ఆటోలో డిప్యూటీ సీఎం పవన్: మీతో ఇలా పక్కన కూర్చుని ప్రయాణం అస్సలు ఊహించలేదు సార్ (video)
ఆటో డ్రైవర్స్ సేవా పథకం కార్యక్రమంలో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉండవల్లి నుంచి విజయవాడ సింగ్ నగర్ వరకూ ఆటోలో ప్రయాణించారు. ఆయనతో పాటు ఆటో డ్రైవర్ కుటుంబం కూడా ప్రయాణించారు. ఈ సందర్భంగా డ్రైవర్ భార్య మాట్లాడుతూ... మిమ్మల్ని సినిమాల్లో చూడటమే... మీతో ఇలా పక్కన కూర్చుని ప్రయాణం చేయడం అస్సలు ఊహించలేదు సార్ అంటూ తన ఆనందాన్ని వెలిబుచ్చింది. సింగ్ నగర్ వరకూ ఆటోలో ప్రయాణించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆటోలో ప్రయాణించినందుకు డ్రైవరుకి డబ్బులిచ్చారు.
ఆటో డ్రైవర్స్ సేవా పథకం కింద 2.90 లక్షల మంది ఆటో రిక్షా, క్యాబ్ డ్రైవర్లకు ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున నగదును జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.436 కోట్లు కేటాయించింది. గత ప్రభుత్వం కేటాయింపు అయిన రూ.261.51 కోట్లతో 2,61,516 మంది ఆటో డ్రైవర్లకు రూ.10,000 చొప్పున పంపిణీ చేయగా, ప్రస్తుత ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి కేటాయింపును రూ.436 కోట్లకు పెంచింది. దీనివల్ల 2.90 లక్షల మంది డ్రైవర్లకు ప్రయోజనం చేకూరుతుంది.
లబ్ధిదారులలో 2,25,621 మంది ఆటో డ్రైవర్లు, 38,576 మంది ప్యాసింజర్ వెహికల్ డ్రైవర్లు, 38,576 మంది మోటార్ క్యాబ్ డ్రైవర్లు, 6,400 మంది మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. అత్యధిక సంఖ్యలో లబ్ధిదారులతో విశాఖపట్నం అగ్రస్థానంలో ఉంది. గత ప్రభుత్వం విధించిన రూ. 20,000 గ్రీన్ టాక్స్‌ను రూ. 3000కు తగ్గించింది కూటమి ప్రభుత్వం.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ హాజరయ్యారు. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ఆటో డ్రైవర్స్ సేవా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఉండవల్లి నుంచి ఆటోలో విజయవాడ సింగ్ నగర్‌కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బయల్దేరి వచ్చారు.