సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 4 ఆగస్టు 2022 (16:44 IST)

Cheetah: ఇండియాలో 50 ఏళ్ల కిందట అంతరించిపోయిన మృగం మళ్లీ ఇప్పుడు అడుగుపెడుతోంది

Cheetha
ఎట్టకేలకు వచ్చే వారం కొన్ని చీతాలు భారత్‌లో అడుగుపెట్టబోతున్నాయి. ఆఫ్రికా నుంచి చాలా దూరం ప్రయాణించి ఇక్కడి సువిశాల నేషనల్ పార్క్‌కు ఇవి చేరుకోబోతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకెళ్లే జంతువులుగా పేరుగాంచిన చీతాలు భారత్‌లో అంతరించిపోయి దాదాపు ఐదు దశాబ్దాలు గడుస్తున్నాయి. ఒక పెద్ద మాంసాహార జంతువును ఒక ఖండం నుంచి మరో ఖండానికి తరలించి అడవిలో వదిలిపెట్టడం ఇదే తొలిసారి. ‘‘మేం చాలా ఉత్సాహంగా ఉన్నా. అదే సమయంలో చాలా సవాళ్లు కూడా ఉన్నాయి. భారత్‌లో అంతరించిపోయిన జంతువులను మళ్లీ పరిరక్షించాలనే ప్రయత్నంలో ఇది భారీ ముందడుగు’’ అని వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా డీన్ యాదవేంద్రదేవ్ ఝాలా చెప్పారు. చీతాలను ఇక్కడికి తీసుకొచ్చేందుకు పనిచేస్తున్న నిపుణుల్లో ఆయన కూడా ఒకరు.

 
ఎక్కడి నుంచి వస్తున్నాయి?
ప్రస్తుతం దక్షిణాఫ్రికా, నమీబియాల నుంచి 16 చీతాలను తీసుకొస్తున్నారు. ప్రపంచంలోని 7,000 చీతాల్లో మూడింట ఒక వంతు నమీబియాలోనే ఉన్నాయి. మరోవైపు నమీబియా, దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా.. మొత్తం చీతాల్లోని సగం ఈ మూడు దేశాల్లోనే ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో అనేక ప్రాంతాలలో చీతాలు కనిపిస్తాయి. ప్రభుత్వ సంరక్షణలోలేని అటవీ ప్రాంతాల్లోనూ కొన్ని చీతాలు ఉన్నాయి. అయితే, వీటి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. మరోవైపు పెద్ద పెద్ద నేషనల్ పార్కులలో వీటి సంఖ్య స్థిరంగా ఉంది. మరికొన్ని చీతాలు చిన్నచిన్న సంరక్షణ కేంద్రాల్లోనూ కనిపిస్తాయి. అయితే, వీటిలో చాలావరకు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. భారత్‌కు తీసుకొస్తున్న చీతాల్లో చాలావరకు ప్రభుత్వ సంరక్షణ కేంద్రాల్లో గడుపుతున్నవే ఉన్నాయి. వీటిని చాలా జాగ్రత్తగా అధికారులు చూసుకుంటున్నారు. దక్షిణాఫ్రికాలో 50కి పైగా కనిపించే నేషనల్ పార్కుల్లో మొత్తంగా 500 చీతాలు ఉన్నాయి.

 
హెలికాప్టర్ల నుంచి మత్తుమందు
వీటిని పట్టుకునేందుకు హెలికాప్టర్ల నుంచి ట్రాంక్విలైజర్స్‌ను పశువైద్య నిపుణులు ప్రయోగించారు. ‘‘కొన్ని చీతాలు మరీ వైల్డ్‌గా ఉన్నాయి’’ అని వాటిని భారత్‌కు తీసుకొచ్చే మిషన్‌లో పాలుపంచుకుంటున్న దక్షిణాఫ్రికా పశువైద్య నిపుణుడు మ్యూసెస్ విన్సెంట్ వాన్ డెర్ మెర్వే చెప్పారు. బంధించిన తర్వాత వీటికి మైక్రోచిప్‌లు అమర్చారు. ఆ తర్వాత ఇన్ఫెక్షన్లు రాకుండా యాంటీబయోటిక్స్ ఇంజెక్షన్లు ఇచ్చారు. ఆ తర్వాత శరీరంలో నీటి శాతాన్ని పెంచేందుకు ఐవీలను ఎక్కించారు. ఆ తర్వాత డీఎన్ఏ విశ్లేషణ కోసం వీటి రక్త నమూనా తీసుకున్నారు. చివరగా బోనుల్లో పెట్టి క్వారంటైన్ కేంద్రాలకు తీసుకెళ్లారు. ఈ చీతాలలో ఆరు ఆడవి. పిల్లలను కనే వయసులో ఉన్న చీతాలనే ప్రస్తుతం ఎంపిక చేశారు. ‘‘ఇవన్నీ ఎప్పుడో తల్లి నుంచి వేరుపడ్డాయి. ఇవి సొంతంగా తమకు తాముగానే మనుగడ సాగించగలవు’’ అని మెర్వే చెప్పారు.

