శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 3 డిశెంబరు 2020 (13:30 IST)

బీజేపీ విజయ రహస్యం ఏంటి? పార్టీలో ఐక్యతను కాపాడుతున్న అంశాలేంటి?

భారత్‌ను 2014 నుంచీ పరిపాలిస్తున్న హిందూ జాతీయవాద భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశంలోనే అత్యంత శక్తిమంతమైన పార్టీగా అవతరించిందా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ పార్టీ రెండు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించింది. కొన్ని రాష్ట్రాల్లో పరాజయం చవిచూసినప్పటికీ, దేశ వ్యాప్తంగా చూస్తే పార్టీ పట్టు పెరుగుతోంది.

 
మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నానాటికీ బలహీనం అవుతోంది. ఒకప్పుడు శక్తిమంతమైన ప్రాంతీయ పార్టీలు నేడు క్రమంగా ప్రాబల్యాన్ని పోగొట్టుకుంటున్నాయి. మోదీని సవాల్ చేసే పార్టీ లేదా వ్యక్తి దాదాపుగా కనిపించని పరిస్థితి ఎదురవుతోంది. బీజేపీని భారత్‌లో రెండో శక్తిమంతమైన పార్టీ వ్యవస్థగా రాజకీయ విశ్లేషకుడు సుహాస్ పాల్‌శిఖర్ వివరించారు. దేశాన్ని అర శతాబ్దంపాటు పాలించిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కాంగ్రెస్‌ను తొలి శక్తిమంతమైన పార్టీ వ్యవస్థగా ఆయన అభివర్ణించారు.

 
1984లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం సంపూర్ణ ఆధిక్యం సాధించిన తర్వాత, ఆ ఘనత సాధించిన తొలి పార్టీ బీజేపీయే. ఇందిరాగాంధీ తర్వాత, దేశవ్యాప్తంగా అదే స్థాయిలో ప్రజాదరణ కలిగిన నాయకుడు మోదీనే అని సుహాస్ చెప్పారు.

 
విజయానికి కారణాలు
మోదీ ప్రజాదరణ, ప్రజల్లో మతపరమైన వర్గీకరణ, అతివాద జాతీయవాదం.. తదితర అంశాలే బీజేపీ విజయ రహస్యాలని చెప్పుకోవచ్చు. వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరంలేనంత స్థాయిలో బీజేపీకి మద్దతుదారులున్నారు. వీరిలో చాలా మంది పార్టీకి సైద్ధాంతిక మార్గదర్శక సంస్థగా నిలిచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) లేదా విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ)ల నుంచి వచ్చిన వారే. వీహెచ్‌పీని ఓ రాజకీయ విశ్లేషకుడు ఆర్‌ఎస్‌ఎస్ మిలిటెంట్ భాగస్వామిగా అభివర్ణించారు.

 
ఇటీవల కాలంలో బీజేపీకి ‘‘అపారదర్శక’’ నిధుల వెల్లువ విపరీతంగా పెరిగింది. మరోవైపు చాలా మీడియా సంస్థలు కూడా పార్టీకి గట్టి మద్దతు ప్రకటిస్తున్నాయి. ‘‘ఐక్యత’’పై విపరీతమైన దృష్టి కేంద్రీకరించడమే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల విజయానికి మూల కారణమని రాజకీయ విశ్లేషకుడు వినయ్ సీతాపతి.. తన కొత్త పుస్తం ‘‘జుగల్‌బంది: ద బీజేపీ బిఫోర్ మోదీ’’లో రాసుకొచ్చారు.

 
‘‘హిందూ జాతీయవాదానికి పెట్టని కోటలా మారిన ఆర్‌ఎస్ఎస్ వర్గాలు.. హిందూ చరిత్రను ఒక కోణంలో మాత్రమే చెబుతుంటారు. ‘శక్తిమంతమైన హిందువులు ఓడిపోవడానికి ఒకరికి ఒకరు వెన్నుపోటు పొడుచుకోవడమే కారణం. ఐక్యత లేకపోవడం వల్లే వారు ఓడిపోయారు’అని చెబుంటారు’’అని అశోక యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అయిన సీతాపతి చెప్పారు.

