1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 జులై 2022 (15:55 IST)

హిట్‌మ్యాన్ ముంగిట అరుదైన అవకాశం.. రిజర్వ్‌ బెంచ్‌కు అవకాశం ఇస్తారా?

rohith sharma
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ముంగిట అరుదైన అవకాశం ఉంది. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ రికార్డును సమం చేసే అరుదైన ఛాన్స్ రోహిత్ ముంగిట ఉంది. అయితే, ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా టెస్ట్ సిరీస్‌ను డ్రా చేసుకుంది. ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతోంది. ఇందులో తొలి రెండు మ్యాచ్‌లలో విజయభేరీ మోగించింది. 
 
మూడో టీ20 మ్యాచ్ ఆదివారం జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్‍‌లోనూ క్వీన్ స్వీప్ చేయాలని భారత జట్టు భావిస్తుంది. ఈ క్రమంలో అరుదైన రికార్డు ముంగిట ఉన్న రోహిత్ శర్మకు అవకాశం ఇస్తారా? లేక రిజర్వు బెంచ్ ఆటగాళ్ళకు అవకాశం ఇస్తారా? అన్నది తెలియాల్సివుంది. 
 
ఐర్లాండ్‌పై అరంగేట్రం చేసిన ఉమ్రాన్‌ మాలిక్‌ను చివరి మ్యాచ్‌లో ఆడించే ఛాన్స్‌ ఉంది. అదేవిధంగా బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌, హర్షల్‌ పటేల్‌కు విశ్రాంతినిచ్చి.. అవేశ్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్ మాలిక్‌ను ఆడించొచ్చు. చాహల్‌ స్థానంలో రవి బిష్ణోయ్‌ను స్పిన్నర్‌గా తీసుకునే వీలుంది. ఇషాన్‌ కిషన్‌, దీపక్‌ హుడా, శ్రేయస్‌ అయ్యర్‌లకు అవకాశం కల్పిస్తే బాగుంటుంది.
 
ఇదిలావుంటే, గత టీ20 ప్రపంచకప్‌ తర్వాత టీమ్‌ఇండియా సారథిగా బాధ్యతలు చేపట్టిన రోహిత్‌ నాయకత్వంలో పొట్టి ఫార్మాట్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇంగ్లండ్‌పై రెండో విజయంతో రోహిత్ శర్మ వరుసగా 19 మ్యాచ్‌ల్లో గెలిచిన సారథిగా రికార్డు సృష్టించాడు. 
 
ఆదివారం జరిగే మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే పాంటింగ్‌ (20)ను సమం చేస్తాడు. అదేవిధంగా వరుసగా 14 టీ20 మ్యాచ్‌లను గెలిచిన సారథిగా నిలిచాడు. అత్యధికంగా ఫోర్లు (301) బాదిన తొలి భారతీయ బ్యాటర్‌గా, అంతర్జాతీయ స్థాయిలో రెండో క్రికెటర్‌గా రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు. ఐర్లాండ్‌కు చెందిన స్టిర్లింగ్ (325) ముందున్నాడు.