శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: గురువారం, 15 అక్టోబరు 2020 (13:48 IST)

హైదరాబాద్ భారీవర్షం, వరదలు: 24 మంది మృతి

హైదరాబాద్‌లో గత మూడు రోజులుగా వర్షాలు భారీగా కురవడంతో నగరం పూర్తిగా జలమయంగా మారిపోయింది. నగరంలో ఇలాంటి భయానక పరిస్థితి సృష్టించిన వాయుగుండం హైదరాబాదును దాటింది. సుమారు 30 ఏళ్ల తర్వాత సరిగ్గా భాగ్యనగరం మీదుగా ప్రయాణించిన వాయుగుండం చివరికి కర్ణాటక చేరింది. దీంతో నగరవాసులు వాయుగుండం తాకిడి నుండి తప్పించుకున్నారు.
 
అయితే వాయుగుండం రాష్ట్రాన్ని దాటడంతో భాగ్యనగరంలో ఇక వర్షాలు కురిసే అవకాశం లేదన్నారు వాతావరణ శాఖ అధికారులు. వాయుగుండం కర్ణాటక తాకినప్పటికీ దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పలుచోట్ల పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలుపుతున్నారు.
 
కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్‌లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపారు. బుధవారం రాత్రి కూడా నగరంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. నగరంలో మంగళవారం నుండి కురిసిన వర్షాలతో మహానగరం పూర్తిగా జలమయం అయింది. ఇప్పటికే నగరంలో కురిసిన వర్షాలకు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల ప్రవాహం ఉధృతం కావడంతో పలుచోట్ల జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.