 
ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి?
దక్షిణాఫ్రికా నుంచి తీసుకొస్తున్న చీతాలు ప్రస్తుతం రూయిబర్గ్, ఫిండాలలోని రెండు క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచారు. మరో నాలుగు నమీబియాలో ఉన్నాయి. వ్యాధులు ఏమైనా ఉన్నాయోలేదో తెలుసుకునేందుకు వీటిని పరీక్షలు నిర్వహించారు. మరోవైపు రేబిస్, బ్లడ్ పారాసైట్స్, హెర్పిస్ సహా ఆరు టీకాలను వీటికి ఇచ్చారు. ‘‘క్వారంటైన్ కేంద్రాల్లోని వీటిని జాగ్రత్తగా గమనిస్తున్నాం. ఎలాంటి వ్యాధులు సోకకుండా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం’’అని మెర్వే చెప్పారు.

 
సవాళ్లు ఏమిటి?
అడవుల్లో జీవించే చీతాలను తరలించడం చాలా కష్టమని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బోనుల్లో పెట్టడం, మనుషులను దగ్గరగా చూడటంతో అవి తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయని అంటున్నారు. మరోవైపు భారత్‌కు రాబోయే చీతాలు జోహన్నెస్‌బర్గ్ నుంచి దిల్లీ వరకు రవాణా విమానంలో సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రోడ్డు మార్గం లేదా హెలికాప్టర్లలో వీటిని మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌కు తరలిస్తారు. అక్కడే ఇకపై అవి జీవించబోతున్నాయి.

 
విమానంలో తరలించే రోజు ఈ చీతాలకు ట్రాంక్విలైజర్ల సాయంతో కాస్త మత్తు ఎక్కిస్తారు. ఆ తర్వాత ఇనుము బోనులో పెడతారు. వీటితోపాటు పశువైద్య నిపుణులు కూడా ఆ విమానంలో ప్రయాణిస్తారు. ఒకసారి బోనులో పెట్టిన వెంటనే మత్తు విరుగుడు ఔషధం ఇస్తారు. అయినప్పటికీ ప్రయాణంలో వాటికి కాస్త మత్తు ఉంటుంది. ‘‘ఇలా చేస్తే వాటిని తేలిగ్గానే ఒక ప్రాంతం నుంచి మరొక చోటుకు తీసుకెళ్లొచ్చు’’అని ప్రెటోరియా యూనివర్సిటీకి చెందిన వైల్డ్ లైఫ్ ప్రొఫెసర్ ఆండ్రియన్ టార్డిఫ్ చెప్పారు. గతంలోనూ ఇలానే చీతాలను చాలా దూరాలకు తరలించారు. ఒకసారి దక్షిణాఫ్రికా నుంచి మలావీకి ఒక ఆడ చీతాతో 55 గంటలపాటు ప్రయాణించినట్లు మెర్వే చెప్పారు. ‘‘పరిస్థితులకు తగినట్లుగా అవి త్వరగా అలవాటుపడతాయి’’అని ఆయన చెప్పారు.

 
ప్రయాణంలో ఆహారం పెడతారా?
పెట్టరు. సాధారణంగా చీతాలు మూడు రోజులకు ఒకసారే దాదాపు 15 కేజీల మాంసం తింటాయి. దక్షిణాఫ్రికాలో వీటికి ఎక్కువగా అడవి పందులను ఆహారంగా పెడతారు. అయితే, ఒక మోస్తరు పరిమాణంలో ఉండే జింకలను అవి ఇష్టంగా తింటాయి. ప్రయాణానికి ముందుగా చీతాలకు ఆహారం పెడితే కొన్ని సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అవి అనారోగ్యానికి గురికావొచ్చు. లేదా వాంతులు చేసుకోవచ్చు. అందుకే భారత్‌కు తీసుకొచ్చే చీతాలకు రెండు రోజుల ముందు నుంచి ఎలాంటి ఆహారమూ పెట్టబోమని మెర్వే చెప్పారు.

 
ఇక్కడకు తీసుకొచ్చాక ఏం చేస్తారు?
ఇక్కడకు తీసుకొచ్చిన నెల రోజులపాటు కూనో నేషనల్ పార్క్‌లోని క్వారంటైన్ కేంద్రంలో ఉంచుతారు. ‘‘ఇలాంటి పెద్దపెద్ద జంతువులు తాము వచ్చిన ప్రాంతానికే మళ్లీ వెళ్లిపోవాలని ప్రయత్నిస్తాయి. అందుకే నెల నుంచి రెండు రోజుల పాటు కంచెలు ఉన్న ప్రాంతాల్లో ఉంచాలి’’ అని మెర్వే చెప్పారు. ఆ తర్వాత 115,000 హెక్టార్ల సువిశాల ఈ జాతీయ పార్కులో వీటిని స్వేచ్ఛగా వదిలేస్తారు.

