ఆదివారం, 12 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (08:47 IST)

ఐపీఎల్ 2020 : కోహ్లీ సేనకు 'సూపర్‌'గా కలిసివచ్చిన విజయం

ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన పదో లీగ్ మ్యాచ్‌లో అసలు సిసలైన మజా కనిపించింది. కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ జట్లు తలపడగా, కోహ్లీ సేన సూపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు సాధించగా, ముంబై ఇండియన్స్ కూడా అంతే స్కోరు చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో విజేతను తేల్చేందుకు సూపర్ ఓవర్ అనివార్యం కాగా, బెంగళూరు విజయం సాధించింది.
 
బెంగళూరు నిర్దేశించిన 202 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై 78 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (8), డికాక్ (14), సూర్యకుమార్ యాదవ్ (0), హార్దిక్ పాండ్యా (15) వంటి హిట్టర్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో ముంబై ఓటమి ఖాయమని అందరూ భావించారు. 
 
అయితే, అప్పుడే మ్యాజిక్ జరిగింది. క్రీజులో పాతుకుపోయిన ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్‌లు అద్భుతమైన ఆటతీరుతో మ్యాచ్‌ను మలుపుతిప్పారు. ఇషాన్ కిషన్ 58 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్సర్లతో 99 పరుగులు చేసి సెంచరీకి ఒక్క పరుగు ముందు అవుటయ్యాడు.
 
పొలార్డ్ అయితే సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. అతడి సుడిగాలి ఇన్నింగ్స్‌తో మ్యాచ్ పూర్తిగా ముంబై చేతుల్లోకి వచ్చేసింది. అయితే, 20వ ఓవర్ ఐదో బంతికి ఇషాన్ అవుటయ్యాడు. 
 
విజయానికి చివరి బంతికి 5 పరుగులు అవసరం కాగా, ఉడానా వేసిన బంతిని పొలార్డ్ బౌండరీకి తరలించడంతో మ్యాచ్ టై అయింది. 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు మాత్రమే చేయడంతో స్కోర్లు సమమయ్యాయి. దీంతో మ్యాచ్ విజేతను తేల్చేందుకు సూపర్ ఓవర్ అవసరమైంది.  
 
సూపర్ ఓవర్‌లో ముంబై ఏడు పరుగులు మాత్రమే చేయగా, బెంగళూరు ఆ మాత్రం స్కోరును కూడా చివరి బంతి వరకు ఛేదించలేకపోయింది. చివరి బంతికి ఒక్క పరుగు అవసరం కాగా, కోహ్లీ ఫోర్ కొట్టి జట్టును గెలిపించాడు.
 
అంతకుముందు తొలుత టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ ఫీల్డింగ్‌ తీసుకోవడంతో ఆర్సీబీ బ్యాటింగ్‌కు దిగింది. దీంతో ఓపెనర్లు అరోన్‌ ఫించ్‌(52; 35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), దేవదూత్‌ పడిక్కల్‌(54; 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మంచి ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 81 పరుగులు చేశారు. ఈ క్రమంలోనే ఫించ్‌(52; 35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. అతనికి జతగా పడిక్కల్‌ కూడా ఆకట్టుకున్నాడు. 
 
కాగా, బౌల్ట్‌ బౌలింగ్‌లో పొలార్డ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఫించ్‌ ఔట్‌ కాగా, ఆపై కాసేపటికి కోహ్లి ఔటయ్యాడు. దాంతో ఆర్సీబీ 92 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆ సమయంలో పడిక్కల్‌కు డివిలియర్స్‌ జత కలవడంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 
 
వీరిద్దరూ మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించిన తర్వాత పడిక్కల్‌ ఔటయ్యాడు. ఆ తర్వాత డివీ-దూబేలు బౌండరీల మోత మోగించారు. ప్రధానంగా చివరి ఓవర్‌లో దూబే మూడు సిక్స్‌లు కొట్టడంతో ఆర్సీబీ స్కోరు 200 మార్కును దాటింది. ఆ తర్వాత నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు జట్టు 3 వికెట్లకు 201 పరుగులు చేసింది. 
 
ఈ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ టాప్ ఆర్డర్ వీరవిహారం చేసింది. ఒక్క కెప్టెన్ కోహ్లీ (3) తప్ప మిగతా అందరూ ముంబై బౌలింగ్‌ను చీల్చి చెండాడారు. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ 54 (5 ఫోర్లు, 2 సిక్స్‌లు), మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ 52 (7 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు సాధించారు. వీళ్లిద్దరూ తొలి వికెట్‌కు 81 పరుగులతో శుభారంభం అందించగా, వన్డౌన్‌లో వచ్చిన కోహ్లీ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.
 
కోహ్లీ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన డివిలియర్స్‌ భారీ షాట్లతో అలరించాడు. ఈ క‍్రమంలోనే 23 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించిన ఏబీ తన దూకుడును చివరి వరకూ కొనసాగించాడు. బుమ్రా, బౌల్ట్‌ వంటి బౌలర్లున్నా 360 డిగ్రీల ఆటతో అదరగొట్టాడు. 
 
ఆఖరి ఓవర్‌లో దూబే(27 నాటౌట్‌; 10 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు) బ్యాట్‌ ఝుళిపించడంతో ఆర్సీబీ 202 పరుగుల స్కోరును సాధించింది. ముంబై బౌలర్లలో బౌల్ట్‌ రెండు వికెట్లు సాధించగా, రాహుల్‌ చహర్‌కు వికెట్‌ తీశారు.