శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 30 అక్టోబరు 2020 (21:36 IST)

టర్కీ భూకంపం: నలుగురి మృతి.. గ్రీస్‌లో సునామీ - Newsreel

టర్కీలోని ఏజియన్ తీర ప్రాంతాన్ని భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయని.. భూకంప కేంద్రం టర్కీలోని ఇజ్మిర్ ప్రావిన్స్‌లో ఉందని అమెరికా జియలాజికల్ సర్వే తెలిపింది. టర్కీ అధికార వర్గాలు 6.6 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు చెబుతున్నాయి. ఇజ్మిర్ నగరంలో ఇప్పటివరకు నలుగురు మరణించారని, 120 మంది గాయపడ్డారని అక్కడి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

 
పదుల సంఖ్యలో భవనాలూ కూలిపోయాయి. టర్కీలోని ఇస్తాంబుల్, గ్రీస్‌‌లోని ఏథెన్స్‌లోనూ ప్రకంపనలను గుర్తించారు. టర్కీ, గ్రీస్‌లు రెండూ భూకంప ముప్పు ఉన్న ప్రాంతాలే. ఈ దేశాల్లో తరచూ భూకంపాలు వస్తుంటాయి. టర్కీలోని మూడో అతి పెద్ద పట్టణమైన ఇజ్మిర్ నగరంలో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపించాయి.

 
ఒక బహుళ అంతస్తుల భవనం కూలిపోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. కూలిన భవనాల శిథిలాల్లో చిక్కుకుపోయినవారి కోసం స్థానికులు వెతుకుతున్న వీడియోలూ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. భూకంపం కారణంగా సముద్ర మట్టం పెరిగి నగరంలోకి వరద వచ్చినట్లు స్థానిక మీడియా చెబుతోంది. చేపలు పట్టేవారు కొందరు గల్లంతైనట్లూ మీడియాలో కథనాలు వచ్చాయి.

 
భూకంపం కారణంగా చిన్నపాటి సునామీ రావడంతో గ్రీస్‌లో సామోస్ దీవిలోకి నీరు పోటెత్తింది. అనేక భవనాలు దెబ్బతిన్నాయి. గ్రీస్‌కి చెందిన మరో దీవి క్రెట్‌లోనూ భూకంప ప్రభావం కనిపించింది. 

 
1999లో 17 వేల మంది మృతి
ఈ ఏడాది జనవరిలో టర్కీలోని ఎలాజిగ్ ప్రావిన్స్‌లో భూకంపం రావడంతో 30 మంది చనిపోయారు. గత ఏడాది జులైలో గ్రీస్ రాజథాని ఏథెన్స్‌లో భూకంపం వచ్చింది. 1999లో టర్కీలోని ఇజ్మిత్ నగరంలో భూకంపం వల్ల 17 వేల మంది చనిపోయారు.