శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (21:37 IST)

చెన్నై జట్టులో చేరనున్న 'ఇద్దరు మొనగాళ్లు'

ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఒకటి. ఈ జట్టు ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020 టోర్నీలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రారంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించిన చెన్నై జట్టు.. ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌లలో వరుసగా చతికిలపడింది. ఈ వరుస ఓటములకుగల కారణాలను కూడా ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వివరించారు. తమ జట్టు స్టార్ ఆటగాడు అంబటి రాయుడు, ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావోలు అందుబాటులో లేకపోవడంతో జట్టు సమతూకం దెబ్బతినడం కారణంగా ఈ పరిస్థితి ఎదురైనట్టు తెలిపారు. 
 
తొలి మ్యాచ్‌లో అంబటి రాయుడు కీలక పాత్రను పోషించాడు. ఆ తర్వాతి మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమయ్యాడు. ఇదే పరిస్థితిని డ్వేన్ బ్రారో కూడా ఎదుర్కొన్నాడు. అయితే, ఇపుడు ఈ ఇద్దరు ఆటగాళ్లు ఫిట్నెస్ సాధించారని, చెన్నై ఆడే తర్వాతి పోరులో బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నారని ఫ్రాంఛైజీ సీఈవో కాశీ విశ్వనాథన్‌ తెలిపారు. 
 
'తొడకండరాల నొప్పి నుంచి రాయుడు కోలుకున్నాడు. తర్వాతి మ్యాచ్‌లో అతడు ఆడతాడు. ట్రైనింగ్‌లో అతడు బాగానే  పరుగెత్తాడు. నెట్స్‌లోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్‌ కూడా ప్రాక్టీస్‌ చేశాడని' విశ్వనాథన్‌ చెప్పారు. 
 
అలాగే, లోయర్‌ ఆర్డర్‌లో చెన్నై జట్టుకు అతిపెద్ద బలం బ్రావోనే. కీలక సమయాల్లో బ్యాట్‌, బంతితో మెరువగల అద్భుతమైన  ఆల్‌రౌండర్‌. పవర్‌ హిట్టింగ్‌తో జట్టుకు విలువైన పరుగులు జోడించే బ్రావో జట్టులోకి వస్తే ధోనీసేన బలం మరింత  పెరగనుంది. తొడ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న బ్రావో ఫిట్నెస్‌ సాధించాడు. 'నెట్స్‌లో బ్రావో గొప్పగా బౌలింగ్‌  చేస్తున్నాడని' విశ్వనాథన్‌ వెల్లడించారు. 
 
ఇకపోతే, సీఎస్‌కే వేగంగా పుంజుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టిగా పుంజుకున్నాం. ఇప్పుడు కూడా అదే తరహాలో మళ్లీ గాడిలో పడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. చెన్నై తన తర్వాతి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఢీకొంటుంది.