శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (11:36 IST)

ఐపీఎల్ 2020 : హైదరాబాద్‌కు అగ్నిపరీక్ష .. హ్యాట్రిక్‌పై ఢిల్లీ కన్ను

ఐపీఎల్ 2020 టోర్నీలో భాగంగా, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మంగళవారం తలపడనున్నాయి. వరుస ఓటములతో సతమతమవుతున్న హైదరాబాద్ జట్టుకు ఈ మ్యాచ్ ఓ అగ్నిపరీక్షలా మారింది. అదేసమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా జరుగనుంది. 
 
ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీ పాయింట్ల పట్టికలో ఢిల్లీ అగ్రస్థానంలో కొనసాగుతుంటే, హైదరాబాద్ జట్టు మాత్రం అడిన అన్ని మ్యాచ్‌లలో ఓడి అట్టడుగు స్థానంలో ఉంది. అందుకే ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాలన్న కసితో ఉంది. ఈ జట్టులో నిస్టార్ ఆటగాళ్లు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో పూర్తిగా విఫలమయ్యారు. ఇదే హైదరాబాద్ జట్టును కష్టాల్లోకి నెడుతోంది. 
 
ముఖ్యంగా, ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగల సత్తా ఉన్న కెప్టెన్ డేవిడ్ వార్నర్ పూర్తిగా విఫలమవుతున్నాడు. అలాగే, తొలి మ్యాచ్‌లో మెరిసిన బైర్‌స్టో కోల్‌కతాపై తేలిపోయాడు. ఇద్దరు కీలక ఆటగాళ్లు అంతంత మాత్రంగానే రాణిస్తుండడం హైదరాబాద్ బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లోనైన వీరిద్దరూ తప్పక తమ బ్యాట్లకు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనావుంది.
 
ఇదిలావుండగా ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ నిలకడైన బ్యాటింగ్‌ను కనబరిచిన మనీష్ పాండే ఈ మ్యాచ్‌లో కూడా రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. అయితే అతని బ్యాటింగ్‌లో మునుపటి మెరుపులు కనిపించడం లేదు. ఈ మ్యాచ్‌లో ధాటిగా ఆడితే జట్టు బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. 
 
ఇక కిందటి మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న వృద్ధిమాన్ సాహా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు. అతని బ్యాటింగ్ తీరు ఐపిఎల్‌కు ఏమాత్రం సరిపోదనే విషయం మరోసారి రుజువైంది. అతను పరుగులు సాధించినా డిఫెన్స్‌కే పరిమితం కావడంతో స్కోరు వేగాన్ని పుంజుకోలేదు. 
 
జట్టు భారీ ఆశలు పెట్టుకున్న అఫ్గాన్ స్టార్లు మహ్మద్ నబి, రషీద్ ఖాన్‌లు కూడా పెద్దగా ప్రభావం చూపలేక పోతున్నారు. ఐపిఎల్‌లోనే అత్యంత ప్రతిభావంతుడైన బౌలర్‌గా పేరు తెచ్చుకున్న రషీద్ ఇప్పటి వరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పోయాడు. నబి కూడా పెద్దగా రాణించలేదు. సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా రెండు మ్యాచుల్లోనూ నిరాశ పరిచాడు. కనీసం ఢిల్లీపైనైన రాణించాలని జట్టు కోరుకుంటుంది. 
 
మిగతా వారు కూడా అంతంత మాత్రం ఆటతో సతమతమవుతున్నారు. దీంతో హైదరాబాద్‌కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. అయితే ఢిల్లీపై మాత్రం మెరుగైన ఆటను కనబరచాలని సన్‌రైజర్స్ ఆటగాళ్లు భావిస్తున్నారు. ఇందులో ఎంతవరకు సఫలం అవుతారో బరిలోకి దిగితేకానీ తెలియదు.
 
మరోవైపు, ఇప్పటికే రెండు విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిటల్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని భావిస్తోంది. కిందటి మ్యాచ్‌లో బలమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తుగా ఓడించింది. అంతేగాక తొలి మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో జయభేరి మోగించింది. ఇక హైదరాబాద్‌పై కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. 
 
ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. రిషబ్ పంత్, శిఖర్ ధావన్, పృథ్వీషా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, పాటిన్సన్, అక్షర్ పటేల్, స్టోయినిస్ తదితరులతో ఢిల్లీ చాలా బలంగా ఉంది. సమష్టిగా రాణించడం ఢిల్లీకి అతి పెద్ద బలంగా మారింది. ఈ మ్యాచ్‌లోనూ సమష్టిగా రాణించి హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలనే పట్టుదలతో ఢిల్లీ ఉంది.
 
ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తి జట్టు : శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), పృథ్వీ షా, అజింక్యా రహానే, శిఖర్ ధావన్, డేనియల్ శామ్, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్, సందీప్, రబడా, కీమో పాల్, మోహిత్ శర్మ, లలిత్ యాదవ్, అక్సర్ పటేల్, హర్షల్ పటేల్, అశ్విన్, మెర్క్యూస్ స్టెయిన్స్, అన్రిచ్ నోర్టాజ్, రిషబ్ పంత్, అలెక్స్ క్యారీ, షిమ్రాన్ హెట్మియర్, తుషార్ దేశ్‌పాండే. 
 
సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు : డేవిడ్ వార్నర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, బాసిల్ తంపి, భువనేశ్వర్ కుమార్, బిల్లీ స్టాన్‌లేక్, జానీ బెయిర్‌స్టో, కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, మొహ్మద్ నబి, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, షాహబ్జ్ నదీమ్, శ్రీవత్స్ గోస్వామి, సిద్ధార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్, టి నటరాజన్, విజయ్ శంకర్, వృద్ధిమాన్ సాహు, విరాట్ సింగ్, ప్రియం గార్గ్, జాసన్ హోల్డర్, సందీప్ బవంకా, ఫాబియాన్ అలెన్, అబ్దుల్ శామద్, సంజయ్ యాదవ్.