సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 జులై 2022 (08:13 IST)

శ్రీలంకను ఆదుకుంటాం : భారత విదేశాంగ శాఖ ప్రకటన

srilanka president house
పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకునిపోయిన శ్రీలంకను అన్ని విధాలుగా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. అదేసమయంలో ప్రస్తుతం శ్రీలంకలో నెలకొన్న పరిణామాలన్నింటినీ పరిశీలిస్తున్నట్టు భారత్ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
రోజువారీ జీవనం మరింత దుర్భరంగా మారడంతో శ్రీలంక ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు మిన్నంటిపోయాయి. దీంతో శ్రీలంక అధినేతలంతా దిగివచ్చారు. ఉపద్రవాన్ని ముందే గుర్తించిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే అధ్యక్ష భవనం వీడి పారిపోయారు. అలాగే, తన పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రధాని రణిల్ విక్రమ సింఘే ప్రకటించారు. 
 
ఈ అంశాలన్నింటినీ క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు భారత్‌ తాజాగా ఓ ప్రకటన చేసింది. శ్రీలంక ప్రజలకు అండగా ఉంటామని వెల్లడించింది. ప్రజాస్వామ్య మార్గాలు, రాజ్యాంగ విలువలు, పురోగతి కోసం ప్రయత్నిస్తున్న శ్రీలంక ప్రజలకు భారత్‌ అండగా నిలుస్తుందంటూ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
 
ద్వీప దేశంలో ఆర్థిక సంక్షోభం మొదలైనప్పటి నుంచి భారత్‌ దన్నుగా నిలుస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి గుర్తుచేసింది. ఇప్పటివరకు 3.8 బిలియన్‌ డాలర్ల సాయమందించామని ఇకపైనా ఈ సాయాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. 
 
కాగా, తీవ్ర సంక్షోభం కారణంగా ప్రభుత్వంపై శ్రీలంక ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. శనివారం అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు ఇంకా అక్కడే ఉన్నారు. అక్కడే వంటావార్పూ చేసుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వీడియోల ద్వారా తెలుస్తోంది.