బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 మే 2021 (14:30 IST)

అగ్రరాజ్యం తిరస్కరించిన మందుకు గోవా పచ్చజెండా.. మరణాల సంఖ్యను...

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచం చేయని పనంటూ లేదు. ఈ వైరస్  సోకకుండా కొన్ని ఫార్మా కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. అయితే, కోవిడ్ రోగుల చికిత్సకు ఇవర్‌మెక్టిన్ ఉపయోగించేందుకు అగ్రరాజ్యం అమెరికా నిరాకరించింది. కానీ, మన దేశంలో గోవా ప్రభుత్వం అనుమతిచ్చింది. 
 
అమెరికా ఆహార, ఔషధ సంస్థ (ఎఫ్‌డీఏ) ఈ మందును తిరస్కరించింది. ఇవర్‌మెక్టిన్ పూర్తిగా ఇన్‌ఫెక్షన్‌ను తొలగించదని, అయితే జబ్బు తీవ్రతను అది తగ్గిస్తుందని గోవా ప్రజారోగ్య శాఖామంత్రి విశ్వజిత్ పీ రాణే ఫేస్‌బుక్ పోస్టులో తెలిపారు. రోగికి ఐదు రోజులపాటు ప్రతిరోజూ 12 మి.గ్రా. మందును ఇస్తారని ఆయన వివరించారు. 
 
మరణాల రేటును, కోలుకునే సమయాన్ని తగ్గించడం, వైరస్‌ను లేకుండా చేయడం ఇవర్‌మెక్టిన్ చికిత్స వల్ల కలిగే ప్రయోజనాలని, యూకే, ఇటలీ, స్పెయిన్, జపాన్ నిపుణుల బృందాలు తేల్చిచెప్పాయని రాణే పేర్కొన్నారు. అయితే ఈ మందుతో ఏదో ఙభరోసా లభించినట్టు భావించరాదని, దీంతోపాటే మిగతా చికిత్సలూ కొనసాగించాలని స్పష్టం చేశారు. 
 
అన్ని స్థాయిల ఆస్పత్రులకు ఈ మందు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. లక్షణాలున్నా, లేకున్నా ఈ మందు వాడాలని సూచించారు. గోవాలో సోమవారం కొత్త కరోనా కేసులు 2,804 నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,21,650కి చేరుకుంది. అలాగే 50 మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 1,729కు పెరిగింది.