1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 మే 2021 (13:35 IST)

విద్యుత్ బల్బుల్లోని ఫ్యూజుల్లా పోతున్న ప్రాణాలు.. ఎక్కడ?

దేశంలో కరోనా వైరస్ మారణహోమం సృష్టిస్తోంది. ఈ వైరస్ బారినపడిన రోగులకు సరైన వైద్యం అందక ప్రాణాలు విడుస్తున్నారు. మరికొందరు ఆక్సిజన్ అందక చనిపోతారు. ఈ పరిస్థితి దేశంలోని పలు రాష్ట్రాల్లో నెలకొనివుంది. ముఖ్యంగా, ఆక్సిజన్ కొరతతో హస్తినవాసులు తల్లడిల్లిపోయారు. ఇప్పుడు గోవా కూడా అదే పరిస్థితులను ఎదుర్కొంటోంది. 
 
ఒకటి కాదు.. రెండు కాదు.. 4 రోజుల్లోనే 74 మంది కరోనా బాధితులు ఆక్సిజన్ అందక మరణించారు. అదీ ఒక్క ఆసుపత్రిలోనే. గోవాలోనే పెద్దాసుపత్రి అయిన గోవా మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ఈ దారుణాలు జరిగాయి. శుక్రవారం తెల్లవారుజామున 13 మంది చనిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. 
 
అంతకుముందు గురువారం 15 మంది చనిపోగా, బుధవారం 20 మంది, మంగళవారం 26 మంది ఆక్సిజన్ లేక మృతి చెందారు. ఈ ఘటనలపై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో ఇప్పుడు ఆక్సిజన్ కోసం ఢిల్లీ, బెంగాల్, కేరళ, కర్ణాటకలాగానే గోవా కూడా కేంద్రాన్ని సంప్రదించింది. 
 
పది రోజుల్లో రాష్ట్రానికి కేవలం 40 టన్నుల ఆక్సిజన్ వచ్చింది. కోల్హాపూర్ ప్లాంట్ నుంచి గోవాకు కేటాయించిన 110 టన్నుల్లో మే 1 నుంచి 10 మధ్య 66.74 టన్నులను సరఫరా చేశారు. ఈ నేపథ్యంలోనే రోజువారీ కేటాయింపులను 11 టన్నుల నుంచి 22 టన్నులకు పెంచాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.