కరోనా కట్టడికి డబుల్ మాస్క్ : ఒకే రకమైన మాస్క్‌లు వద్దంటున్న కేంద్రం
కరోనా వైరస్ బారినపడుకుండా ఉండేందుకు డబుల్ మాస్క్‌లు పెట్టుకోవాలని వైద్యులు సూచన చేస్తున్నారు. అయితే, డబుల్ మాస్క్ ధరించడంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా కొన్ని రకాలైన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఒకే రకమైన 2 మాస్క్‌లను ధరించవద్దని సూచించింది.
రెండు మాస్క్‌లలో ఒకటి సర్జికల్ మాస్క్, మరొకటి వస్త్రంతో తయారుచేసిన మాస్క్ ఉండేలా చూసుకోవాలని సలహా ఇచ్చింది. అలాగే, ఒకే మాస్క్‌ను వరుసగా రెండు రోజులపాటు ధరించవద్దని పేర్కొన్నది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా రెండో దశ వ్యాప్తి జోరుగా సాగుతోంది. ఈ సెంకండ్ వేవ్ అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంది. కరోనా కట్టడిలో ముఖానికి మాస్కు ధారణ కీలక పాత్ర పోషిస్తోంది.
ముఖానికి రెండు మాస్కులను ధరించడం ద్వారా మహమ్మారి వ్యాప్తిని రెండురెట్లు మెరుగ్గా నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో 'డబుల్ మాస్కుల ధారణ' విషయంలో పాటించాల్సిన నియమాలను కేంద్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది.
డబుల్ మాస్కు ధారణలో భాగంగా ఒకటి సర్జికల్ మాస్క్, మరొకటి రెండు లేదా మూడు పొరలతో తయారైన మాస్క్‌ను ధరించాలి. ముక్కు మీద బిగుతుగా ఉండేలా మాస్క్ ధరించాలి. శ్వాస క్రియకు ఆటంకం కలిగించేలా మాస్క్ ఉండకూడదు. వస్త్రంతో కూడిన మాస్క్‌ను తరుచూ ఉతుకుతూ ఉండాలి. ఒకే రకమైన రెండు మాస్క్‌లను డబుల్ మాస్క్‌గా ధరించవద్దు. ఒకే మాస్క్‌ను వరుసగా 2 రోజులు వాడొద్దని పేర్కొంది.
నాసికా రంధ్రాల్లోకి వెళ్లే సార్స్-కోవ్-2 వైరస్‌ను సాధారణ మాస్క్‌తో పోలిస్తే డబుల్ మాస్క్ రెండు రెట్లు సమర్థంగా అడ్డుకుంటుందని ఓ అధ్యయనం తెలిపింది. సరైన మాస్కు ధారణ ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించింది. ఈ వివరాలు జామా ఇంటర్నల్ మెడిసన్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.