 
ముప్పు ఏమిటి?
లెపర్డ్‌లు. అవును... చీతా పిల్లలపై భారతీయ చిరుతలు(లెపర్డ్) దాడిచేసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కూనో నేషనల్ పార్కులో ఈ ముప్పు మరీ ఎక్కువ. చీతాలు వేగంగా పరిగెడతాయి కానీ, దాడికి గురవుతుంటాయి. ముఖ్యంగా ఘర్షణల నుంచి అవి దూరంగా వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తాయి. ప్రస్తుతం భారత్‌కు తీసుకొస్తున్న చీతాలు.. సింహాలు, లెపర్డ్‌లు, హైనాలు, అడవి కుక్కల మధ్య జీవించినవే. కూనోలో మాత్రం వాటికి మొదటగా పెద్దపెద్ద ఎలుగుబంట్లు, తోడేళ్లు, హైనాలు ఎదురుపడొచ్చు. మరోవైపు వాటికి ఇక్కడ భిన్న రకాల జింకలు ఆహారంగా దొరుకుతాయి. ‘‘లెపర్డ్ లాంటి పెద్ద జంతువులు ఎదురుపడినప్పుడు ఎలా నడుచుకోవాలో ఇప్పటికే వాటికి అవగాహన ఉంటుందని మేం భావిస్తున్నాం’’ అని మెర్వే చెప్పారు.

 
ఎలాంటి కంచెలూ లేని కూనో లాంటి అభయారణ్యాల్లో ఈ చీతాలు మారుమూల ప్రాంతాల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఉపగ్రహ సమాచారం లేదా వీహెచ్‌ఫీ ట్రాకింగ్ కాలర్స్ సాయంతో వీటిని ఒక కంట కనిపెడుతుంటారు. ఎప్పటికప్పుడు వీటిని తెచ్చి మళ్లీ పార్క్ మధ్యలో వదిలిపెడుతుంటారు.

 
‘‘కొన్ని రోజుల తర్వాత ఈ ప్రాంతానికి చీతాలు అలవాటు పడతాయి. తన శరీరం నుంచి వచ్చే వాసనతో ప్రాంతాలను అవి మార్కింగ్ చేసుకుంటాయి’’అని ప్రొఫెసర్ టార్డిఫ్ చెప్పారు. పెద్ద జంతువులను వేరే ప్రాంతాలకు తరలించడం సవాళ్లతో కూడుకున్న పని. ‘‘అలవాటు పడిన ప్రాంతాల నుంచి వాటిని కొత్త ప్రాంతాలకు మనం తరలిస్తున్నాం. ఇతర పెద్ద జంతువులతో పోల్చినప్పుడు కొత్త ప్రాంతాలకు ఇవి త్వరగా అలవాటు పడగలవు’’అని టార్డిఫ్ అన్నారు. మలావీలో ఇలా కొత్త ప్రాంతంలో ప్రవేశపెట్టిన చీతాల్లో 80 శాతం జంతువులు ఏడాది తర్వాత కూడా బతికే ఉన్నాయి. ఆ తర్వాత క్రమంగా వీటికి సంఖ్య పెరిగింది.

 
కొన్ని అనుమానాలు..
అయితే, భారత్‌లో ఈ చీతాలు మనుగడ సాగించలేవని కొందరు నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అటవీ ప్రాంతం తగ్గిపోతోందని, ఫలితంగా నేషనల్ పార్కులపై ఒత్తిడి పెరుగుతుందని అంటున్నారు. అయితే, కూనోలో సరిపడా చోటు ఉందని ఝాలా అంటున్నారు. ఇక్కడ చీతాలకు అనువైన పరిస్థితులు ఉన్నాయని ఆయన చెబుతున్నారు. కూనో నేషనల్ పార్క్‌లో మొత్తంగా 20 చీతాలు హాయిగా జీవించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఐదారేళ్లలో దేశంలోని ఆరు నేషనల్ పార్కుల్లో చీతాల సంఖ్య 60కి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

 
ఇది ఎందుకు ముఖ్యమైన ప్రాజెక్టు?
చీతాలను సంరక్షించేందుకు చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు చాలా ముఖ్యమైనదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆసియా చీతాలు కేవలం 12 ఇరాన్‌లో ఉన్నాయి. ఈ జంతువుల్లో జన్యు వైవిధ్యం కూడా పెద్దగా లేదని సర్వేల్లో వెల్లడైంది. ‘‘ఇలాంటి జన్యు వైవిధ్యం లేని జంతువులను తీసుకొచ్చి ఇక్కడ పరిరక్షించడంతో పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనం చాలా కృషి చేస్తాం. అవకాశం తక్కువగా ఉన్నప్పుడు అంత కృషి చేయడం ఎందుకు? అందుకే ఆఫ్రికా చీతాలను తీసుకురావడం చాలా మెరుగైన చర్యగా చెప్పుకోవచ్చు’’అని టార్డిఫ్ అన్నారు. ‘‘చీతాలను పరిరక్షించే దిశగా భారత్ చేపడుతున్న ఈ ప్రాజెక్టు చాలా కీలకమైనది. దీంతో చీతాలు అంతరించిపోకుండా మనం కాపాడినట్లు అవుతుంది’’ అని ఆయన చెప్పారు.