సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 3 డిశెంబరు 2019 (15:17 IST)

ఆడ తోడు కోసం 2 రాష్ట్రాల్లోని 7 జిల్లాల్లో 5 నెలల పాటు తిరిగిన మగ పులి

ఆడ తోడు కోసం ఒక పులి అయిదు నెలల పాటు రెండు రాష్ట్రాల్లోని ఏడు జిల్లాల పరిధిలో 1300 కిలోమీటర్ల మేర తిరిగి రికార్డు సృష్టించింది. భారత దేశంలో ఇంకే పులీ ఇంతవరకు ఇంతలా తిరిగింది లేదని అటవీ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో మొదలైన ఆ మగ పులి యాత్ర పొరుగునే ఉన్న తెలంగాణలోనూ సాగింది. ఈ క్రమంలో అది అడవిలోనే కాదు సమీపంలోని పొలాలు, హైవేలు, ఊళ్లు మీదుగా ప్రయాణించింది.

 
రెండున్నరేళ్ల వయసున్న ఆ పులి సాగించిన సుదీర్ఘ యాత్రకు కారణం ఆహారం, ఆడతోడు కోసం వెతుకులాటేనని అటవీ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని ఒక అభయారణ్యంలోని ఈ పులికి గతంలోనే అధికారులు రేడియో కాలర్ అమర్చారు. రేడియో కాలర్ సహాయంతో దాని జాడను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.

 
జూన్‌లో అది తానున్న అభయారణ్యాన్ని వీడి తిరగడం ప్రారంభించింది. అక్కడి నుంచి పొలాలు, నీరున్న ప్రాంతాలు, హైవేలపై అటూఇటూ తిరుగుతూ తెలంగాణ రాష్ట్రంలోకి కూడా వచ్చింది. మహారాష్ట్రలోని తిపేశ్వర్ పులుల అభయారణ్యంలో టీ-1 అనే ఆడ పులికి రెండున్నరేళ్ల కింద పుట్టిన మూడు కూనల్లో ఇదొకటి. దీని పేరు సీ-1.

 
ఫిబ్రవరిలో సీ-1కి అటవీ శాఖ సిబ్బంది రేడియో కాలర్ అమర్చారు. ఆ తరువాత నుంచి ఇది ఎటు వెళ్తుందన్నది ట్రాక్ చేస్తున్నారు. అయితే, జూన్ నుంచి ఇది అలుపు లేకుండా సంచరించడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఇది మహారాష్ట్ర, తెలంగాణల్లోని ఏడు జిల్లాల్లో తిరిగింది. రేడియో కాలర్ ద్వారా జీపీఎస్ శాటిలైట్ సమాచారాన్ని గంటగంటకూ తెలుసుకున్నామని గత 9 నెలల్లో ఆ పులి 5,000 వేర్వేరు ప్రాంతాల్లో సంచరించిందని చెప్పారు.

 
''ఆవాసం, ఆహారం, ఆడ తోడు కోసం సీ-1 అదే పనిగా సంచరించి ఉండొచ్చు. భారత్‌లో పులులుండే ప్రాంతాలన్నీ నిండిపోయాయి. కొత్త పులులు తనదైన పరిధి ఏర్పరచుకోవడానికి కొత్త ప్రాంతాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది'' అని వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో సీనియర్ బయాలజిస్ట్‌గా ఉన్న డాక్టర్ బిలాల్ హబీబ్ అన్నారు.

 
ఈ సుదీర్ఘ యాత్రలో సీ-1 పగటి పూట దాక్కుని రాత్రి వేళలో నడక సాగించేది. ఆహారం కోసం అడవి పందులు, పశువులను వేటాడేది. ఒక్కసారి తప్ప ఎన్నడూ మనుషులపై దాడి చేయలేదని, అది కూడా తాను విశ్రాంతి తీసుకుంటున్న గుబురు పొదలోకి చొరబడడం వల్ల అనుకోకుండా గాయపరిచిందని హబీబ్ చెప్పారు. ''ఈ పులి తమ పెరట్లో తిరిగినా చాలామందికి తెలియలేదు'' అంటూ హబీబ్ సీ-1 గురించి చెప్పారు.

 
అయినప్పటికీ సీ-1 వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తగా దాన్ని పట్టుకుని సమీపంలోని అడవిలోకి తరలిస్తామని అటవీ అధికారులు చెప్పారు. దానికి అమర్చిన రేడియో కాలర్‌ బ్యాటరీ 80 శాతం అయిపోవడంతో కొద్దిరోజుల్లో కమ్యూనికేషన్ తెగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ముందే దాన్ని పట్టుకుంటామని చెబుతున్నారు.

 
దేశంలో పులుల సంఖ్య పెరుగుతుండగా వాటి ఆవాసాలు తగ్గిపోతున్నాయి. ఒక పులి మనుగడ సాగించాలంటే అది ఉండే ప్రాంతంలో కనీసం 500 జంతువులతో ఆహార సంపద ఉండాలని నిపుణులు చెబుతున్నారు.