మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 1 అక్టోబరు 2020 (12:38 IST)

ఐపీఎల్ 2020: పదేళ్ల వయసులో ఇల్లొదిలి వెళ్లిన యశస్వి జైస్వాల్ ఇప్పుడు స్టీవ్ స్మిత్‌తో ఓపెనింగ్ చేస్తున్నాడు

ఫోటో కర్టెసీ-ట్విట్టర్
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఆ పద్దెనిమిదేళ్ల కుర్రాడు స్టీవ్ స్మిత్, జోఫ్రా ఆర్చర్, జోస్ బట్లర్ వంటివారితో కలిసి దుబయిలోని విలాసవంతమైన హోటళ్లలో దిగుతూ దాదాపు ప్రతి రోజూ తన క్రికెట్ హీరోలను కలుస్తున్నాడు. గత వారం ఎంఎస్ ధోనీకి మైదానంలో ఈ కుర్రాడు నమస్కారం పెట్టిన తరువాత ట్విటర్ మొత్తం ఆ ఫొటోలు, వీడియోలే.

 
గొప్ప క్రికెటర్ కావాలన్న లక్ష్యంతో పదేళ్ల వయసులో ఇల్లొదిలి వచ్చేసిన యశస్వి జైస్వాల్ మొట్టమొదటిసారి ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. యశస్విది ఉత్తరప్రదేశ్. ఇల్లొదిలి వచ్చిన తరువాత ఎన్నో ఇబ్బందులుపడ్డాడు. ''నేను క్రికెట్ ఆడాలని నిజంగా అనుకున్నాను. కానీ, భారత్‌లో.. అందులోనూ ఒక గ్రామం నుంచి వచ్చినవారు అవకాశాలు పొందడం అంత సులభం కాదు'' అని ఐపీఎల్ పాడ్‌కాస్ట‌్‌లో చెప్పాడు.

 
''నువ్వు క్రికెట్ ఆడాలంటే ముంబయి వెళ్లాలని నా సీనియర్లు చెబుతుండేవారు. అది బుర్రలో అలాగే ఉండిపోయింది. మా అమ్మతో మాట్లాడేటప్పుడంతా ముంబయి వెళ్లాలి అంటుండేవాడిని.. నిద్రలో కూడా ఆ మాటే అనేవాడిని.'' ప్రపంచంలోనే అత్యంత జనాభా గల నగరాల్లో ఒకటైన ముంబయిలో తన కలలకు పునాదులు వేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకోవడమే కాకుండా ఏదైనా సాధించేవరకు తిరిగి ఇంటికి వెళ్లకూడదనీ నిర్ణయించుకున్నాడు యశస్వి. అందుకు నాలుగేళ్లు పట్టిందాయనకు.

 
క్రికెట్ గొప్పది... ప్రపంచ ప్రఖ్యాత అజాద్ మైదాన్‌లో రోజంతా ప్రాక్టీస్ చేస్తుండేవాడు యశస్వి. ఫార్వర్డ్ డిఫెన్సులో తనను తాను మెరుగుపరుచుకుంటూ, ర్యాంప్ షాట్లు ఆడుతుండేవాడు. 25 ఎకరాల సువిశాల అజాద్ మైదాన్‌లో పదులకొద్దీ క్రికెట్ ఫీల్డ్స్ ఉంటాయి. సచిన్ తెండూల్కర్, ప్రస్తుత భారత ఓపెనర్ పృథ్వి షా వంటివారిని అందించిన మైదానం ఇది.

 
ముంబయిలో బతకడం కోసం యశస్వి చాలా కష్టాలు పడ్డాడు. డెయిరీ ఉత్పత్తులు విక్రయించే ఒక దుకాణంలో పనిచేసేవాడు. కానీ.. రోజంతా క్రికెట్ ఆడి వచ్చాక అక్కడ పనిచేస్తుండడంతో అలసిపోయి పనిపై దృష్టిపెట్టలేకపోవడంతో యజమాని అతడిని తీసేశాడు. ''కనీసం ఈ రాత్రికి నన్ను ఇక్కడ ఉండనివ్వండి'' అని ప్రాథేయపడ్డానని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నాడు యశస్వి. అవి చాలా కష్టాలుపడిన రోజులని చెప్పాడు.

 
''ఆ మరుసటి రోజు నా కోచ్‌కు ఫోన్ చేశాను. ఆయన వాళ్లింటికి వచ్చేయమనడంతో అక్కడ రెండు మూడు నెలలు ఉన్నాన''ని చెప్పాడు యశస్వి. ఆ తరువాత క్రికెట్ క్లబ్‌లో గ్రౌండ్‌మెన్‌తో కలిసి ఒక టెంట్‌లో ఉండేవాడినని గుర్తు చేసుకున్నాడు.

