గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 13 జులై 2022 (22:56 IST)

శ్రీలంకకు సైన్యాన్ని పంపుతోంది, గొటబయా పారిపోవడానికి సాయం చేసింది- భారత్ పై ఇలాంటి వదంతులు ఎందుకు వస్తున్నాయి

gotabaya rajapaksa-Modi
శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష, బుధవారం ఆ దేశం విడిచి మాల్దీవులకు పారిపోయారు. ఆయన సోదరుడు, శ్రీలంక మాజీ ఆర్థికశాఖ మంత్రి బాసిల్ రాజపక్ష కూడా దేశం విడిచి వెళ్లి పోయారు. ప్రస్తుతం ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. శ్రీలంకలో నిరసన ప్రదర్శనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. గొటాబయ రాజపక్ష పారిపోయారని తెలియగానే ప్రజల్లో ఆగ్రహావేశాలు భగ్గుమన్నాయి. వేలమంది ప్రధానమంత్రి నివాసంలోకి ప్రవేశించారు. ఇప్పటికే శ్రీలంక అధ్యక్ష నివాసం నిరసనకారులతో నిండిపోయి ఉంది.

 
ఇంతకు ముందు శ్రీలంక ప్రధానిగా ఉన్న మహింద రాజపక్ష ఆ పదవికి రాజీనామా చేశారు. దాంతో రణిల్ విక్రమసింఘే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి మహింద రాజపక్ష ఏమయ్యారో ఎవరికీ తెలియదు. జులై 13న తన పదవికి రాజీనామా చేస్తానని గొటాబయ రాజపక్ష గతంలో ప్రకటించారు. ఆయన బుధవారం నాడు రాజీనామా లేఖ పంపిస్తారని, శ్రీలంక పార్లమెంట్ స్పీకరు చెప్పారు. ఇక రణిల్ విక్రమసింఘేను కూడా ప్రజలు పెద్దగా నమ్మడం లేదు. ఆయన ప్రైవేటు నివాసానికి కూడా నిరసకారులు నిప్పు పెట్టారు. ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోతానని రణిల్ విక్రమసింఘే కూడా ప్రకటించారు. కాకపోతే దానికంటే ముందు అన్ని పార్టీలతో కలిపి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేయాలని కొద్ది రోజుల కిందట అన్ని రాజకీయల పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసిన శ్రీలంక పార్లమెంటు స్పీకర్ మహింద యాప అభయవర్ధన డిమాండ్ చేశారు.

 
శ్రీలంకలో జరుగుతున్న పరిణామాలను చాలా నిశితంగా పరిశీలిస్తోంది భారత్. శ్రీలంక వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందంటూ వస్తున్న వదంతుల మీద వెంటనే స్పష్టత ఇస్తోంది. గొటాబయ రాజపక్ష దేశం విడిచి వెళ్లిపోవడానికి భారత్ సాయం చేసిందంటూ వచ్చిన వార్తలను శ్రీలంకలోని భారత హై కమిషన్ ఖండించింది. గొటాబయ రాజపక్ష, బాసిల్ రాజపక్ష దేశం విడిచి వెళ్లిపోవడానికి భారత్ సాయం చేసిందనే వార్తలు నిరాధారమని ట్వీట్ చేసింది. ఇలా వదంతులకు, వార్తలకు భారత్ వివరణ ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. శ్రీలంకకు తమ సైన్యాన్ని పంపడంలేదంటూ జులై 10న స్పష్టత ఇచ్చింది. 'శ్రీలంకకు సైనిక బలగాలను భారత్ పంపుతోందంటూ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను హై కమిషన్ ఖండిస్తోంది. అలాంటి ఉద్దేశం భారత్‌కు లేదు.' అని శ్రీలంకలోని భారత హైకమిషన్ ట్వీట్ చేసింది.

