తౌతే తుఫాను బీభత్సం ... గోవాకు విమాన సర్వీసులు రద్దు
అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌతే తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారి బీభత్సం సృష్టిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయానికి తౌతే గోవాలోని పాంజిమ్‌కు పశ్చిమ వాయవ్య దిశగా 120 కిలోమీటర్ల దూరంలో, ముంబైకి దక్షిణంగా 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీంతో ఈ తుఫాను ప్రభావం గోవాపైనా అధికంగానే ఉంది.
మరోవైపు, తుఫాను మరింత తీవ్రరూపు దాల్చుతుండడంతో గోవాకు అన్ని విమానాల రాకపోకలను రద్దు చేశారు. గోవాలో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. భారీ వర్షాలు, బలమైన గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు ఒకరు మృతి చెందినట్టు అధికారిక సమచారం వెల్లడిస్తోంది.
గోవాలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అటు కేరళ, కర్ణాటకలోనూ తౌతే భారీ వర్షాలు, వరదలకు కారణమైంది. కేరళలో అనేక డ్యాములు పొంగిపొర్లుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. కర్ణాటకలో 6 జిల్లాలపై తౌతే ప్రభావం అధికంగా ఉంది. 73 గ్రామాలు అతలాకుతలం కాగా, నలుగురు మృత్యువాతపడ్డారు.
తౌతే తుపాను గుజరాత్ దిశగా పయనిస్తుండటంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తం అయ్యాయి. 150 మంది సభ్యులు గల 5 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పుణే నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్ బయల్దేరాయి. ఈ తుఫాను ప్రభావం తమిళనాడుని దక్షిణాది జిల్లాల్లో ఉండటంతో అక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో వాతావరణం కూడా కాస్త చల్లబడింది.