 
''మా టెంట్‌లో ఉండాలంటే స్కోర్‌ వేయాలి అని వారు చెప్పారు.. అది నాకు బాగానే అనిపించింది. అక్కడే ఉంటే పొద్దున్నే లేచి ప్రాక్టీస్ చేసుకోగలను.. స్కోర్ వేయగలను, అంపైరింగ్ చేయగలను.. ఆ డబ్బు నాకు బతకడానికి పనికొస్తుందనుకున్నాను'' అని చెప్పాడు. తన సంపాదన పెంచుకోవడం కోసం యశస్వి పండగల సమయంలో వీధుల్లో తినుబండారాలు విక్రయించేవాడు.

 
కానీ, ఆటగాడిగా మంచి ఆహారం తీసుకోవడానికి అతనికి అవకాశం ఉండేది కాదు. అన్నం, పిండి, బంగాళదుంపలు తినేవాడు.. వారానికొక్క రోజు ఆదివారం చికెన్ తినేవాడు. ''ఆదివారాల కోసం వేచి చూసేవాడిని'' అని యశస్వి గుర్తు చేసుకున్నాడు. తాను కలిసి నివసించే గ్రౌండ్‌మెన్‌తో తిండి కోసం పోరాడే కంటే ఏమీ తినకుండా నిద్రపోయేవాడు చాలాసార్లు.

 
1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న తల్లిని గట్టిగా వాటేసుకోవాలని ఆయనకు ఎన్నోసార్లు అనిపించినా భావోద్వేగాలు బలహీనతలుగా మారుతాయని అనిపించి ఆ ఆలోచనలను దగ్గరకు రానిచ్చేవాడు కాదు. ''అమ్మ గుర్తొచ్చినప్పుడంతా ఏడుపొచ్చేది. నేను పడుతున్న కష్టాలు ఇంట్లో చెప్పేవాడిని కాను. నాకు తెలుసు.. నేను ఇబ్బంది పడుతున్నానని చెబితే ఇంటికి వచ్చేయమంటారు''

 
ఆ రోజుల నుంచి ప్రస్తుతానికి వచ్చేస్తే, ఇప్పుడు యశస్వి తన కోచ్, చాలాకాలంగా మెంటార్‌గా ఉన్న జ్వాలా సింగ్‌తో కలిసి ఉంటున్నాడు. అజాద్ మైదాన్‌లో తన కంటే పెద్దవాళ్లు, సీనియర్లు బౌలింగ్ చేస్తుంటే సునాయాసంగా ఆడుతున్న యశస్విని చూసి ఆయనలో ప్రతిభను గుర్తించిన జ్వాలా సింగ్ అప్పటి నుంచి ఆయనకు తర్ఫీదు ఇచ్చారు.

 
ఈ ఏడాది అండర్-19 ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలవడం.. దేశవాళీ వన్డే క్రికెట్‌లో 71 పరుగుల సగటు ఉండడంతో ఐపీఎల్‌లో యశస్వికి డిమాండ్ ఏర్పడింది. రాజస్థాన్ రాయల్స్ అతడితో రూ. 2.4 కోట్లకు ఒప్పందం చేసుకుంది.

 
వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన పిన్నవయస్కుడిగా గుర్తింపు పొందిన తరువాత కామెంటేటర్లు, క్రికెట్ పండితుల నోట్లో యశస్వి పేరు నిత్యం నానుతుండడంతో త్వరలో టీమిండియా చోటు దొరుకుతుందనీ అంచనా వేస్తున్నారు.

 
17 ఏళ్ల వయసులో ముంబయి తరఫున ఆడుతూ 154 బంతుల్లో 203 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ పోటీలో నంబర్ వన్ టెస్ట్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌తో కలిసి ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా ఆడుతున్నాడు.

 
ఎన్నో కష్టాలకోర్చి అనుకున్నది సాధిస్తున్న యశస్వికి టైటానిక్ సినిమా అంటే ఇష్టమట. అందులో నటించిన కేట్ విన్‌స్లెట్ అంటే మరీ ఇష్టమట. ''కేట్ విన్‌స్లెట్ అంటే నాకు చాలా ఇష్టం. ఏదో ఒక రోజు ఆమెను కలుస్తాను'' అంటున్నాడీ యువ క్రికెటర్. ''నేను చాలా రొమాంటిక్.. నాకు సెలీన్ డియాన్ రాసిన మై హార్ట్ విల్ గో ఆన్ పాట అంటే ఇష్టం'' అంటూ తన ఇష్టాయిష్టాలూ చెప్పుకొచ్చాడు యశస్వి.