 
గతంలో కూడా శ్రీలంక పౌరులకు భారత్ వీసా ఇవ్వడం లేదంటూ వచ్చిన వార్తలను హై కమిషన్ ఖండించింది. సిబ్బంది కొరత వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తాయని, వీసాలు ఇవ్వడం లేదనడంలో వాస్తవం లేదని మే 13న స్పష్టం చేసింది. శ్రీలంక ప్రధాని పదవికి రాజీనామా చేసిన తరువాత మహింద రాజపక్ష, ఆయన కుటుంబం భారత్‌కు పారిపోయిందంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను కూడా మే 10న హై కమిషన్ ఖండించింది. ఎందుకు ఇలా భారత్ పదేపదే శ్రీలంక విషయంలో ప్రతి చిన్న రూమర్‌ను సీరియస్‌గా తీసుకుంటోంది? స్పష్టత ఎందుకు ఇస్తోంది?

 
రాజపక్ష కుటుంబంతో మంచి సంబంధాలున్నాయని బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి చెబుతుంటారు. శ్రీలంకలో భారీ స్థాయిలో ప్రజా నిరసనలు చెలరేగి, రాజపక్ష కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాల్సిన పరిస్థితి ఎదురైంది. అప్పుడు శ్రీలంకు భారత సైన్యాన్ని పంపించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు సుబ్రమణియన్ స్వామి. 'శ్రీలంక ఎన్నికల్లో గొటాయబ రాజపక్ష, మహింద రాజపక్ష భారీ మెజార్టీతో గెలిచారు. ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రభుత్వాన్ని కొందరు నిరసనకారులు పడగొడుతుంటే భారత్ చూస్తూ ఎలా ఊరుకుంది? ఇలా అయితే మన పొరుగున ఉండే ఏ ప్రజాస్వామ్య దేశం కూడా సురక్షితంగా ఉండలేదు. ఒకవేళ రాజపక్ష మన సైనిక సాయం అడిగితే వెంటనే అందించాలి.' అంటూ జులై 10న ఆయన ట్వీట్ చేశారు.

 
సుబ్రమణియన్ స్వామి భారత్‌లో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వారు. ఆయన చేసిన ట్వీట్, శ్రీలంకలో సంచలనంగా మారింది. శ్రీలంకలోని భారత హై కమిషన్ పదేపదే క్లారిఫికేషన్లు ఇవ్వడానికి ఇది కూడా ఒక కారణం. 'శ్రీలంకలో రాజకీయ స్థిరత్వమనేది భారత్ ప్రయోజనాలకు ఎంతో అవసరం. భౌగోళికంగా చూసినా సాంస్కృతికంగా చూసినా శ్రీలంకకు భారత్ చాలా దగ్గరి దేశం. అక్కడ పెరుగుతున్న చైనా ఆర్థిక కార్యకలపాలు భారత్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పుడు శ్రీలంక ప్రజలకు తిండి, ఇంధనం, మందులు వంటివి భారత్ సాయం చేయాలి. అక్కడున్న అవినీతి ప్రభుత్వానికి ఇండియా దూరంగా ఉండాలి.' అని హిందుస్థాన్ టైమ్స్‌లో రాసిన వ్యాసంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, సెంటర్ ఫర్ సౌత్ ఏషియా స్టడీస్ ప్రొఫెసర్ ఎస్‌డీ మునీ అభిప్రాయపడ్డారు.

 
'అలాగే శ్రీలంకలో కొందరు భారత్‌ను ఇష్టపడటం లేదు. అక్కడి ఒక పవర్ ప్రాజెక్ట్‌ను అదానీకి ఇప్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ లాబీ చేశారనే వార్తలు వచ్చాయి. శ్రీలంకలోని భారత వ్యతిరేక వర్గాలు ఈ వార్తలను ఉపయోగించుకునే ప్రయత్నం చేశాయి. రాజపక్ష ప్రభుత్వాన్ని కాపాడేందుకు భారత్ సైన్యాన్ని పంపుతోందన్న వార్తలు కూడా వచ్చాయి.' అని ఎస్‌డీ మునీ రాసుకొచ్చారు. ఉత్తర శ్రీలంకలోని ఒక పెద్ద విద్యుత్ ప్రాజెక్ట్‌ను అదానీ గ్రూప్‌కు ఇచ్చేలా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒత్తిడి తెచ్చారంటూ పార్లమెంటరీ కమిటీ ముందు శ్రీలంకకు చెందిన ఒక ఉన్నతాధికారి వాంగ్మూలం ఇచ్చారు. అది వివాదంగా మారడంతో ఆ వ్యాఖ్యలను తరువాత వెనక్కి తీసుకున్నారు. ఈ వివాదం మీద శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే స్పందిస్తూ 'ఒకవేళ నిజంగానే ఆ పవర్ ప్రాజెక్ట్‌ను భారత్ కావాలనుకుంటే ప్రధాని నరేంద్ర మోదీ లేక ప్రధాని కార్యాలయం అధికారులు నన్ను అడిగి ఉండేవారు. కానీ వారి నుంచి నాకు అలాంటి సమాచారం ఏమీ రాలేదు.' అని అన్నారు.

