భారత క్రికెట్ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో మాజీ సారథి ధోనీ
భారత క్రికెట్ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అనుకోని అతిథిలా తళుక్కున మెరిశాడు. చాలా రోజుల తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చిన ధోనీ... యువ ఆటగాళ్లతో సంభాషణతో ముచ్చటించారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం ధోనీ కుటుంబంతో కలిసి యూకే పర్యటనలో ఉన్నారు. గత గురువారం అతడి బర్త్‌డేను కూడా ఇక్కడే జరుపుకొన్నాడు. వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించాడు. మరోవైపు టీమ్‌ఇండియా కూడా ఇంగ్లండ్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతోంది. ఇప్పటికే ఒక టెస్టు, రెండు టీ20 మ్యాచ్‌లను ఆడేసింది.
ఇక బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా 170/8 స్కోరు చేసింది. అనంతరం ఇంగ్లాండ్‌ను 121 పరుగులకే ఆలౌట్ చేసి 49 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఎంఎస్ ధోనీ ఎంట్రీ ఇచ్చాడు. యువ బ్యాటర్ ఇషాన్ కిషన్, చాహల్‌తో సహా ఇతర క్రికెటర్లతో ముచ్చటించాడు. ఈ ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. 'దిగ్గజం మాట్లాడుతుంటే వినేందుకు చెవులన్నీ సిద్ధమే' అని బీసీసీఐ క్యాప్షన్ ఇచ్చింది. ఇక భారత టీ20 లీగ్ జట్టు చెన్నై కూడా ఫొటోను షేర్ చేసి.. 'యువ ప్లేయర్లతో 'కీపింగ్' ఇన్ టచ్' అని క్యాప్షన్ జోడించింది.