 
ఇస్లామోఫోబియా..
‘‘ఆర్‌ఎస్ఎస్ సభ్యులతో చేయించే కసరత్తులు కేవలం కసరత్తులు మాత్రమే కాదు. వీటిని అందరితో కలిపి చేయిస్తారు. కలసి మార్చ్ చేయడం. పిరమిడ్ ఆకారంలో నిలబడటం లాంటివి చేయిస్తారు. ప్రైవేటు సంస్థలు బృంద స్ఫూర్తిని పెంచేందుకు ఆడించే ఆటలనూ వీరు ఆడిస్తారు’’. ‘‘ముఖ్యంగా ఐక్యత ప్రాధాన్యం చెప్పడానికే ఇవన్నీ చేయిస్తారు. ఈ ఐక్యత సంస్థకు ఒక సిద్ధాంతం లాంటిది. ఈ మద్దతుదారులు సాధారణ పార్టీల మద్దతుదారుల్లాంటి వారు కాదు’’అని సీతాపతి చెప్పారు.

 
‘‘భారత్‌లో 80 శాతానికిపైగా ఉండే హిందువులను ఏకం చేయడమే బీజేపీ లక్ష్యం. అందుకే కులాలకు పార్టీ అంత ప్రాధాన్యం ఇవ్వదు. ముఖ్యంగా పురాతన హిందూ గ్రంథాలు, పురాణాల్లోని అంశాలను నొక్కిచెబుతూ.. ఇస్లామోఫోబియాను వెదజల్లుతోంది’’అని ఆయన వివరించారు. ఇతర రాజకీయ పార్టీల్లానే బీజేపీ కూడా కష్టాలను చవిచూసింది. నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో పార్టీ అధికారంలో ఉన్నది కేవలం 12ఏళ్లే. అధికారంలో ఏళ్లపాటు లేకపోవడంతో పార్టీ మద్దతుదారులకు ఎలాంటి సాయమూ అందలేదు.

 
మరోవైపు పార్టీ అగ్రనేతలైన అటల్ బిహారీ వాజ్‌పేయీ, ఎల్‌కే అడ్వాణీల మధ్య సంబంధాలు కొన్నిసార్లు ఒడిదొడుకులకు లోనయ్యేవి. ఉదాహరణకు 2002లో గుజరాత్‌లో ముస్లిం వ్యతిరేక అల్లర్ల అనంతరం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోదీని కొనసాగించడంపై వాజ్‌పేయీ, ఆయన క్యాబినెట్‌లోని కొందరు మంత్రులు అసంతృప్తితో ఉన్నట్లు చాలా వార్తలు వచ్చాయి. రైలుకు నిప్పు పెట్టిన ఘటనలో 60 మంది హిందువులు మరణించడంతో ఈ అల్లర్లు చెలరేగాయి. అయినప్పటికీ పార్టీ ఐక్యతతోనే ముందుకు వెళ్లింది. ‘‘కొన్నిసార్లు వారు చూడటానికి.. గొడవలు పడుతున్న కుటుంబం కలిసి జీవిస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే, వారు ఐక్యతకే ప్రాధాన్యం ఇస్తారు. హిందూ సమాజంలోని సమస్యలను లోతుగా విశ్లేషించి వారు ఈ ఐక్యతను తెరపైకి తీసుకొచ్చారు’’అని సీతాపతి చెప్పారు.

 
ఈ పార్టీలో అలా జరగలేదు
భారత్‌లో రాజకీయ పార్టీలను ప్రజాదరణ కలిగిన నాయకులు, సిద్ధాంతాలు, కులాలు ముందుకు నడిపిస్తుంటాయి. అసమ్మతి, అంతర్గత కలహాలు సర్వసాధారణం. పైస్థాయి నాయకుల్లో విభేదాలతో పార్టీలు చీలుతుంటాయి. కాంగ్రెస్ నుంచి వేరుపడిన చాలా మంది నాయకులు ఇలానే ప్రాంతీయ పార్టీలను పెట్టారు. కానీ, బీజేపీలో ఇప్పటివరకు ఇలాంటివేమీ జరగలేదు. ఒకప్పుడు వాజ్‌పేయీ, అడ్వాణీ.. ఇప్పుడు మోదీ, హోం మంత్రి అమిత్ షా.. ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుతో పార్టీని ఐక్యతతో నడిపించగలుగుతున్నారు.