 
రాజపక్ష పాలనలో భారత్‌కు దూరమైన శ్రీలంక- మహేందర్ లామా, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ
రాజపక్ష పాలనలో శ్రీలంకలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అంతర్గతంగానే కాదు విదేశీ విధానం కూడా పూర్తిగా మారిపోయింది. గత 15 ఏళ్లలో శ్రీలంక చాలా మారిపోయింది. భారత్‌కు పూర్తిగా దూరమైంది. రాజపక్ష పాలనలో శ్రీలంక మీద చైనా పట్టు పెరిగింది. చైనా అప్పుల ఉచ్చులో పడి భారత్‌కు రాజపక్ష దూరమయ్యారు. ఒకనాడు శ్రీలంకలో అంతర్యుద్ధం చెలరేగినప్పుడు ఆ దేశ ఆర్థికవ్యవస్థ స్థిరంగానే ఉంది. విదేశీ మారకపు నిల్వల సమస్య లేదు. అత్యవసరాలు, ఇంధన కొరత రాలేదు. నాడు శ్రీలంకకు భారత్ అండగా ఉండేది. సమస్యల నుంచి శ్రీలంకను బయటపడేసేందుకు సాయం చేసేది.

 
ఇప్పుడు శ్రీలంకలో పరిస్థితులు భారత్‌ను భయపెడుతున్నాయి. పతనమైన శ్రీలంక ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం మాములు విషయం కాదు. భారత్ సాయం చేయాలనుకున్నా ఎవరికి చేయాలి? అనేది పెద్ద సమస్య. ఇప్పుడు అక్కడ ప్రజలు నమ్మకాన్ని చూరగొన్న నాయకులు ఎవరూ లేరు. సైన్యం కూడా చెల్లాచెదురై పోయింది. సాయం చేయాలంటే ఒక నాయకత్వం ఉండాలి. కానీ ఇప్పుడే శ్రీలంకలో అదే లేదు.

 
శ్రీలంకలో కొంత కాలం పాటు ఇంధనం, అత్యవసరాల కొరత రాకుండా చూసుకునే శక్తి భారత్‌కు ఉంది. కానీ భారత్ తగినంత సాయం చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. మన దేశంలో భారీ స్థాయిలో ధాన్యపు నిల్వలున్నాయి. కానీ తగినంత క్వాంటిటీ శ్రీలంకకు పంపడం లేదు. జపాన్, ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ల ఇండో-పసిఫిక్ పాలసీ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇండో-ఫసిఫిక్ ప్రాంత భద్రతకు శ్రీలంకలో స్థిరత్వం ఎంత అవసరమో వాళ్లకు తెలియదా? శ్రీలంకలో అస్థిరత అనేది ఇండో-ఫసిఫిక్ విధానానికి చాలా ప్రమాదకరం. మాల్దీవుల్లో ఇప్పటికే భారత్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. శ్రీలంకకు కూడా భారత్ పూర్తిగా దూరమయ్యే ప్రమాదం కనిపిస్తోంది.

 
దక్షిణాసియాలోని చాలా దేశాలు ఆర్థికసమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఇది భారత్‌కు చాలా కష్టమైన పరిస్థితి. శ్రీలంక మాదిరిగానే నేపాల్, పాకిస్తాన్ దేశాలు కూడా ఆర్థికంగా సంక్షోభంలో చిక్కుకుంటాయనే వార్తలు వింటున్నాం. సార్క్ పరిధిలో శ్రీలంకకు భారత్ సాయం చేయలేకపోతే కనీసం తన ధాన్యాన్ని అయినా అక్కడి ప్రజలకు పంపాలి. తద్వారా శ్రీలంక ప్రజల మనసుల్లో భారత్ స్థానం సంపాదించుకోవచ్చు.