శనివారం, 23 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 మే 2021 (16:08 IST)

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ - దేశంలో 17 కోట్ల మందికి టీకాలు

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. త్వరలోనే భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతుంది., దీంతో కోహ్లీ క‌రోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. 
 
తాను వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన కోహ్లి.. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాలని, సాధ్య‌మైనంత త్వ‌ర‌గా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని సూచించాడు. 
 
వ‌చ్చే నెల‌లో న్యూజిలాండ్‌తో జ‌ర‌గ‌బోయే డబ్ల్యూటీసీ ఫైన‌ల్ కోసం ఇండియ‌న్ టీమ్ త్వ‌ర‌లోనే ఇంగ్లండ్ వెళ్ల‌నుంది. ఆలోపే ఆ టీమ్‌లోని ప్లేయ‌ర్స్ అంద‌రూ త‌మ తొలి డోసు వ్యాక్సిన్ తీసుకోవాల‌ని భావిస్తున్నారు.
 
అటు సీనియ‌ర్ పేస్ బౌల‌ర్ ఇషాంత్ శ‌ర్మ కూడా త‌న భార్య ప్ర‌తిమా సింగ్‌తో క‌లిసి వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఇప్ప‌టికే శిఖర్ ధావ‌న్‌, ర‌హానే, ఉమేష్ యాద‌వ్‌లాంటి వాళ్లు క‌రోనా వ్యాక్సిన్లు తీసుకున్నారు. 
 
ఐపీఎల్ వాయిదా ప‌డ‌గానే ఇంటికెళ్లిపోయిన కోహ్లి.. ఆ వెంట‌నే కొవిడ్ స‌హాయ‌క కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంతోపాటు త‌న‌వంతుగా రూ.2 కోట్లు విరాళ‌మిచ్చాడు. భార్య అనుష్క శ‌ర్మ‌తో క‌లిసి మ‌రిన్ని విరాళాలు సేక‌రిస్తున్నాడు.
 
ఇంకోవైపు, కరోనా టీకా పంపిణీలో భారత్‌ మరో మైలురాయిని అధిగ‌మించింది. వ్యాక్సిన్‌ డ్రైవ్‌లో ఇప్పటివరకు 17 కోట్లకుపైగా మోతాదులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. 
 
ఆదివారం రాత్రి వరకు దేశవ్యాప్తంగా డోసులు వేసినట్లు పేర్కొంది. ఇందులో ఆరోగ్య కార్యకర్తలు 95,46,871 మందికి మొదటి డోసు, మరో 64,71,090 మందికి రెండో మోతాదు అందించినట్లు చెప్పింది. 1,39,71,341 ఫ్రంట్‌లైన్ వర్కర్‌కు మొదటి డోసు, 77,54,283 రెండో మోతాదు వేసినట్లు తెలిపింది.
 
18-44 ఏళ్ల మధ్య వయస్సున్న వారికి 20,29,395 ఫస్ట్‌ డోస్‌ వేసినట్లు పేర్కొంది. 45-60 ఏళ్ల మధ్య ఉన్న 5,51,74,561 మంది లబ్ధిదారులకు తొలి, మరో 65,55,714 మందికి సెకండ్‌ డోస్‌ అందజేసినట్లు పేర్కొంది. 
 
60 ఏళ్లు పైబడిన 5,36,72,259 మందికి తొలి మోతాదు, 1,49,77,918 రెండో మోతాదు టీకా వేసినట్లు వివరించింది. 18-44 మధ్య వయస్కులకు ఆదివారం ఒకే రోజు 2,43,958 మంది లబ్ధిదారులు టీకాలు వేయగా.. ఇప్పటి వరకు 20,29,395 మంది తొలి మోతాదు అందింది.
 
టీకా డ్రైవ్‌ ఆదివారం 114వ రోజుకు చేరగా.. ఒకే రోజు 6,71,646 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. ఆదివారం సెలవు దినం కావడంతో చాలా రాష్ట్రాలు టీకాలు వేయలేదని చెప్పింది. 
 
ఇదిలావుంటే, వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దాదాపు 18 కోట్ల వ్యాక్సిన్లు ఉచితంగా సరఫరా చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో 9 లక్షల డోసులు అందజేస్తామని చెప్పింది.