 
‘‘చాలా మంది బీజేపీ నాయకులకు మోదీ అంటే ఇష్టం ఉండదని చెప్పగలను. సైద్ధాంతిక పరమైన అంశాలకు మోదీ కట్టుబడి ఉంటారని నేను ఇంటర్వ్యూ చేసిన వారిలో చాలా మంది చెప్పారు. అయితే, ఆయన్ను ఆయన స్తుతించుకుంటారని, తను ఒక్కడిగా ఉండటానికి ఇష్టపడతారని వివరించారు’’అని సీతాపతి పేర్కొన్నారు. బీజేపీని ఒక అసాధారణ పార్టీగా రాజకీయ విశ్లేషకుడు మిలన్ వైష్ణవ్ అభివర్ణించారు.

 
గెలుస్తున్నంత వరకు అంతే..
‘‘హిందూ జాతీయవాద సంస్థల రాజకీయ పార్టీయే బీజేపీగా చెప్పుకోవచ్చు. ఈ పార్టీని అనుబంధ సంస్థల నుంచి వేరుచేయడం చాలా కష్టం. ఈ సంస్థల నుంచి బీజేపీకి చాలా మద్దతు వస్తుంది. పార్టీ నుంచి ఎవరూ బయటకు పోకుండా ఈ సంస్థలే కాపాడుతుంటాయి’’అని ద కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ ఇన్ వాషింగ్టన్‌లో పరిశోధకుడైన వైష్ణవ్ చెప్పారు.

 
‘‘బీజేపీ నుంచి అసమ్మతివాదులు బయటకు వెళ్లరని కాదు.. అయితే, బయటకు వెళ్లినవారు రాజకీయంగా పెద్దగా విజయం సాధించలేరు. మళ్లీ పార్టీలోకి వచ్చేస్తారు. ఎందుకంటే బీజేపీ ఒక సైద్ధాంతిక పార్టీ. సిద్ధాంతాలే ఈ పార్టీని కలిపి ఉంచుతున్నాయి. లెఫ్ట్, రైట్ పార్టీలలోనే ఇలాంటివి కనిపిస్తుంటాయి’’అని ఐడియాలజీ అండ్ ఐడెంటిటీ పుస్తక రచయిత, రాజకీయ విశ్లేషకుడు రాహుల్ వర్మ చెప్పారు.

 
‘‘బీజేపీ ఎప్పటికీ ఇలానే ఉంటుందా? అనేది ఊహించడం కష్టమే. అయితే, ఇతర పార్టీల్లోని అసమ్మతిదారులకు బీజేపీ ఆహ్వానం పలుకుతోంది. దీని వల్ల సైద్ధాంతరపరమైన విభేదాలు రావొచ్చు. అయితే ఈ విభేదాలు పెద్దవి కాకుండా ఎంతకాలం నడిపించగలరు?’’అని రాహుల్ అన్నారు. పార్టీ ఎన్నికల్లో గెలుస్తున్నంత వరకు ఇవి బయటకు రాకపోవచ్చేమో.

 
అందుకే బీజేపీకి ఎన్నికలు అనేవి మూల స్తంభాల్లాంటివి. పార్టీకి మద్దతుదారులు క్రమంగా పెరుగుతున్నారని రాహుల్ అన్నారు. అయితే, అధినాయకత్వం మాత్రం ఇప్పటికీ కొన్ని ఉన్నత కులాల చేతుల్లోనే ఉందని వివరించారు. ఇలాంటి వైరుధ్యాలను భవిష్యత్‌లో పార్టీ పరిష్కరించాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.