సూపర్ క్యాచ్.. సిక్స్‌ను అవుట్‌గా మార్చేశాడు.. నికోలస్ అదుర్స్.. (video)
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ 2020 ఆసక్తి కరంగా మారుతోంది. పరుగుల వరద పారిస్తూ ఆటగాళ్లు రక్తి కట్టిస్తున్నారు. బౌలింగ్‌లోనూ అదరగొడుతున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్ చరిత్రలోనే ఎవరూ ఊహించని అద్భుతమైన ఫీల్డింగ్ ఆదివారం నాటి మ్యాచ్‌లో కనిపించింది.
కింగ్స్ లెవన్ పంజాబ్ ఆటగాడు నికోలస్ పూరన్ బౌండరీ వద్ద బంతిని ఆపిన తీరు అందరికీ షాకిచ్చాడు. సిక్స్ వెళ్లే బంతిని గాల్లోనే అందుకొని దాన్ని తిరిగి గ్రౌండ్‌లోకి విసిరేశాడు. దీన్ని చూసిన దిగ్గజ ఆటగాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. ఇది అద్భుతమైన ఫీల్డింగ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ లెవన్ పంజాబ్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరుగుతోంది. ఆ సమయంలో మురుగన్ అశ్విన్ 8వ ఓవర్ వేశాడు. దీన్ని క్రీజులో ఉన్న సంజూ శాంసన్ భారీ షాట్లతో బౌండరీ వైపు బాదాడు. అంతా అది సిక్స్ అని భావించారు. కానీ అప్పటికే బౌండరీ లైన్ వద్ద వేగంగా వచ్చిన పూరన్ గాల్లోకి ఎగిరి బంతిని పట్టుకున్నాడు. తాను బౌండరీ అవతల పడేకంటే ముందే తిరిగి మైదానంలోకి విసిరేశాడు.
అంతే ఆరు పరుగులు రావాల్సిన చోట కేవలం 2 మాత్రమే వచ్చాయి. ఎవరూ ఊహించని ఫీల్డింగ్ చూసి అంతా ఫిదా అవుతున్నారు. పంజాబ్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ అయితే లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టాడు. దీనిపై క్రికెట్ దేవుడు సచిన్ కూడా స్పందించారు. తన లైఫులో చూసిన అద్భుతమైన సేవ్ అంటూ ప్రశంసించారు.