కర్‌గా పనిచేసిన ఈ 21 ఏళ్ల యువకుడు, పోరాట యోధుడిగా చేరడానికి సిఫార్సు లేఖతో సహా అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సేకరించుకుంటున్నారు.
 
అతి ముఖ్యమైన క్లీన్ క్రిమినల్ రికార్డ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు, అక్కడి దౌత్యకార్యలయ అధికారి ఇప్పుడు ఆఫ్రికన్లను పంపించడానికి చట్టాలు ఒప్పుకోవడం లేదని చెప్పడంతో తీవ్ర నిరాశకు గురైనట్లు వెల్లడించారు. యుక్రెయిన్ రాయబార కార్యాలయం ఆయన మెయిల్‌ను తిరస్కరించడంతో దేశ సరిహద్దులకు చేరుకోవడానకి ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తున్నారాయన. ‘‘ ప్రస్తుతం నాకు నైజీరియాలోని పోలండ్ రాయబార కార్యలయం నుండి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది’’ అని అన్నారు.

 
అబుజాలోని యుక్రెయిన్ రాయబార కార్యాలయంలో వేచి చూస్తున్న ప్రిన్స్ ఎన్‌కెమ్ ఎండుచేకు యుక్రెయిన్ పరిస్థితుల గురించి అక్కడ ఉన్నవారందరికన్నా ఎక్కువ అవగహన ఉంది. ఆయన కొంత కాలం రష్యాలో గడిపారు. ద్వంద పౌరసత్వం ఉన్న ఆయన, రష్యా మిలిటరీ అకాడమీలో కూడా పేరు నమోదు చేసుకున్నారు. అయితే, ఒకసారి ఆయన అమెరికన్ రాయబార కార్యాలయంలో కనిపించడంతో గూఢచారి గా అనుమానించి కొద్దికాలం జైలులో ఉంచారు.

 
‘‘ఏడేళ్ల కిందట నేను రష్యా నుంచి యుక్రెయిన్ గుండా పారిపోయి వచ్చా. ఇప్పుడు యుక్రెయిన్ తరఫున రష్యాతో సంతోషంగా పోరాడతా’’ అని ఆయన అన్నారు. ''నేను నా సొంతంగానే వెళ్లాలనుకుంటున్నాను. కానీ నైజీరియా ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు కాబట్టి వెళ్లలేను. చట్టానికి కట్టుబడి ఉంటా" అని ఆయన బీబీసీతో అన్నారు.