శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 18 మే 2021 (12:28 IST)

తౌక్తే: గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గుజరాత్‌ తీరాన్ని తాకిన తుపాను

తౌక్తే తుపాను గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గుజరాత్ తీరాన్ని తాకింది. ముంబయిలో భారీ వర్షాలతో అల్లకల్లోలం సృష్టించిన తౌక్తే, గుజరాత్ తీరం వైపు దూసుకురావడంతో లక్షన్నర మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు రెండు చిన్న నౌకలు తీరానికి చేరే దారి కనిపించక అరేబియా సముద్రంలో చిక్కుకుపోయాయి. ఈ రెండు నౌకల్లో మొత్తం 410 మంది ఉన్నారు.

 
తౌక్తే తీవ్ర తుపానుగా మారింది. పోర్‌బందర్, భావ్‌నగర్ జిల్లాల్లో దీని ప్రభావం అత్యధికంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని చెబుతున్నారు. తుపాను తీరానికి చేరుకుందని, మరో రెండు గంటలపాటు అక్కడే నిశ్చలంగా ఉంటుందని వాతావరణ విభాగం అధికారులు చెప్పారు.

 
సహాయ కార్యక్రమాల్లో 54 ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ దళాలు
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్‌కు చెందిన 54 దళాలు తుపాను సహాయ కార్యక్రమాల్లో ఉన్నాయని గుజరాత్ అధికారులు చెప్పారని పీటీఐ చెప్పింది. తౌక్తే తుపానును దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తలు తీసుకున్న అధికారులు... పోర్ బందర్ సమీపంలోని ఒక ఆస్పత్రి నుంచి 17 మంది రోగులను, వేరే ఆస్పత్రులకు తరలించారు. కేంద్ర ప్రభుత్వం కూడా గుజరాత్‌కు సాయం అందిస్తామని భరోసా ఇచ్చింది.

 
ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ అవసరమైతే సాయం అందిస్తామని ముందుకొచ్చాయని గుజరాత్ ప్రభుత్వం చెప్పింది. మరోవైపు మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతంలో తుపాను వల్ల సంభవించిన వివిధ ఘటనల్లో ఆరుగురు చనిపోయారు. సముద్రంలో రెండు నౌకలు మునిగిపోవడంతో ముగ్గురు నావికుల ఆచూకీ ఇప్పటికీ తెలీలేదని అధికారులు చెప్పారు. రాయగఢ్ జిల్లాలో ముగ్గురు, సింధుదుర్గ్‌లో ఒక నావికుడు చనిపోయారు. నవీ ముంబయి, ఉల్సాస్ నగర్‌లో చెట్టు కూలి ఇద్దరు చనిపోయారు.

 
అరేబియా సముద్రంలో చిక్కుకున్న 273మంది
అరేబియా సముద్రంలో బాంబే హై ఆయిల్ ఫీల్డ్ దగ్గర ఓ చిన్న నౌకలో 273 మంది చిక్కుకుపోయారు. మరో నౌకలో 137 మంది ఉన్నారు. వీరిని సురక్షితంగా తీరానికి తీసుకురావడానికి నావికాదళం యుద్ధనౌకలు ఐఎన్ఎస్ కోచి, ఐఎన్ఎస్ కోల్‌కతాను పంపించారు. వీటితోపాటు ఐఎన్ఎస్ తల్వార్‌ను కూడా సహాయ కార్యక్రమాల్లో మోహరించారు.

 
బాంబే హై ఆయిల్ ఫీల్డ్ ముంబయి తీరానికి 176 కిలోమీటర్ల దూరంలో ఉంది. సహాయ కార్యక్రమాలు రాత్రంతా కొనసాగాయి. ఉదయం 6 గంటల వరకూ 148 మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. అత్యంత అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో ప్రయాణించిన ఐఎన్ఎస్ కోచి, ఐఎన్ఎస్ కోల్‌కతా 111 మందిని కాపాడగా, నేవీకి చెందిన మరో రెండు నౌకలు 35 మందిని కాపాడాయి.

 
అరేబియా సముద్రంలో గాల్ కన్‌స్ట్రక్టర్ అనే బార్జ్ మీద చిక్కుకుపోయిన 137 మందిని ఖాళీ చేయించేందుకు వాటర్ లిల్లీ అనే అత్యవసర నౌకతోపాటు మరో రెండు నౌకలు వెళ్లాయి. సాగర్ భూషణ్ అనే మరో ఆయిల్ రిగ్ మీద 101 మంది ఉన్నారు. వీరికి సాయం అందించేందుకు ఐఎన్ఎస్ తల్వార్‌ను పంపించారు.